కాల్ చార్జీలు మరింత భారం..!
ముంబై: వేలంలో స్పెక్ట్రంను దక్కించుకునేందుకు టెలికం కంపెనీలు తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో కాల్ చార్జీలు మరింత పెరిగే అవకాశముందని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ తెలిపింది. స్పెక్ట్రం కోసం భారీగా వెచ్చించాల్సి వస్తుండటంతో ఆ భారాన్ని కాల్ చార్జీల పెంపు రూపంలో టెల్కోలు వినియోగదారులపై మోపుతాయని పేర్కొంది. రిలయన్స్ జియో వంటి కొత్త కంపెనీలు ప్రవేశిస్తుండటం వల్ల స్పెక్ట్రంను దక్కించుకునేందుకు కంపెనీల మధ్య పోటీ మరింత పెరుగుతున్నదని తెలిపింది. దీనికి తోడు కొన్ని సర్కిళ్లలో తమ లెసైన్సుల గడువు ముగిసిపోనుండటంతో పలు కంపెనీలు కచ్చితంగా స్పెక్ట్రం తీసుకోవాల్సిన పరిస్థితి వల్ల కూడా పోటీ భారీగా ఉందని వివరించింది.
స్పెక్ట్రంను దక్కించుకున్న కంపెనీలు ముందస్తుగా 25-33 శాతం బిడ్ మొత్తాన్ని కట్టాల్సి ఉంటుందని, దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వానికి రూ. 25,000 కోట్లు రాగలవని కేర్ అంచనా వేసింది. మరోవైపు థర్డ్ పార్టీ యాప్స్ సైతం వాయిస్ సర్వీసులు అందిస్తున్న కారణంగా టెల్కోల ఆదాయానికి కొంత మేర గండి కొట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఇలాంటి పరిణామాల కారణంగా టెల్కోలు టారిఫ్లను పెంచాల్సి వస్తుందని కేర్ తెలిపింది. రిలయన్స్ జియో ఏకంగా రూ. 4,500 కోట్ల అడ్వాన్సు చెల్లించడాన్ని బట్టి చూస్తే అది పెద్ద ఎత్తున స్పెక్ట్రంను దక్కించుకోవడంపై దృష్టి పెట్టినట్లు భావించవచ్చని పేర్కొంది.
రూ. 1.09 లక్షల కోట్లకు స్పెక్ట్రం బిడ్లు..
స్పెక్ట్రం వేలం రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. 14వ రోజైన గురువారం నాడు బిడ్డింగ్ సమయం ముగిసే సమయానికి 86 రౌండ్లు పూర్తి కాగా రూ. 1.09 లక్షల కోట్ల మేర బిడ్లు దాఖలయ్యాయి. ప్రధానంగా 800 మెగాహెట్జ్ బ్యాండ్కి ఎక్కువగా డిమాండ్ నెలకొంది. సుమారు 89 శాతం స్పెక్ట్రంను బిడ్డర్లకు సూత్రప్రాయంగా కేటాయించినట్లు టెలికం విభాగం తెలిపింది. మరికాస్త స్పెక్ట్రం మిగిలి ఉన్నందున శుక్రవారం కూడా వేలం కొనసాగుతుందని వివరించింది.