Ranchi Airports
-
ప్రేమించే వారికోసం ఎంతదూరమైనా.. అదీ ధోని అంటే!
ఐపీఎల్ 2022 సీజన్లో మనకు వింటేజ్ ధోని కనిపించిన సంగతి తెలిసిందే. ఫినిషర్ అనే పదానికి నిర్వచనం చెబుతూ పలుమార్లు మంచి ఇన్నింగ్స్‌లతో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో అయితే ధోని తన దనాధన్ ఇన్నింగ్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు. వరుస ఓటములతో డీలా పడిన సీఎస్కే ఈ సీజన్లో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ విషయం పక్కనబెడితే.. ధోనికి ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే రేంజ్లో ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత ధోని మిలటరీ ట్రైనింగ్‌లో భాగంగా చాలా క్యాంప్స్ను సందర్శిస్తుంటాడు. తాజాగా రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో ధోని తన అభిమానిని కలుసుకొని ఆమెను సంతోషంలో ముంచెత్తాడు. ఆ అభిమాని పేరు లావణ్య పిలానియా. పుట్టుకతోనే అంగవైకల్యం బారిన పడిన లావణ్య ధోని అంటే విపరీతమైన అభిమానం. అందునా ధోని బొమ్మను గీసి అతనికి కానుకగా ఇవ్వాలని భావించింది. ఇది తెలుసుకున్న ధోని లావణ్యను స్వయంగా కలుసుకున్నాడు. ఈ సందర్భంగా లావణ్య తాను గీసిన బొమ్మను ధోనికి చూపించింది. కాగా ధోని లావణ్య చేతులను దగ్గరికి తీసుకోవడం.. కన్నీళ్లను తుడవడం.. తన బొమ్మ గీసినందుకు అభినందించడం లావణ్యకు తెగ సంతోషం కలిగించాయి. దీంతో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధోనితో ఉన్న క్షణాలను పోస్ట్ చేసింది. ''ఆయన నా చేతులు తడుముతూ.. ఏడ్వకూడదు.. జీవితాన్ని ఆనందంగా గడపాలి. అని పేర్కొన్నారు. ఆ తర్వాత తన బొమ్మ గీసినందుకు థాంక్యూ చెప్పారు. తన విలువైన సమయాన్ని నాకోసం కేటాయించారు.. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నువ్వు సంతోషంగా ఉన్నావా అని ధోని భయ్యా నన్ను అడిగినప్పుడు.. నా దగ్గర రియాక్షన్ లేదు.. ఎందుకంటే ఆయన మాటలు విలువ కట్టలేనివి. మే 31 2022.. కచ్చితంగా నా జీవితంలో మరిచిపోలేని రోజు అవుతుంది'' అని భావోద్వేగంతో రాసుకొచ్చింది. చదవండి: చారిత్రక లార్డ్స్ స్టేడియానికి అవమానం.. 'వినడానికి ఇబ్బందిగా ఉంది' View this post on Instagram A post shared by LAVANYA PILANIA (@heartqueen_lavanya) -
దివ్యాంగ బాలుడి కేసులో... ఇండిగోకు రూ.5 లక్షల ఫైన్
న్యూఢ్లిల్లీ: మానసిక వైకల్యమున్న బాలుడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ మీద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది. విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ శనివారం రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ నెల 7న రాంచీ విమానాశ్రయంలో తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ విమానం ఎక్కబోతుండగా సదరు బాలున్ని సిబ్బంది అడ్డుకోవడం, అది వివాదానికి దారి తీయడం తెలిసిందే. ఆ సమయంలో బాలుడు ఎవరి మాటా వినకుండా ఉన్మాదంగా ప్రవర్తించాడన్న ఇండిగో వాదనను డీజీసీఏ తోసిపుచ్చింది. -
ఇండిగో ఓవర్ యాక్షన్: డీజీసీఏ స్ట్రాంగ్ రియాక్షన్
న్యూఢిల్లీ: విమానంలో ఎక్కకుండా నిరాకరించి దివ్యాంగ బాలుడిని ఘోరంగా అవమానించిన విమానయాన సంస్థ ఇండిగోకు షాక్ తగిలింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన టాప్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌన విమానయాన నిబంధనలను ఉల్లంఘించారని సిబ్బందిపై మండిపడింది. ఈ క్రమంలో ఇండిగోకు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ప్రత్యేక అవసరాల పిల్లల పట్ల ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ అమర్యాదగా ప్రవర్తించారని విచారణలో తేలిందని డీజీసీఏ తాజాగా ప్రకటించింది. అలాగే మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా సంస్థ నిబంధనలను పునఃపరిశీలించాలని కూడా ఆదేశించింది. ఇటీవల (మే 7న) చోటు చేసుకున్న ఈ ఘటనపై విమాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తానని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా దివ్యాంగ కుమారుడితో కలిసి రాంచీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఒక కుటుంబం పట్ల ఇండిగో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. ఆ చిన్నారి వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది అంటూ వారిని అడ్డుకున్నారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు వాదించినా ఫలితం లేక పోయింది. దీంతో వారంతా తమ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి మనీషా గుప్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఇండిగో సిబ్బంది తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. -
తోటివారే! తక్కువ చేయకండి!
మనం పెట్టుకున్న నిబంధనలకైనా మానవీయ కోణం తప్పనిసరి. వినియోగదారులను దేవుళ్ళుగా భావించాల్సిన సేవల రంగం సహా అనేక చోట్ల అది మరీ ముఖ్యం. తద్విరుద్ధంగా రాంచీ విమానాశ్రయంలో ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఒక దివ్యాంగ టీనేజ్ కుర్రాడి విషయంలో ఇటీవల వ్యవహరించిన తీరు నివ్వెరపరిచింది. ‘తోటి ప్రయాణికుల భద్రతకు భంగకరం’ అనే సాకుతో, హైదరాబాద్‌కు రావాల్సిన ఆ వీల్‌ఛెయిర్ కుర్రాడినీ, అతని తల్లి తండ్రులనూ విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది చూపిన అమానుషత్వం తీవ్ర విమర్శల పాలైంది. మన దేశంలో దివ్యాంగుల పట్ల సరైన రీతిలో సున్నితంగా స్పందిస్తున్నామా? వారినీ సమాజంలో ఓ భాగంగా కలుపుకొని పోతున్నామా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. తోటి ప్రయాణికులు సైతం అభ్యర్థిస్తున్నప్పటికీ, అవసరమైతే తామున్నామని ప్రయాణికుల్లోని డాక్టర్లు చెప్పినప్పటికీ ఆ ప్రైవేట్ విమానయాన సిబ్బంది పెడచెవినపెట్టడం పరాకాష్ఠ. సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయిన ఆ సంఘటనపై చివరకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించి చర్యలకు ఆదేశించాల్సి వచ్చింది. ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (డీజీసీఏ) సమగ్ర విచారణకు దిగింది. సదరు ప్రైవేట్ విమాన సంస్థ అధిపతులు ‘ఆ క్లిష్ట పరిస్థితుల్లో తమది మంచి నిర్ణయమే’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే, క్షమాపణ చెప్పారు. ఆ దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ వీల్‌ఛైర్ ఇస్తామన్నారు. కొంతకాలంగా ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిసారీ మీడియాలో వివాదం రేగడం, పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టడం మామూలైంది. మానవీయత పరిమళించాల్సిన ఆధునిక సమాజంలో ఇవాళ్టికీ ఇలాంటి దుర్విచక్షణ కొనసాగడం విచారకరం. నిజానికి, దివ్యాంగుల పట్ల డీజీసీఏ నియమావళి కూడా ఇక్ష్వాకుల కాలం నాటిది. మారిన కాలంతో పాటు కొత్తగా వచ్చిన సమస్యలు, సవాళ్ళకు తగ్గట్టుగా దాన్ని మార్చుకోవాల్సి ఉంది. ప్రవర్తన అదుపులో లేని ప్రయాణికుల గురించి నివేదించమనీ, ప్రమాదకరమైన అలాంటి వ్యక్తులను విమానంలోకి ఎక్కనివ్వవద్దనీ నియమావళిలో ఉండవచ్చు గాక. దాన్ని అడ్డం పెట్టుకొని, అభం శుభం తెలియని దివ్యాంగుడి ప్రయాణం నిరాకరించడం మానవత్వం అనిపించుకోదు. గడచిన కొన్ని దశాబ్దాలుగా దేశీయ, విదేశీ విమానాశ్రయాలు, అలాగే ప్రైవేట్ విమానయాన సంస్థలు బాగా పెరిగాయి. ఫలితంగా, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విమానయానం పలువురికి అనువుగా మారింది. అందుబాటులోకి వచ్చింది. అలాగే, ప్రత్యేక అవసరాలుండే దివ్యాంగుల విభాగంలోని ప్రయాణికుల సంఖ్యా పెరిగింది. కానీ, వారు సౌకర్యవంతంగా ప్రయాణించేలా తగిన వసతులు కల్పించడం, సేవలు అందించడం కరవైంది. విమానయాన టికెట్లు బుక్ చేసుకుంటున్న ప్పుడు దివ్యాంగులకు లభించే సేవలపై స్పష్టత పూజ్యం. విమానాశ్రయాల్లో, చెక్–ఇన్ సందర్భాల్లో, బోర్డింగ్ నియమాల్లో, విమానాల్లో ఆతిథ్యంలో వారి ప్రత్యేక అవసరాలకు తగ్గట్టు వసతులూ అంతంత మాత్రం. రైళ్ళలోనూ, ప్రభుత్వ రవాణా సదుపాయాల్లోనూ ఇదే పరిస్థితి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 2.68 కోట్ల మంది దివ్యాంగులున్నారు. వారిలో 20 శాతం మంది కదలడంలో, ప్రయాణంలో సమస్యలున్నవారే. ప్రయాణ సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాలను వారికి కూడా సౌకర్యంగా ఉండేలా మార్చాలని 2015లోనే ప్రభుత్వం ‘యాక్సెసిబుల్ ఇండియా’ పేరిట కార్యక్రమం చేపట్టింది. కానీ, ఆ లక్ష్యాలను ఇప్పటికీ అందుకోలేదన్నది చేదు నిజం. పౌర భవనాలన్నిటినీ దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా చూడాలని 2017లోనే సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. ఇవాళ్టికీ అది అమలైంది చాలా కొద్దిగానే! అందుకే, మన తోటివారైన దివ్యాంగుల పట్ల కనీసపు అక్కర, వారి సమస్యలను అర్థం చేసుకొనే సహృదయం పని ప్రదేశాల్లో, ప్రయాణ వసతుల్లో లోపిస్తోందనడానికి తాజా ఇండిగో ఘటన ఓ మచ్చుతునక మాత్రమే. విమానాల్లోనే కాదు... రైళ్ళు, బస్సులు, వినోదశాలలు, చివరకు విద్యాల యాలు, కార్యాలయాల్లో కూడా వారి శారీరక, మానసిక ప్రత్యేకతల రీత్యా ఏర్పాట్లు చేయడం కీలకం కాదా? ఆ మాత్రం చేయడం కనీస మానవ ధర్మం, వ్యవస్థపై ఉన్న బాధ్యత కావా? ఆ మధ్య సినీ నటి – దివ్యాంగ నర్తకి సుధా చంద్రన్ కృత్రిమ పాదం పట్ల విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది నుంచి అవమానం ఎదురైంది. నెల రోజుల క్రితమే రెండు బ్యాటరీలతో నడిచేదే తప్ప నాలుగు బ్యాటరీలతో నడిచే వీల్‌ఛైర్‌ను అనుమతించబోమంటూ ఓ దివ్యాంగ ప్రొఫెసర్‌ను ఎయిర్‌పోర్ట్‌లో నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఇలాంటి ఉదాహరణలెన్నో. ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత. తప్పు చేసిన సంస్థలకు భారీ జరిమానాలు విధించాలి. అయితే, ప్రభుత్వ విధానాలు, ఆదేశాలతో పాటు సామాజిక ఆలోచనలో మార్పు మరీ కీలకం. బౌద్ధిక, గ్రహణ సామర్థ్యాల విషయంలో కొందరిలో ఉండే ఇబ్బందుల పట్ల ప్రభుత్వం, సంస్థలు సహానుభూతితో వ్యవహరించే సంస్కారం కావాలి. దివ్యాంగులూ మన లాంటి మనుషులే నన్న భావంతో, మానవీయంగా వ్యవహరించేలా చైతన్యం తేవాలి. అన్నిటికన్నా ముందుగా... ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది మనమే! విమానాల్లో పక్షులు, జంతువులకు కూడా తగిన చోటిచ్చే మనం, మన వ్యవస్థ మన సోదర దివ్యాంగుల్ని లోకువగా చూడడమేంటి? -
ఎయిర్‌పోర్టుల్లో భారీగా బంగారం పట్టివేత
నోట్ల రద్దు.. అనంతరం బంగారంపై ఆంక్షలు.. దీంతో దేశవ్యాప్తంగా కేజీలకు కేజీల బంగారం గుట్టురట్టవుతోంది. కర్ణాటకలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో సీక్రెట్ బాత్రూమ్లో 32 కేజీల బంగారాన్ని ఐటీ శాఖ పట్టుకున్న కొద్దిసేపటికే చెన్నై, రాంచీ ఎయిర్‌పోర్టులోనూ భారీగా బంగారం బయటపడింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) తనిఖీల్లో చెన్నై ఎయిర్‌పోర్టులో 28 కేజీల బంగారం, రాంచీ ఎయిర్‌పోర్టులో 4 కేజీల బంగారం పట్టుబడింది. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ బలగాలు, వాటిని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు తరలించారు. పెద్దనోట్ల రద్దు అనంతరం బంగారంపై ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, అక్రమ సంపాదనల వెలికితీతలపై ఎన్ఫోర్స్మెంట్, ఐటీ శాఖ ద్వారా రైడ్స్ నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో దేశవ్యాప్తంగా గుట్టలుగుట్టలుగా బంగారం బయటికి వస్తోంది. మొన్న చెన్నైలో ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో 100 కిలోల బంగారం వరకు బయటపడింది. అంతేకాక విశాఖ ఎయిర్‌పోర్టులోనూ భారీ ఎత్తున్న బంగారం పట్టుబడింది. మగ్గురు వ్యక్తుల నుంచి కస్టమర్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు1.966 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ దాడులు ముమ్మరంగా సాగుతుండటంతో ప్రస్తుతం బంగారాన్ని విమానాల ద్వారా ఇతర ప్రాంతాలను తరలించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.