రాయ్ విడుదలకు తాజా ప్రతిపాదన
న్యూఢిల్లీ: తమ చీఫ్ సుబ్రతారాయ్, ఇరువురు డెరైక్టర్లను జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడిపించడానికి ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేసి సుప్రీంకోర్టు ఆమోదం పొందలేకపోయిన సహారా, గురువారం మరో కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. దీనిప్రకారం నాలుగు రోజుల్లో సంస్థ రూ.2,500 కోట్లు చెల్లిస్తుంది. 60 రోజుల్లో మరో రూ.2,500 కోట్లు చెల్లింపులు జరుపుతుంది. తదుపరి 90 రోజుల్లో రూ.5,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని ఇస్తుంది.
అయితే గురువారం సమయం లేకపోవడంతో, ఈ ప్రతిపాదనను సోమవారం పరిశీలిస్తామని రాయ్ తరఫు సీనియర్ న్యాయవాదులు రామ్‌జత్మలానీ, ధావన్‌కు సుప్రీం తెలిపింది. కాగా డబ్బు సమీకరణకు సంబంధించి డీఫ్రీజ్ చేయాలని కోరుతున్న గ్రూప్ కంపెనీల బ్యాంక్ అకౌంట్ నంబర్లనూ సుప్రీంకు సహారా న్యాయవాదులు సమర్పించినట్లు వార్తలు వచ్చినప్పటికీ... ఇవి ధృవపడాల్సి ఉంది. మదుపరుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డబ్బు వసూలు చేసిన వ్యవహారంలో... మార్చి 4 నుంచి తీహార్ జైలులో ఉన్న రాయ్, డెరైక్టర్ల బెయిల్‌కు రూ.10,000 కోట్లను చెల్లించాలని జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.