ప్రాణత్యాగానికైనా సిద్ధం
హైదరాబాద్: భాషా పండితులు, పీఈటీల పదోన్నతుల సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు(ఆర్‌యూపీపీ–టీ), వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ (పీఈటీఏ టీఎస్)ల రాష్ట్ర కమిటీ నాయకు లు అన్నారు. ఏ ఉద్యోగంలోనైనా ప్రమోషన్లు ఉన్నాయని, భాషా పండితులు, పీఈటీలు మాత్రం చేరిన కేడర్లోనే రిటైరవుతున్నారని వాపోయారు. భాషాపండితులు, పీఈటీల సమస్యపై స్పందించి పోస్టులను అప్‌గ్రెడేషన్ చేస్తూ జీవో 15పై సీఎం కేసీఆర్ సంతకం చేసినా దాని అమలులో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
భాషా పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, వ్యాయామవిద్య ఉపా ధ్యాయ సంఘాలు ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్షలు నిర్వహించాయి. దీక్షల్లో ఆర్‌యూపీపీటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.డి. అబ్దుల్లా, గండమల్ల విశ్వరూపం, పీఈ టీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు డాక్టర్ ఎస్.సోమేశ్వర్రావు, బి.రాఘవరెడ్డిలతోపాటు తెలంగా ణలోని అన్నిజిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు కూర్చున్నారు. అన్నిజిల్లాల నుంచి పండిత ఉపాధ్యాయులు, పీఈటీలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీక్షలకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎ.నర్సిరెడ్డి, సరోత్తమ్‌రెడ్డి, చావ రవి (టీఎస్‌యూటీఎఫ్) భుజంగరావు(ఎస్టీయూ), రాఘవరెడ్డి (పీఈటీ అసోసియేషన్), రఘునందన్ (టీటీఎఫ్), పి.లక్ష్మయ్య(జూనియర్ కళాశాల పీఈటీ అసోసియేషన్) సంఘీభావం ప్రకటించారు.
సీఎంకు పండిత టీచర్ల సమస్యలు పట్టవా?
భాషా పండితుడైన సీఎం కేసీఆర్ భాషా పండితుల సమస్యలు పట్టించుకోకపోవడం శోచనీయమని ఆర్.కృష్ణయ్య అన్నారు. పండిత, పీఈటీ పోస్టుల్లో 25, 30 ఏళ్లుగా పనిచేస్తున్నా ప్రమోషన్లు లేకపోవడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ భాషా పండితులు, పీఈటీల సమస్యలపై మండలిలో నిలదీస్తామన్నారు. పదోన్నతులతో 12 వేలకుపైగా భాషాపండితులు, పీఈటీలు, లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. భాషా పండితుల నిరాహారదీక్షలను పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా దీక్షలు కొనసాగిస్తున్నా రంటూ పోలీసులు 8 మంది భాషాపండితులను బలవంతంగా అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 5 తర్వాత కూడా దీక్షలను యధావిధిగా కొనసాగిస్తుండడంతో పోలీసులు టీచర్లను దీక్షలను ముగించాలని చెప్పినప్పటికీ రాత్రి ఏడుగంటల తర్వాత పోలీసులు వారిని అరెస్టు చేశారు.