ramzan greetings
-
మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ వల్ల కాదు
సాక్షి, హైదరాబాద్: ‘ బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అన్నారు. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేసే సత్తా అమిత్ షాకు లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా సాధ్యం కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంజాన్ ఉప వాస దీక్షల సందర్భంగా శుక్రవారం మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ‘మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగుశాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎంతో మంది న్యాయ నిపుణులతో చర్చించి రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు అన్ని రంగాల్లో అవకాశాలను మెరుగుపర్చాం. అదనపు అడ్వొకేట్ జనరల్, మైనారిటీ సలహాదారు, ముఖ్యమంత్రి కార్యాలయం, వక్ఫ్‌బోర్డు చైర్మన్, టీఎస్పీఎస్సీ సభ్యుడిగా మైనారిటీలను నియమించాం. మైనారిటీల సంక్షేమానికి మా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఒక యూని వర్సిటీకి వీసీగా మైనారిటీలకు అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాతబస్తీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిజానికి అది ఓల్డ్ సిటీ కాదు..ఒరిజినల్ సిటీ..అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మైనారిటీ గురుకులాలకు అత్యాధునిక హంగులతో శాశ్వత భవనాలను నిర్మిస్తాం. ప్రభుత్వ ఉద్యోగ నియామ కాల ప్రక్రియ ఎల్బీస్టేడియం వేదికగా నిర్వహి స్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది ఎల్బీ స్టేడియం నుంచే. అదే స్ఫూర్తితో ఇక్కడి నుంచే పలు కార్యక్రమాలు అమలు చేస్తు న్నాం’ అని సీఎం వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. -
కరుణకు, దాతృత్వానికి ప్రతీక.. రంజాన్
సాక్షి, అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ► రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభ సంతోషాలు కలగాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. దైవత్వాన్ని నింపుకునేందుకు అల్లాహ్‌కు ఇష్టమైన జీవన విధానాన్ని ముస్లింలు పాటించారన్నారు. ఈ విపత్కర కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారని తెలిపారు. ► నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్య మాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుకన్నారు. ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని పేర్కొన్నారు. ► మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది కూడా రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని తెలిపారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం రంజాన్ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని అన్నారు. రంజాన్ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని.. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. Greetings to all on the joyous occasion of #EidUlFitr. May the Almighty shower his mercy upon us and bless us with good health and happiness. Pray, feast and rejoice at home, surrounded by your loved ones. #EidMubarak — YS Jagan Mohan Reddy (@ysjagan) May 25, 2020 -
ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం
న్యూఢిల్లీ: నాసిరకం ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లను వాడటాన్ని ఆపేయాలని దేశ ప్రజలను మోదీ కోరారు. వీటి వలన పర్యావరణం, మూగజీవాలతోపాటు ప్రజల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. మాసాంతపు మన్‌కీబాత్ సందర్భంగా ఆదివారం దేశప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినం జరుపుకోవాలని.. ఈ సందర్భంగా మొక్కలు నాటి, అవి చెట్లు అయ్యేంతవరకు దృష్టిపెట్టాలని కోరారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని మోదీ కోరారు. ‘యోగాతో మనలో విశ్వాసం పెరుగుతుంది, అందుకే రోజూ యోగా చేయటం అలవర్చుకోవాలి’ అని ఆయన చెప్పారు. జూన్ నెలలో రానున్న రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి (మే 27), భారత స్వాతంత్య్ర సంగ్రామంలో స్ఫూర్తి నింపిన వీర్ సావర్కర్ జయంతి (మే 28)ల సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ధైర్య సాహసాలకు సలాం! మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ఆశ్రమ పాఠశాలకు చెందిన ఐదుగురు గిరిజన విద్యార్థులు (మనీశా, ప్రమేశ్, ఉమాకాంత్, కవిదాస్, వికాస్) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సందర్భంగా వారిని మోదీ ప్రశంసించారు. ‘మిషన్ శౌర్య’లో భాగంగా 2017 ఆగస్టులో వివిధ ప్రాంతాల్లో వీరు శిక్షణ పొందారని.. ధైర్య, సాహసాలను ప్రదర్శిస్తూ ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారన్నారు. నేపాల్ వైపునుంచి ఎవరెస్టును అధిరోహించిన అతిచిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచిన శివాంగి పాఠక్ (16)ను కూడా మోదీ అభినందించారు. ఐఎన్ఎస్వీ తరుణిలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన బృందం సభ్యురాళ్లను మోదీ ప్రశంసించారు. యువతకు ఫిట్నెస్ మంత్ర భారత సంప్రదాయ క్రీడలైన ఖో–ఖో, గిల్లి దండ, బొంగరం, పతంగులు ఎగురవేయటం వంటి వాటిని పూర్తిగా విస్మరిస్తున్నామని ప్రధాని తెలిపారు. పాఠశాలలు, యువత మండళ్లు ఇలాంటి క్రీడలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రతి చిన్నారి జీవితంలో క్రీడలు భాగంగా ఉండేవని.. అలాంటి పరిస్థితిని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. యువత ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని సూచించిన ప్రధాని.. ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ చాలెంజ్‌లో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. -
ఘనంగా రంజాన్ వేడుకలు
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ముస్లిం సోదరులు శుక్రవారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రం సంగారెడ్డితో పాటు పటాన్చెరు, సిద్దిపేట, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్‌లోని ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్ ప్రార్థనల్లో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. రంజాన్ వేడుకల్లో జిల్లా మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. జహీరాబాద్‌లో మంత్రి గీతారెడ్డికి ముస్లిం సోదరులు ఆమె నివాసంలో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సునీతారెడ్డి నర్సాపూర్, దౌల్తాబాద్‌లో రంజాన్ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్దిపేటలో ఇక్బాల్ మీనార్ వద్ద ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్ష తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ శరత్, ఎస్పీ విజయ్‌కుమార్ సంగారెడ్డిలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో హాస్టల్ గడ్డ వద్ద ఉన్న ఈద్గాలో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎస్పీ విజయ్‌కుమార్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించటంతో పాటు ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మెదక్‌లో నవాబుపేట ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సిద్దిపేటలో ముస్లింలు ఇక్బాల్ మినార్ ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పటాన్చెరులో సైతం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేటల్లో సైతం రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. నర్సాపూర్‌లో మంత్రి సునీతారెడ్డి రంజాన్ వేడుకల్లో పాలుపంచుకున్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మదన్‌రెడ్డి, ైవె ఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం కన్వీనర్ శ్రీధర్‌గుప్తా రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు రంజాన్ ప్రత్యేక వంటకం షీర్ కుర్మాతో పాటు బిర్యాని తదితర వంటకాలను ఆరగించటంతో పాటు బంధువులు, మిత్రులకు షీర్ కుర్మా తినిపించి సంతోషంగా పండుగను జరుపుకున్నారు. ఇదిలా ఉంటే రామచంద్రాపురంలోని ఈద్గా వద్ద గురువారం రాత్రి టెంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేయటంతో ముస్లింలో శుక్రవారం రామచంద్రాపురంలో తొమ్మిదవ నంబరు జాతీయ రహదారిపై నిరసన తెలియజేశారు.