Ravi Kondala Rao
-
రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం
ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్‌ప్లే, కథ, కథనాలు, పాతతరం నటన ఏ విషయంలోనైనాఆయనకు ఉన్న పట్టు ఉన్న వేరొకరికి లేదనేది సినీ ప్రముఖుల మాట.. అందుకే ఆయనను చాలా మంది సినీ ఎన్సైక్లోపీడియా అని అంటుంటారు. పాత్రికేయుడిగా, రచయితగా, సహాయ దర్శకుడిగా, కారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే సీనియర్ నటుడు రావి కొండలరావు. మంగళవారం బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ఆయనకు జిల్లాతో అనుబంధం ఉంది. ఇక్కడ చిత్రీకరించిన ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన జ్ఞాపకాలను పలువురు సినీప్రముఖులు, రచయితలు ‘సినీ జగత్తు నుంచి నింగికి చే‘రావి’లా అంటూ గుర్తు చేసుకున్నారు. రాజమహేంద్రవరం కల్చరల్: రావి కొండలరావు 1932 ఫిబ్రవరి11న జన్మించారు. అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళంలో పెరిగి పెద్దయ్యారు. తన పదహారో ఏట చిల్లర డబ్బులు జేబులో వేసుకుని, నటుడు కావాలని రావి కొండలరావు మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగాడు. అప్పటికే, ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్లి, సినిమాల్లో రాణించిన వారి చరిత్రలు ఆ అబ్బాయి కంఠస్థం చేశాడు. అక్కడి నుంచి పాత్రికేయుడిగా, రంగస్థల, సినీనటుడిగా, సినీ రచయితగా ఆయన జీవిత ప్రస్థానం సాగింది. నాగావళి నుంచి మంజీరా వరకు సాగిన ఆయన తన ప్రస్థానాన్ని ‘నాగావళి నుంచి మంజీరా వరకు’ పేరిట ఆత్మకథగా రచించారు. ఈ పుస్తక పరిచయ సభ కూడా రాజమహేంద్రవరంలో జరగడం విశేషం. హైదరాబాద్‌లో స్థిరపడి, అక్కడే మంగళవారం కన్ను మూశారు. బాల పత్రికతో అన్న ప్రాసన.. బాల పత్రికతో రావి కొండలరావు రచనా వ్యాసాంగం ప్రారంభమైంది. మద్రాసు నుంచి వెలువడే ఆనందవాణికి సంపాదకత్వం వహించారు. 1958లో శోభ సినిమాలో తొలి వేషం వేశారు. సుమారు 600 సినిమాల్లో నటించారు. అక్కినేనితో నటించిన ప్రేమించి చూడు, బ్రహ్మచారి, గృహలక్ష్మి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. బాపు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి పుస్తకానికి, రావి కొండలరావు రాసిన కథకు స్వర్ణ నంది బహుమతి లభించింది. సైలెన్స్.. సాంస్కృతిక కార్యక్రమాల వేదికపై జరుగుతుండగా.. స్టేజీ మీదకు పేక బెత్తాం పట్టుకుని, హఠాత్తుగా ఎంటరై. సైలెన్స్ అని గద్దిస్తూ అందరినీ నవ్వించిన రావి కొండలరావు నటన, వ్యక్త్విత్వం అరుదైనవి. రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం – గోదావరితో అనుబంధం ఆరెస్సెస్‌లో ఉండి, సత్యాగ్రహంలో పాల్గొనడంతో రావి కొండలరావు చిన్నతనంలోనే రాజమండ్రి జైల్లో మూడు నెలల కఠిన జైలు శిక్ష అనుభవించారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు డీవీ హనుమంతరావు, ఎంవీ అప్పారావు, విశ్రాంత పోస్టల్ ఉద్యోగి మహ్మద్ ఖాదర్‌ఖాన్ ఇతర మిత్రులు కలసి రాజమహేంద్రవరంలో ‘హాసం’ క్లబ్ ప్రారంభించినప్పుడు, ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా డీఎడ్ కళాశాలలో జరిగిన ముళ్లపూడి వెంకటరమణ జయంత్యుత్సవంలో ఆయన పాల్గొని తన బాల్యమిత్రడు ముళ్లపూడి గురించి ప్రసంగించారు. 2016లో ఆనం కళాకేంద్రంలో ఆయనను నటుడు, గాయకుడు జిత్ మోహన్ మిత్రా చేతుల మీదుగా సన్మానించారు. కళాకారులకు ఆదర్శప్రాయుడు ‘రావి’ కాకినాడ కల్చరల్: సీనియర్ నటుడు రావి కొండలరావు కళాకారులకు ఆదర్శప్రాయుడని నటుడు, దర్శకులు ప్రసాద్ అన్నారు. 2013లో సూర్యకళామందిర్‌లో తాను నిర్వహించిన మూర్తి కల్చరల్ అసోసియేషన్ 20 వార్షికోత్సవానికి రావి ముఖ్యఅతిథిగా హాజరయ్యారని తెలిపారు. రావి భార్య రాధాకుమారి కళాప్రాంగణాన్ని ప్రారంభించారని గుర్తు చేసుకొన్నారు. స్థానిక కళాకారులను, రావి కొండలరావును అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించామని నాటి అనుభూతులను ప్రసాద్ గుర్తు చేసుకొన్నారు. రావి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయనతో కలసి నటించిన మదురక్షణాలు రావి కొండలరావుతో కలసి లోఫర్మామ–సూపర్ అల్లుడు, ప్రేమ చిత్రం–పెళ్లి విచిత్రం, స్నేహం సినిమాల్లో నటించాను. ఈ మూడు సినిమాలు రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకొన్నాయి. ఆయనతో నటిస్తుంటే, టైం తెలిసేది కాదు. మా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. – శ్రీపాద జిత్ మోహన్ మిత్రా, నటుడు, గాయకుడు నాకు సన్నిహిత మిత్రుడు మేము ప్రారంభించిన హాసం క్లబ్ ప్రారంభోత్సవం ఆయన చేతులమీదుగా జరిగింది. ఆయన మాతో కలసి ఎంతో ఆత్మీయంగా ఉండే వారు. ఒక చిన్న పిల్లవాడైపోయేవారు. తెలుగు సినిమాల్లో సున్నితమైన హాస్యం ఆయనకే చెల్లింది. అక్కినేని నటించిన బ్రహ్మచారి సినిమాలో రక్త పరీక్ష చేసి, రిజల్టు చెప్పడానికి వచ్చిన పాత్రలో ఆయన కనిపించేది రెండే నిమిషాలైనా, చిరస్మరణీయమైన హాస్యాన్ని ఆయన పండించారు. – డీవీ హనుమంతరావు, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి, శతక రచయిత -
తెలుగువారి ‘బంగారు కొండలరావు’
నివాళి నటులుగా, నాటక ప్రయో క్తగా, రచయితగా ఏడు దశాబ్దాలకు పైగా తెలుగు వారిని రంజింప చేసిన ఆత్మీయులు రావి కొండల రావుగారు ప్రపంచ రంగ స్థలం మీదినుంచి నిష్క్ర మించారన్న వార్త ఎంతో బాధను కలిస్తున్నది. కొండలరావుగారితో యాభై ఏళ్లు పైబడిన సాన్నిహిత్యం నాది. హితులుగా వయసుతో నిమిత్తం లేకుండా స్నేహితులుగా ఆయన చెలిమి కలిమి నా అదృష్టం. నేను విద్యార్థిగా ఉంటున్న రోజుల నుంచీ ఆయ నకు నాకు పరిచయం. ఆ పరిచయంతో ఆయనను అడపా దడపా మద్రాసు వడపళనిలోని చంద మామ కార్యాలయంలో కలుసుకొంటూ ఉండే వాణ్ణి. అప్పుడు ఆయన ‘విజయచిత్ర సంపాదక వర్గం’లో పనిచేస్తూ ఉండేవారు. 1975లో ‘వనిత’ పత్రిక ప్రారంభించినపుడు ఆ సంపాదక వర్గంలో పనిచేయడానికి నన్ను ఎన్ను కొన్నారు. దాంతో కొండలరావుగారితో మిత్రులు బి.కె. ఈశ్వర్గారితోనూ కలిసి ‘వనిత’ ‘విజయ చిత్ర’ పత్రికల పనిలో నేను భాగస్వామినయ్యాను. అటు సినిమాలో నటిస్తూ ఇటు పత్రికల్లో పనిచేస్తూ ఆ రెండు పాత్రలనూ విజయవంతంగా నిర్వహిం చేవారు. ‘వనిత’ కోసం ‘బామ్మగారి పేజీ’ ఆయనే రాసేవారు. ‘విజయచిత్ర’ పత్రికలో ఆయన రక రకాల రచనా విన్యాసాలు చేశారు. సంపాదకీ యాలు, పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు, ప్రము ఖులతో సంభాషణలు, సంగీతానికి సంబంధించిన ‘స్వరధుని’ వ్యాసాలు ఇవన్నీ ఒక పార్శ్వమయితే, నాగయ్యగారి జీవిత చరిత్ర. పాత తెలుగు చిత్రా లను వాటిని చూస్తున్న అనుభూతి కలిగించేటట్టు సాగిన సమగ్ర చిత్ర రచనలు మరొక పార్శ్వం. ‘విజయచిత్ర’లో ప్రాచుర్యం గడించిన ‘విచి’ (విజయచిత్రకు కురచ రూపం) కొండల రావుగారే! నేను ‘చందమామ’ నుంచి ‘ఆకాశవాణి’ ఉద్యోగంలో చేరినా కొండలరావుగారి కుటుంబంతో సాన్నిహిత్యం కొనసాగింది. నేను మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో తెలుగు నాటకాల విభా గాన్ని నిర్వహిస్తున్నప్పుడు కొండలరావుగారు, రాధాకుమారిగారు ఎన్నో నాటకాలలో పాల్గొ న్నారు. రేడియోకోసం ఎన్నో నాటకాలు రాయిం చడం కూడా మరచిపోలేని మధురానుభూతి. అట్లా ఆయన రాసి రేడియోకోసం నేను రూపొందించిన ‘ఉద్యోగమే మహాభాగ్యం’ నాటకం కథతో ఆ తర్వాత ‘పెళ్లిపుస్తకం’ చిత్రం రూపొందింది. మహానటి సూర్యకాంతంగారు నటించిన చివరి రేడియోనాటకం ‘వంటమనిషి కావలెను’ కొండలరావుగారి రచన. మహాభారత కథతో రూపొందించిన ఇంకొక రేడియో నాటకంలో ఆయన దుర్యోధనుడి పాత్ర, (ఇంకెవరూ లేక పోవడంతో) నేను శకుని పాత్ర ధరించాము. ‘అర్ధ రాత్రి’ సినిమా తర్వాత మళ్లీ ఈ నాటకంలో ప్రతి నాయకుడి (విలన్) పాత్ర ధరించే అవకాశం వచ్చింది అని చమత్కరించారు కొండలరావుగారు! మద్రాసులోనే కాక హైదరాబాదులోనూ ఆకా శవాణి నిర్వహించిన ఉగాది కార్యక్రమాలు ఎన్నిటి లోనూ పాల్గొని వాటి వన్నెనూ వాసినీ పెంచారు కొండలరావుగారు. ఎప్పుడు రంగస్థలం ఎక్కినా అదే తమ మొదటి ప్రదర్శన అన్నంత శ్రద్ధాభక్తులు చూపడం ఆయన ప్రత్యేకత! కొండలరావుగారి రాసిన ఎన్నెన్నో నాటకాలు ‘బ్లాక్ అండ్ వైట్’ పేరిట వచ్చిన వ్యాసాలు, మాయాబజార్, షావు కారు చిత్రాలకు సంబంధించిన సమగ్ర రచనలు, సినిమాలు ఎట్లా తీయాలో ఎట్లా తీయకూడదో వివరించిన ‘సినీతి చంద్రిక’ ఆయన చేతి వాసికి గొప్ప ఉదాహరణలు. చిన్న వేషాలు వేసినా వాటిని చిరస్మరణీయం చేసిన ఆయన నటనా వైదుష్యానికి ‘కథా నాయకుడు’ ‘గృహలక్ష్మి’ ‘బ్రహ్మచారి’ వంటి చిత్రాల లోని వేషాలు మచ్చుతునకలు. నాటక రచయితగా, పత్రికా రచయితగా నటులుగా, నాటక ప్రయోక్తగా ఏ పని చేసినా రావి కొండల రావుగారు మనసు పెట్టి చేశారు. ఆయన కృషి అజరం. అమరం. వ్యాసకర్త పూర్వ సంచాలకులు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పి.ఎస్. గోపాలకృష్ణ మొబైల్ : 94920 58970 -
సీనియర్ నటుడు మృతి.. చిరంజీవి సంతాపం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ బహుముఖ మేధావిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. తను హీరోగా పరిచయం అయినప్పటి నుంచి ఆయనతో కలిసి పలు చిత్రాల్లో కలిసి నటించానని గుర్తుచేశారు. తమ కాంబినేషన్లో వచ్చిన చంటబ్బాయి, మంత్రిగారి వియ్యంకుడు.. వంటి చిత్రాల్లో ఆయన చాలా కీలక పాత్రలు పోషించారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.(టాలీవుడ్లో విషాదం : సీనియర్ నటుడు కన్నుమూత) ‘రావి కొండలరావు మరణంతో చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడినే కాకుండా, గొప్ప రచయితను, పాత్రికేయున్ని, ప్రయోక్తను కోల్పోయింది. నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా ఆయన మరణం తీరని లోటు. రావి కొండలరావు, ఆయన సతీమణి రాధా కుమారి కలిసి జంటగా ఎన్నో చిత్రాల్లో నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ దంపతులు పార్వతీ పరమేశ్వరుల్లాగా వచ్చి వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడ ముచ్చటగా ఉండేది. అలాంటి రావి కొండలరావు మృతితో చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది’ అని చిరంజీవి తెలిపారు. కాగా, బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రావి కొండలరావు.. మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు.(‘నాన్న పేరు రాయలేదు.. అంటే తెలియదా’) -
అప్పుడాయన కళ్లెర్రజేసి ఉంటే...నా పరిస్థితి ఏమయ్యేదో!
సినిమా ప్రపంచంలో పాత్ర పరంగా కాకుండా వ్యక్తిగతంగా కొందరు ఆలోచిస్తారు. ఒక పాత్ర ఇంకో పాత్రని దూషిస్తే రెండో పాత్రధారి, మొదటి పాత్రధారిని ఉద్దేశించి ‘‘అతనెవడు నన్ను తిట్టడానికి?’’ అని అడిగిన సందర్భాలున్నాయి. రాజ్యం పిక్చర్స్ ‘హరిశ్చంద్ర’లో యస్.వి. రంగారావు- హరిశ్చంద్రుడు, గుమ్మడి -విశ్వామిత్రుడు. ఒక దృశ్యంలో విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు తన ముందు మోకరిల్లి ఉండగా, తలను కాలితో తన్నాలి. రంగారావు ఒప్పుకోలేదు. ‘‘గుమ్మడెవరు నన్ను తన్నడానికి?’’ అని అంగీకరించపోతే, ‘డూప్’ షాట్ తీసుకున్నారు. ‘ప్రేమించి చూడు’లో రేలంగిని, అల్లు రామలింగయ్య ‘బావా’ అనాలి - దృశ్యపరంగా. రేలంగి ఒప్పుకోలేదు. అలిగి కూచుంటే దర్శకుడు పి. పుల్లయ్య బుజ్జగించారు. ఇలాంటివి ఇంకా ఎన్నో కనిపిస్తాయి. ‘ప్రేమించి చూడు’లో నేను, అక్కినేని వారికి (హీరో) తండ్రిని. పదిమంది నా గురించి చెప్పి.. చెప్పి.. చెబితేగాని, దర్శకుడు పి. పుల్లయ్యగారు ఆ వేషం నాకివ్వలేదు. ఆ భయం ఉంది వేషం మొదలు పెడుతున్నప్పుడు. పైగా, మొట్టమొదటి రోజు నా షూటింగు, నాగేశ్వరరావుగారిని తిట్టడంతో ఆరంభం! ‘‘ఒరే గాడిదా, ఎక్కడ తిరుగుతున్నావురా?’’ అని డైలాగు ఆరంభం. ఒళ్లు వణుకు, గుండె దడ. నాగేశ్వరరావు గారు నాకు బాగా తెలుసు గాని, ఆయనతో నటించడం అదే మొదలు. పైగా దృశ్యంలో గుమ్మడి, జగ్గయ్య, రేలంగి కూడా ఉన్నారు. ‘‘ఈ రావి కొండలరావు నన్ను గాడిదా అని తిడతాడా? అసలు ఈ వేషం ఇతనికెందుకు ఇచ్చారు?’’ అని అక్కినేని, కళ్లెర్రజేస్తే? అమ్మో! ‘‘రిహార్సల్ - రావయ్యా కొండల్రావు చెప్పు డైలాగ్’’ అని పుల్లయ్యగారు అరుస్తున్నారు. నా పక్కనే ఉన్న సహాయ దర్శకుల దగ్గర నెమ్మదిగా మొర పెట్టుకుంటున్నాను. షాట్‌కి వెళ్లడం లేదు. ‘‘ఏం జరుగుతోందక్కడ? ఏమిటాలస్యం?’’ అని హీరోగారూ ఓ కేక వేశారు. సహాయకులు వెళ్లి అక్కినేనికి వివరించారు - నాలో జరుగుతున్న ఘర్షణ. ‘రండి - రండి ఇలా’ అని పిలిచారు హీరో. నెమ్మదిగా వెళ్లాను. ‘‘ఏమిటి? ఏమిటా సందేహం?... ఎవర్ని తిడుతున్నారు మీరు? నన్నా? మీ కొడుకునా?... తన కొడుకుని, తండ్రి ‘గాడిదా’ అని తిడుతున్నాడు. అంతేగాని, అక్కినేని నాగేశ్వరరావుని, రావి కొండలరావు ‘గాడిద’ అనడం లేదు కదా. ఆలోచిస్తారేమిటండీ - విజృంభించండి. రండి’’ అని భుజం తట్టి ప్రోత్సహించారు. అంతే. రిహార్సల్లో దంచాను. టేక్‌లోనూ మార్కులు కొట్టాను. అదీ - అక్కినేని ప్రోత్సాహం! తక్కిన కొందరు పెద్ద తారలు అన్నట్టుగా ‘వీడెవడు నన్ను గాడిదా’ అనడానికి అని, ఆయన ఒక్క మాట అని ఉంటే - నేను సినిమాల్లో నిలదొక్కుకోగలగడానికి కారణమైన ఆ పాత్ర పోయేది. అసలు నా సినిమా జీవితం- నటుడిగా - అక్కడే ఆగిపోయేది! ఆయన ముఖ్య నటుడు. ఏం చెబితే అది జరుగుతుంది. కానీ ఆయన పాత్రపరంగా ఆలోచించారే గాని, వ్యక్తిగతంగా ఆలోచించలేదు. ఎంతటి పెద్ద మనసు! నాలాగా ఎంతోమంది కొత్తవారికి ఇచ్చిన ప్రోత్సాహం విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇది నేను మరచిపోలేను! - రావి కొండలరావు సీనియర్ నటుడు, జర్నలిస్ట్