పట్టుదలతో సాగితే విజయం తథ్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే తప్పకుండా అత్యున్నత స్థాయికి చేరుకుంటారని ప్రముఖ సినీనటుడు రాళ్లపల్లి నరసింహారావు అన్నారు. ఇందుకు ముందుగానే లక్ష్యాన్ని ప్రణాళికబద్ధంగా నిర్దేశించుకోవాలని సూచించా రు. ఖెరతాబాద్లోని వాసవి సేవా కేంద్రంలో గురువారం జరిగిన జిల్లాస్థాయి యువజనోత్సవాలకు ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీయుగంలో వయస్సుతో సంబం ధం లేకుండా ప్రతిభను చాటే అవకాశాలు వస్తున్నాయని, వీటిని గమనించి ముందుకెళ్తే విజయం తప్పకుండా వరిస్తుందన్నారు. యువత చదువు, సంపాదనకే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై దృష్టి సారించాలని, సేవా తత్వాన్ని అలవర్చుకోవాలని సూచిం చారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ సీఈఓ కృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో విడతల వారీగా యువజనోత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 25 కేటగిరీల్లో దాదాపు 175 మంది యువతీ, యువకులు జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో జరిగే పోటీలకు నిర్మలాదేవి, శివశంకర్, కృష్ణారెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
యువజనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తొలిరోజు కూచిపూడి, భరతనాట్యం, జానపద పాటలు, నృత్యాలు, కర్ణాటక, హిందుస్థానీ సంగీతం తదితర 14 కేటగిరీల్లో పోటీలను నిర్వహించారు. దాదాపు 75 మందికిపైగా పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలు ఈనెల 28న శిల్పారామంలో జరిగే రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇటీవల నిర్వహించిన నియోజకవర్గస్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలు తాజా కార్యక్రమాల్లో పోటీ పడుతున్నారు.