జీవా, సిబిరాజ్ల మధ్య రియల్ ఫైట్
ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు పోటీ పడడం, పోరాటానికి దిగడం అనే సన్నివేశాలను చాలా చిత్రాలలో చూస్తుంటాం.అలా పోకిరిరాజా చిత్రంలో అందగత్తె హన్సిక కోసం జీవా సిబిరాజ్ చేసిన రీల్ ఫైట్ రియల్ ఫైట్‌కు దారి తీయడం చర్చనీయాంశంగా మారింది. జీవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం పోకిరిరాజా. మరో కథానాయకుడిగా సిబిరాజ్ నటిస్తున్న ఈ చిత్రంలో హన్సిక కథానాయకిగా నటిస్తున్నారు. ఇంతకు ముందు తమిళుక్కు ఎన్ ఒండై అళిక్కువమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రామ్‌ప్రకాశ్ రాయప్ప దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ఇది.
అదే విధంగా ఇలయదళపతి విజయ్ హీరోగా పులి వంటి భారీ సాంఘిక జానపద చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలలో ఒకరైన పీటీ.సెల్వకుమార్ సమర్పణలో పీటీఎస్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై టీఎస్.పొన్‌సెల్వి నిర్మిస్తున్న చిత్రం పోకిరిరాజా.
రాజస్థాన్ సెట్లో అందాల పాట
కాగా డీ.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ఒక పాట కోసం ఇటీవల పూందమల్లి రోడ్డు సమీపంలో రాజస్థాన్‌ను తలపించే విధంగా ఒక బ్రహ్మాండమైన సెట్‌ను రూపొందించినట్లు దర్శకుడు రామ్‌ప్రకాశ్ రాయప్ప మంగళవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీని గురించి ఆయన తెలుపుతూ జీవా, హన్సికలపై చిత్రీకరించిన ఈ పాటలో 100 మంది డాన్సర్లు, రాజస్థాన్ నుంచి రప్పించిన 100 మంది సహాయ నటులు పాల్గొనగా నృత్య దర్శకురాలు బృంద అందాలను మేళవిస్తూ డాన్స్‌ను కంపోజ్ చేశారన్నారు.
బబ్లీ బబ్లీ అంటూ సాగే ఆ పాటను ఆ సెట్లో రూపొందించిన స్విమ్మింగ్పూల్లోను చితీక్రరించినట్లు తెలిపారు. తన ముందు చిత్రానికి, ఈ పోకిరిరాజా చిత్రం చాలా భిన్నంగా ఉంటుందన్నారు. పక్కా కమర్షియల్ అంశాలతో జాలీగా సాగే కథా చిత్రం పోకిరిరాజా అని చెప్పారు. ఇది జీవాకు 25వ చిత్రం కావడంతో కథ విషయంలో చాలా జాగ్రత్తలను తీసుకుని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.