నిఖిలేందర్‌రెడ్డి
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామంలో శుక్రవారం పలు కుటుంబాలు ఉత్సాహంగా వన భోజనాలకు వెళ్లాయి. వనభోజనాలకు వెళ్లినవారు గ్రామ శివారులోని రామడుగు ప్రాజెక్టు్ట వద్ద ఆనందంగా గడిపారు. ఇంతలోనే అనుకోని విషాదం నెలకొంది. భోజనాల అనంతరం పక్కనే ఉన్న రామడుగు ప్రాజెక్టు ఎడమ కాలువ నీటిలో సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ఒకరు నీట మునిగి మృతి చెందారు. డిచ్‌పల్లి తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్సై సురేశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సుద్దులం గ్రామానికి చెందిన పలు కుటుంబాల వారు వన భోజనాలకు పక్కనే గల రామడుగు ప్రాజెక్టు వద్దకు తరలివెళ్లారు. భోజనాల అనంతరం గ్రామానికి చెందిన కల్లెడ నిఖిలేందర్‌రెడ్డి(21) మరో నలుగురు స్నేహితులతో కలిసి ఈత కొడదామని ప్రాజెక్టు కాలువ నీటిలోకి దిగాడు.
కొద్ది సేపటికే నీళ్లలో మునిగి పోయాడు. ఆందోళనకు గురైన మిగిలిన యువకులు ఈ విషయాన్ని వారి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకుని నీటిలో గాలించగా మృతదేహం లభించలేదు. సమాచారం అందుకున్న తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్సై సురేశ్‌కుమార్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. రామడుగు గ్రామానికి చెందిన గజఈతగాడు రమేశ్ అతని బృందం సభ్యులను పిలిపించారు. రమేశ్ బృందం కాలువ నీటిలో సుమారు రెండు గంటల పాటు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కల్లెడ ప్రభాకర్‌రెడ్డి, విజయ దంపతులకు నిఖిలేందర్‌రెడ్డితో పాటు కూతురు ఉన్నారు. నిఖిలేందర్‌రెడ్డి ప్రస్తుతం సీఏ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment