కాపీయింగ్‌కు చెక్
ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని అమలుచేస్తోంది ఇంటర్‌బోర్డు. సాంకేతిక పరిజ్ఞానంతో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న కొన్ని కళాశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతోంది. అన్ని ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్), సెల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేనున్నారు.
ధర్మపురి
పరీక్ష ప్రారంభమైన క్షణాల్లోనే ప్రశ్నపత్రం బయటపడుతోంది. సెల్ఫోన్ల ద్వారా ప్రశ్నలు బయటకు చేరవేస్తూ మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఈ దందాకు పాల్పడుతూ ర్యాంకులు తెచ్చుకుంటున్నాయి. కొన్ని కళాశాలలను మచ్చిక చేసుకుని వేల కొలది ముడుపులు చెల్లించి ర్యాంకులపంట పండించుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. దీని ఫలితంగా కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది.
ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఇంటర్‌బోర్డు చర్యలు ప్రారంభించింది. జీపీఎస్ విధానం ద్వారా సెల్ ట్రాకింగ్ విధానం అందుబాటులోకి తెచ్చి మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. 12 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలను ఈ విధానంలో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లకు, ఇతర అధికారులకు సమాచారం అందించారు.
పనితీరు ఇలా..
ప్రతీ ఇంటర్ పరీక్ష కేంద్రంలో జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో ఉన్న ఇంటర్‌బోర్డుకు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా ఆ సెంటర్‌కు వంద మీటర్ల దూరంలో ఉన్నవారు సెల్ఫోన్ల ద్వారా ఎవరెవరకు మాట్లాడుతున్నారనే సమాచారం ఇంటర్‌బోర్డుకు అందుతుంది. ఇలా ఏ సెంటర్లో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. దీంతో లీక్ వీరుల బండారం బయటపడుతుంది. ప్రశ్నలు బయటకు చేరకుండా, పరీక్ష కేంద్రాల్లో మాస్‌కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు బోర్డు ఈ సరికొత్త విధానాన్ని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా ప్రతిభగల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
మాస్ కాపీయింగ్ అరికట్టేందుకే... : రమేశ్‌బాబు, ఆర్ఐవో
గతంలో పరీక్ష పత్రాలు లీకైన సంఘటనలున్నాయి. పరీక్ష కేంద్రాలకు దగ్గర్లో జిరాక్స్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడేవారు. వాటిని అరికట్టడానికే ఇంటర్ బోర్డువారు సెల్‌ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో అధికారులు, ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లలో మాట్లాడినా కఠినచర్యలుంటాయి.