‘ర్యాలంపాడు’కి బీటలు
గద్వాల రూరల్: ‘ర్యాలంపాడు జలాశయం ప్రమాదపుటంచుల్లోకి వెళ్లింది. కట్ట తెగితే ఏకంగా 20గ్రామాలు పూర్తిగా ఊడ్చుపెట్టుకుని పోవడం ఖాయం.’ ఇదేదో స్థానికులు చెబుతున్న మాట కాదు.. సాగు నీటిపారుదల శాఖ అధికారులే ప్రభుత్వానికి పంపిన హెచ్చరికలు. ఈ క్రమంలో ఇద్దరు సీఈలతో కూడిన ఇంజనీర్ల బృందం శనివారం ర్యాలంపాడు జలాశయాన్ని సందర్శించింది. ఎక్కడ్కెడ లీకేజీలున్నాయో తెలుసుకునేందుకు డ్యాం చుట్టూ ఇంజనీర్లు కలియదిరిగారు. త్వరలో పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు.
►జోగుళాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ధరూరు మండలం ర్యాలంపాడు వద్ద రూ.192 కోట్ల వ్యయంతో జలాశయాన్ని నిర్మించారు. 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం నుంచి 1.36లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా లక్ష్యంగా నిర్మాణం చేపట్టారు. 2014లో అందుబాటులోకి వచ్చిన ఈ జలాశయంలో మొదటి నాలుగేళ్లు రెండు టీఎంసీల కంటే తక్కువగానే నీటిని నిల్వ చేశారు. 2018, 2019, 2020లో వరుసగా జలాశయంలో పూర్తిస్థాయి 4 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. అయితే ఈ ఏడాది కూడా భారీగా వరద నీరు జూరాలకు వచ్చి చేరడంతో జూలై మొదటి వారంలోనే నీటిని ర్యాలంపాడు జలాయంలోకి ఎత్తిపోశారు. ఈ క్రమంలోనే జలాశయం ఆనకట్ట నుంచి పెద్ద ఎత్తున నీరు లీకేజీ కావడం మొదలైంది. ఈ విషయాన్ని 25 రోజుల కిందట అధికారులు గురించి.. పొంచి ఉన్న ముప్పును రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియజేశారు.
3 కిలోమీటర్ల మేర నీరు లీకేజీ..
జలాశయం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర రాళ్లకట్ట నిర్మించారు. సహజంగా జలాశయాల్లో లీకేజీలు ఎర్త్స్లోపుల నుంచి విడుదలవుతాయి. కానీ ర్యాలంపాడులో మాత్రం 3 కిలోమీటర్ల మేర ఉన్న రాక్‌టోల్ నుంచి భారీగా నీరు లీకేజీ అవుతుంది. జలాశయంలో పూర్తిస్థాయిలో అంటే 4 టీఎంసీల మేర నీటిని నిల్వ చేస్తే కట్టకు గండి పడి దాని కింద ఉన్న 20 గ్రామాలు పూర్తిగా నీటిలో కొట్టుకుపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో గద్వాల పట్టణం, అయిజ, మల్దకల్‌తో పాటు ధరూరు, గద్వాల, మల్దకల్, అయిజ మండలాల్లోని 17 గ్రామాల వరకు పూర్తిగా నీటమునుగుతాయి.
ప్రమాదకరమే..
ర్యాలంపాడు కట్ట చుట్టూ రాక్పోల్ ద్వారా నీరు లీకేజీ అవుతున్న విషయాన్ని 25 రోజుల క్రితం గుర్తించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. శనివారం ప్రత్యేక బృందం జలాశయాన్ని పరిశీలించింది. ర్యాలంపాడు నుంచి వెలువడు తున్న లీకేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని, 2 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయవద్దంటూ సూచించింది. కట్ట తెగితే దాని కింద ఉన్న గ్రామాలు ముంపునకు గురవుతాయని పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం లేదు. వానాకాలం పంటకు ఇబ్బంది లేకుండా ఆయకట్టుకు నీటిని అందిస్తాం. యాసంగికి మాత్రం కష్టం.
– శ్రీనివాస్‌రావు, ఎస్ఈ, జిల్లా సాగునీటిపారుదల శాఖ