జనాభా నియంత్రణతోనే అభివృద్ధి
కర్నూలు(జిల్లా పరిషత్): జనాభా నియంత్రణతోనే అభివృద్ధి సాధ్యమని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కర్నూలు నగరంలో చేపట్టిన భారీ ర్యాలీని ఎంపీతో పాటు జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కలెక్టరేట్ నుంచి మెడికల్ కాలేజీ మీదుగా రాజ్‌విహార్ చేరుకుంది. అనంతరం ప్రాంతీయ శిక్షణ కేంద్రం(ఫిమేల్) ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ నిరక్షరాస్యత, కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకపోవడం వల్లే జనాభా పెరుగుతోందన్నారు. అధిక జనాభా వల్ల పిల్లల అవసరాలు తీర్చలేరన్నారు. అధిక సంతానానికి మూఢనమ్మకాలు కూడా కారణమని, జనాభా నియంత్రణకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ జనాభా పెరిగితే భూమి తక్కువ అవుతుందని, ఇదే సమయంలో పంటలు తగ్గి ఆహార కొరత ఏర్పడుతుందన్నారు. ఇటీవల కాలంలో జనాభా నియంత్రణపై గ్రామీణ ప్రాంతాల్లోనూ అవగాహన పెరుగుతోందని, ఒకరు లేక ఇద్దరు పిల్లలు చాలనే నిర్ణయానికి చాలా కుటుంబాలు వచ్చాయన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మీనాక్షి మహదేవ్ మాట్లాడుతూ ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే వివాహం చేసుకోవాలని.. భార్యాభర్తల మానసిక, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే కుటుంబ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం విశిష్ట సేవలందించిన వైద్యులు, సిబ్బందికి, వ్యాసరచన పోటీలో విజేతలైన నర్సింగ్ విద్యార్థినులకు బహుమతులు, పురస్కారాలు అందజేశారు. ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రాజాసుబ్బారావు, క్షయ నియంత్రణాధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు, మలేరియా నియంత్రణాధికారి హుసేన్‌పీరా, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వెంకటరమణ, డెమో రమాదేవి, డిప్యూటీ డెమో లక్ష్మీనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.