తండా కుర్రోడు... జేఈఈలో టాపర్
నర్సంపేట (వరంగల్): గిరిజన తండాలో పుట్టిన ఓ నిరుపేద విద్యార్థి ప్రతిష్టాత్మక జేఈఈలో మెయిన్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఇక్కడ మరో విశేషమేమంటే ఆ విద్యార్థి తన పేదరికంతో ఉన్నప్పటికీ కష్టపడి చదివి ఏకంగా ఆలిండియా స్థాయిలో అగ్రస్థానాన్ని అక్రమించాడు. వరంగల్ జిల్లాలోని జఫర్‌గఢ్ వుండలం ఓబులాపూర్ తండాకు చెందిన బానోతు వెంకన్న వికలాంగుల విభాగంలో ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు. ఎంటెక్ చేసిన తన అన్నే తనకు స్ఫూర్తి అని, వరంగల్ ఎన్ఐటీలో చదివి సివిల్స్ పరీక్షలో విజయం సాధించడం తన లక్ష్యమని వికలాంగ విద్యార్థి వెంకన్న చెప్పాడు.
ఎస్టీ విభాగంలోనూ తెలంగాణ బిడ్డే టాప్
భైంసా (ఆదిలాబాద్): జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఎస్టీ విభాగంలోనూ తెలంగాణకు చెందిన విద్యార్థి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా కుభీర్ మండలం మార్లగొండకు చెందిన రాథోడ్ దినేశ్ జేఈఈ మెయిన్‌లో ఎస్టీ విభాగంలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. మార్లగొండకు చెందిన రాథోడ్ మంగీలాల్-సవిత దంపతుల కుమారుడైన రాథోడ్ దినేశ్ పదో తరగతి వరకు భైంసాలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాడు.