కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం అందాలి
► ఉద్యమాలతోనే హక్కులు సాధ్యం
► కార్మికుల దీక్షలకు బీజేపీ మద్దతు
► కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం యాజమాన్యం ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధానకార్యదర్శి పి.సుగుణాకర్‌రావు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల రిలేదీక్షలకు గురువారం సంఘీభావం ప్రకటించారు. కార్మిక సంఘాల నాయకులు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగి హక్కులు సాధించుకోవాలని సూచించారు. అన్ని పార్టీల నాయకులు జెండాలను పక్కన బెట్టి ఒకే అజెండాతో కార్మికుల పక్షాన నివాలని కోరారు.
ఒకే కంపెనీలో చేస్తున్న కార్మికులకు అలవెన్సుల చెల్లింపులో తారతమ్యం తగదన్నారు. కనీసవేతనాలను చెల్లింపునకు కేంద్ర బండారు దత్తాత్రేయకు సమస్యను విన్నవించి పరిష్కరించేందుకు తనవంతు పాటుపడతానని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ పరిధిలో ఉంటున్న కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు బీ–కేటగిరీ వేతనాలు చెల్లించాలని సూచించారు. కార్మిక సంఘాల నాయకులు ఏకపక్షంగా ఉండి సమస్యలను వ్యూహాత్మకంగా వ్యవహరించి పరిష్కరించాలని కోరారు. యూనియన్ నాయకులు బాబర్‌సలీంపాషా, బడికెల రాజలింగం, కౌశిక హరి, మనోహర్‌రావు, చందర్, అహ్మద్‌బాబా, గాండ్ల ధర్మపురి, నాంసాని శంకర్, బుచ్చయ్య, రామాచారి, గీట్ల లక్ష్మారెడ్డి, వెంగల బాపు, బొద్దున రాజేశం, బాల్రాజ్కుమార్, నాయకులు పాల్గొన్నారు.
దీక్షలకు తెలంగాణ జేఏసీ మద్దతు
ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల దీక్షలకు తెలంగాణ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గురువారం టీజేఏసీ నాయకులు జేవీ.రాజు, పొన్నం విజయ్, కానుగంటి శ్రీనివాస్, వేముల అశోక్ శిబిరాన్ని సందర్శంచారు. త్వరలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం రానున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ దీక్షలో ఉన్న కాంట్రాక్టు కార్మికులు మద్దతు తెలిపారు.
ముగిసిన టూల్ డౌన్ సమ్మె..
కాంట్రాక్టు కార్మికులు రిలేదీక్షలకు మద్దతుగా ప్రాజెక్టులో చేస్తున్న టూల్‌డౌన్ సమ్మె ముగించి విధులకు హాజరయ్యారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కోరిన వారం రోజుల గడువుకు యూనియన్ నాయకులు అంగీకారం తెలిపారు.