
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ బహుముఖ మేధావిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. తను హీరోగా పరిచయం అయినప్పటి నుంచి ఆయనతో కలిసి పలు చిత్రాల్లో కలిసి నటించానని గుర్తుచేశారు. తమ కాంబినేషన్‌లో వచ్చిన చంటబ్బాయి, మంత్రిగారి వియ్యంకుడు.. వంటి చిత్రాల్లో ఆయన చాలా కీలక పాత్రలు పోషించారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.(టాలీవుడ్‌లో విషాదం : సీనియర్ నటుడు కన్నుమూత)
‘రావి కొండలరావు మరణంతో చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడినే కాకుండా, గొప్ప రచయితను, పాత్రికేయున్ని, ప్రయోక్తను కోల్పోయింది. నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా ఆయన మరణం తీరని లోటు. రావి కొండలరావు, ఆయన సతీమణి రాధా కుమారి కలిసి జంటగా ఎన్నో చిత్రాల్లో నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ దంపతులు పార్వతీ పరమేశ్వరుల్లాగా వచ్చి వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడ ముచ్చటగా ఉండేది. అలాంటి రావి కొండలరావు మృతితో చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది’ అని చిరంజీవి తెలిపారు. కాగా, బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రావి కొండలరావు.. మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు.(‘నాన్న పేరు రాయలేదు.. అంటే తెలియదా’)