గులాబీ దళం ఖరారు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అభ్యర్థుల ఖరారులో టీఆర్ఎస్ తొలి అడుగు వేసింది. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిసింది. ఒంటరిగానే బరిలో నిలబడతామని హెచ్చరిస్తూనే కలిసి వచ్చే మిత్రుల కోసం ఖాళీలు ఉంచినట్టు సమాచారం. ఇదిలా ఉండగా 69 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను వ్యూహాత్మకంగా మీడియాకు లీక్ చేసింది. జాబితా ప్రకటన తర్వాత ఉత్పన్నమయ్యే రాజకీయ పరిస్థితులను అంచనా వేసేందుకే ‘లీకు’ అస్త్రాన్ని వాడినట్లు సమాచారం. దుబ్బాక స్థానంలో సోలిపేట రామలింగారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి మధ్య నడుస్తున్న వివాదానికి తెరవేస్తూ రామలింగారెడ్డికే గులాబీ దళపతి మరో చాన్స్ ఇచ్చినట్టు సమాచారం.
గజ్వేల్ నుంచి కేసీఆర్, సిట్టింగు స్థానమైన సిద్ధిపేట నుంచి తన్నీరు హరీశ్వర్‌రావు, ఆందోల్‌లో బాబూమోహన్, సంగారెడ్డిలో చింతా ప్రభాకర్, పటాన్చెరు నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి, దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి పేర్లను ఖరారు అయినట్లు మీడియాకు లీక్ అయింది. జహీరాబాద్, నర్సాపూర్ , నారాయణఖేడ్ స్థానాలను ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే నేడు లేదా రేపు అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
సోలిపేటకు మరో చాన్స్...
అసెంబ్లీ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై అనేక ఊహాగానాలున్నాయి. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డితోపాటు కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్లు వినిపించాయి. సోలిపేట ఉద్యమంలో ముందు నడిస్తే.. కొత్త ప్రభాకర్ వెనుకుండి పార్టీని నడిపించారనే ప్రచారం ఉంది. పార్టీకి ఆయన ఆర్థికంగా సహకరించారని సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త ప్రభాకర్‌కే టికెట్ వస్తుందని ప్రచారం జరిగింది. అయితే రామలింగారెడ్డి మాత్రం టికెట్ ఆలోచన లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఎట్టకేలకు సోలిపేటకు గులాబీ బాస్ మరో చాన్స్ ఇచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గంపై కూడా తొలుత వివాదం నడిచింది. హరీష్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి చింతా ప్రభాకర్ పేరు ప్రకటించడంతో ఈ వివాదం ముగిసిపోయింది. ఆయన చెప్పినట్లుగానే తొలి జాబితాలోనే చింతా ప్రభాకర్ పేరు ఖరారు చేశారు. ఇటీవలే పార్టీలో చేరిన గూడెం మహిపాల్‌రెడ్డికి పటాన్చెరు, బాబూమోహన్‌కు అందోల్ టికెట్లను కేటాయించారు.
ఖాళీలు పొత్తుల కోసమేనా...!
ఇక నర్సాపూర్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలను వ్యూహాత్మకంగానే ఖాళీ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీకి బలమైన అభ్యర్థి దొరక్క ఖాళీలు పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నా... చివరి నిమిషంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే సమస్య తలెత్తకుండా సీట్లు సర్దుబాబు చేసేందుకు ఖాళీలు పెట్టినట్లు సమాచారం. కాంగ్రెస్ పైమూడు సీట్లతో పాటు పటాన్చెరు, ఆందోల్, సంగారెడ్డి స్థానాలను కోరే అవకాశం ఉంది.