Rajkumari Amrit Kaur
-
ఒక్క మాట వంద అర్థాలు
ఒక్క మాటలో వంద అర్థాలు దాగి ఉంటాయి. అన్ని అర్థాలను ఒక్కమాటలో చెప్పడమంటే లోకాన్ని చదివేసి ఉండాలి. సమాజాన్ని ఔపోసన పట్టి ఉండాలి. ‘మహిళ’ విషయంలో సమాజం ఎలా ఉంటుందో చెప్పకుండా చెప్పింది నివేదా థామస్. ఇటీవల ఆమె నటించిన ‘వి’ సినిమా విడుదల సందర్భంగా ఒక జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె నర్మగర్భంగా ఒక మాటన్నారు. ‘హీరోయిన్ పాత్ర రూపకల్పన అనేది చిత్ర నిర్మాత, దర్శకుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో భాషకు సంబంధం లేదు’ అన్నదామె. ఏ భాషలోనయినా హీరోయిన్ను గ్లామర్ డాల్‌గా చూపించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆమె అన్న మాటకు చాలా ప్రాధాన్యం ఉంది. స్త్రీ విషయంలో మన సమాజం దృష్టి కోణాన్ని చెప్పారు నివేద. ఇది ఇప్పటి సంగతి మాత్రమే కాదు. అయితే ఇప్పటి అమ్మాయిలు ధైర్యంగా, తెలివిగా వ్యక్తం చేస్తున్నారంతే. ఇది సినిమాలకు మాత్రమే పరిమితమైన వివక్ష కాదు. రాజకీయరంగంలోనూ ఉందనడానికి రాజ్‌కుమారీ అమృత్ కౌర్ పెద్ద ఉదాహరణ. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి ఆరోగ్య మంత్రి కౌర్. ట్యూబర్ క్యులోసిస్ అసోసియేషన్, రెడ్‌క్రాస్ వంటి ఆరోగ్య సంస్థల్లో పని చేశారామె. మహిళల ఆరోగ్యం పట్ల మన సమాజం లో శ్రద్ధ లేకపోవడానికి గమనించిన ఆమె గాంధీజీ, నెహ్రూల దగ్గర ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) స్థాపన అవసరాన్ని ప్రతిపాదించారు. తర్వాత ఎయిమ్స్ స్థాపన జరిగింది. కానీ పేరు, గుర్తింపు ఆమెకు రాలేదు. అంతే కాదు... ఆ తర్వాత రాజకీయాల్లో ఆమె పేరు కనిపించలేదు, వినిపించలేదు. -
ఉద్యమ నాయిక!
స్ఫూర్తి రాజ్‌కుమారి అమృత్ కౌర్ రాజ్‌కుమారి అమృత్ కౌర్... భారత జాతీయోద్యమంలో పాల్గొన్న మహిళల్లో ఒకరు. ఆమె 1822లో లక్నోలో పుట్టారు. వారిది కపుర్తల రాజకుటుంబం. ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలు, సాంఘిక సంస్కర్త. గాంధీ బాటలో హరిజన ఉద్ధరణకు, మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. జలియన్‌వాలాబాగ్ దురంతం రాజ్‌కుమారిని కలచివేసింది. గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితమై స్వాతంత్య్రోద్యమంలో చొరవగా పాల్గొన్నారామె. దండి సత్యాగ్రహం సందర్భంగా 1930లో ఆమెను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుపాలు చేసింది. ఆ తర్వాత ఏడేళ్లకు ఆయుధాలు రవాణా చేస్తున్నారనే నెపం మోపి ఆమెను మరోసారి అరెస్ట్ చేశారు. అప్పుడామె మూడేళ్ల కొడుకును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమంలో భాగంగా రాజ్‌కుమారి దేశమంతటా పర్యటించారు. అంటరానితన నిర్మూలన అవసరాన్ని వివరించారు. ఆమె వెళ్లిన ప్రతిచోటా మహిళలతో ఓ చిన్న సమూహాన్ని ఏర్పరిచి చదువకు బీజాలు వేశారు. రాజకుటుంబంలో పుట్టిన యువరాణి సామాన్యుల కోసం ఉద్యమించడం, సామాన్యులతో కలిసి పని చేయడం వల్ల ఆమె స్ఫూర్తితో అనేకమంది ఉద్యమబాటపట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్‌కుమారి కౌర్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో ఉన్న అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్) ఆమె చొరవతోనే ఏర్పాటైంది.