జట్టు బాధ్యత నాదే!
* ఆటగాళ్లలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపాలి
* రవిశాస్త్రి ఇంటర్వ్యూ
లండన్: ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్‌పైనే. చీఫ్ కోచ్ డంకన్ ఫ్లెచర్ అధికారాలను కత్తిరించి.. టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని నియమించడంతో ఈ భారత మాజీ కెప్టెన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 25న మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో రవిశాస్త్రి పోషించబోయే పాత్ర ఏమిటి? ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారు? ఆయన ముందున్న లక్ష్యాలేమిటి? తదితర అంశాలతో రవిశాస్త్రి ఇంటర్వ్యూ
క్లిష్ట పరిస్థితుల్లో టీమ్ డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడం వెనుక ఏం జరిగింది?
భారత క్రికెట్‌కు ఇది చాలా ముఖ్యమైన సమయం. టీమ్ డెరైక్టర్‌గా ఉండమని బోర్డు నుంచి పిలుపొచ్చింది. క్లిష్టమైన ఈ సమయంలో నా వంతు సహకారం అందించాలనుకున్నా. అందుకే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నా. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం బీసీసీఐ. తొలుత రాష్ట్రానికి, ఆ తర్వాత దేశానికి భారత జట్టు తరఫున సేవలందించా. కష్టాల్లో ఉన్న జట్టుకు అండగా నిలుస్తా.
పూర్తిస్థాయి కోచ్‌ను నియమించే వరకు జట్టుతో కొనసాగుతారా?
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ వరకే జట్టుకు డెరైక్టర్‌గా కొనసాగుతా. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నేను ఈ సిరీస్ కోసం ప్రసారకర్తల నుంచి అనుమతి కూడా తీసుకున్నా.
సిరీస్‌లో మీ పాత్ర ఏమిటి? కోచ్ ఫ్లెచర్ స్థానం మారిందా?
జట్టు బాధ్యతలన్నీ నేనే చూస్తా. అయితే డంకన్ ఫ్లెచర్ పాత్రలో మార్పేమీ లేదు. ఆయన చీఫ్ కోచ్‌గా కొనసాగుతారు. మంగళవారం ఫ్లెచర్‌తో పాటు ధోనితో మాట్లాడా. ఫ్లెచర్ చాలా కాలం నుంచి జట్టుతో పాటు కొనసాగుతున్నారు. ఆయనపై ఆటగాళ్లకు గౌరవం ఉంది. వన్డే సిరీస్‌లో ఫ్లెచర్ ఆధ్వర్యంలో ఇద్దరు సహాయక కోచ్‌లు పనిచేస్తారు. టెస్టు సిరీస్‌లో ఘోర వైఫల్యం తర్వాత జట్టు కోల్పోయిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తీసుకురావడమే మా లక్ష్యం. తద్వారా ఆటగాళ్లు వన్డే సిరీస్‌లో బాగా ఆడగలుగుతారు.
సహాయ కోచ్‌లుగా భారత్‌కు చెందిన వారిని నియమించడానికి కారణమేంటి?
ఇప్పుడున్న సపోర్టింగ్ స్టాఫ్‌ను మార్చి భారత్‌కు చెందిన వారిని సహాయ కోచ్‌లుగా నియమించాలన్న ఆలోచన నాదే. ఈ పర్యటనలో సహాయ కోచ్‌లు భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో తమ వంతు పాత్ర పోషిస్తారు. అందుకే కొత్త వారిని నియమించాల్సి వచ్చింది.
టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత జట్టులో తీవ్ర భయాందోళన నెలకొన్నట్లుంది?
అలాంటిదేమీ లేదు. అసలు భయాందోళన చెందాల్సిన అవసరమేముంది. గెలుపోటములు సహజమే. జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లున్నారు. ఇది యువ ఆటగాళ్లతో కూడిన జట్టనే విషయం మర్చిపోవద్దు. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుతం భారత జట్టులో సంధికాలం కొనసాగుతోంది. కుదురుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. అందరూ ఓపిక పట్టాలి. అప్పుడే ఆటగాళ్లు తమ సత్తా ఏంటో చూపగలుగుతారు.
లార్డ్స్‌లో సంచలనం సృష్టించిన భారత జట్టు ఆ తర్వాత ఎందుకు నీరుగారిపోయింది?
క్రికెట్‌తో నాకు 35 ఏళ్లుగా అనుబంధం కొనసాగుతోంది. ఇప్పటిదాకా విదేశాల్లో భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయం లార్డ్స్ టెస్టే. ఇంతటి ఘనత సాధించిన జట్టును వరుస పరాజయాలు వెక్కిరించాయి. ఇందుకు కారణం అనుభవలేమేనని నేను కచ్చితంగా నమ్ముతున్నా. ఇదే ఈ సిరీస్‌లో భారత జట్టును ముంచింది.
సిరీస్‌లో వెనకబడి ఉన్న దశలో ఇంగ్లండ్ స్వింగ్, పేస్‌కు అనుకూలించే పిచ్‌లను తయారు చేసింది భారత్‌ను దెబ్బకొట్టింది.. దీనిపై మీ అభిప్రాయమేంటి?
సహజంగానే విదేశాల్లో జీవం ఉన్న పిచ్‌లు ఉంటాయి. ఆటగాళ్ల అనుభవలేమీ భారత్‌ను దెబ్బతీసింది. ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గ్రహించిస్వింగ్, పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లు తయారు చేశారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న అండర్సన్, బ్రాడ్ భారత్‌ను పేకమేడలా కూల్చారు. వోక్స్, జోర్డాన్ తమవంతు సహకారం అందించారు. వచ్చే ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్‌కు ఇలాంటి పిచ్‌లనే తయారు చేయమనండి. అప్పుడు వారికి అసలు సంగతేంటో తెలిసొస్తుంది. ఈ పిచ్‌లపై ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగడం గ్యారంటీ. అదే జరిగితే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు.
ఇంగ్లండ్ చేతిలో ఓటమిని అభిమానులు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు?
లార్డ్స్‌లో విజయం తర్వాత భారత జట్టుపై అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ సిరీస్ ముగిసే సరికి పరిస్థితి మారిపోయింది. 1-3తో సిరీస్ కోల్పోవడం కంటే... ఇంగ్లండ్ చేతిలో పోరాడకుండానే ఓడిపోయారనే బాధ అభిమానుల్లో ఉంది. అందుకే వాళ్లు దారుణ పరాజయాల్ని జీర్ణించుకోలేకపోతున్నారు.