ఆక్షణాలు భయానకం
- నేపాల్ భూకంప మృత్యుంజయులు రమణ కుటుంబ సభ్యులు
- 2రోజులు తిండి, నీళ్లు లేకుండా నరకం
- మీడియాతో అనుభవాలు పంచుకున్న రమణ
ఆక్షణాలు జీవితంలో మరువలేం...కళ్లముందే పెద్ద భవంతులు కుప్పకూలుతున్నాయి...భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి... చూస్తుండగానే ఇరుగుపొరుగు జనం ప్రాణాలు కోల్పోతున్నారు...అని నేపాల్ భూకంపంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ మదనపల్లె వాసి రమణ తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
మదనపల్లె: నేపాల్‌లో భూకంప ప్రళయం నుంచి సురక్షితంగా బయటపడిన రమణ సొంత ఊరు మదనపల్లెకు చేరుకున్నారు. శనివారం స్థానిక జ్ఞానోదయ ఇంగ్లిషు మీడియం పాఠశాలలో మున్సిపల్ వైస్ ైచె ర్మన్ భవానీప్రసాద్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. తొలుత రమణకు భవానీ ప్రసాద్ స్వీటు తినిపించారు. అనంతరం రమణ తన అనుభవాలను వివరించారు. ఆయన మాటల్లోనే ‘ నేను 3 సంవత్సరాలుగా నేపాల్ కాఠ్మాండులోని కేంద్రీయ విద్యాలయ ఎంబసీలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. కుటుంబంతో సహా అదే ప్రాంతంలో ఉంటున్నాను. భార్య అనసూయ గృహిణిగా ఉండగా, కుమారుడు ఉదయ్‌కిరణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం, కుమార్తె జాహ్నవి పదో తరగతి చదువుతోంది. ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు భూకంపం రావడంతో కుటుంబం మొత్తం భయభ్రాంతులకు గురై ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నాం.
మాతోపాటు ఇరుగుపొరుగు వారంతా దాదాపు 200 మంది ఆ ప్రాంతంలోని ఒక మైదానంలో 2 రోజుల పాటు తిండి, నీళ్లు లేకుండా నరకం చవిచూశాం. మాకు అండగా ఒక రెస్క్యూ టీమ్ ఉండడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడగలిగాం. మదనపల్లె నుంచి మా తల్లిదండ్రులు పలుమార్లు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కొంటూనే ఉన్నారు. మేము క్షేమంగా ఉన్నామని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎనిమిది మందిని రెస్క్యూ టీమ్ ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌కు ప్రత్యేక విమానంలో పంపించింది. అనంతరం అక్కడి నుంచి మదనపల్లెకు చేరుకున్నాం. మదనపల్లెలోని ప్రశాంత్‌నగర్‌లో మా తల్లిదండ్రులు ఉన్నారు. విధి నిర్వహణ దృష్ట్యా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా మరో వారం రోజుల్లో తిరిగి నేపాల్ వెళ్లనున్నాం.