తెరపైకి రవిచంద్రన్ వారసురాలు
ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్ వారసురాలిగా ఆయన మనవరాలు కథానాయకిగా పరిచయం కానున్నారు. కాదలిక్క నేరమిల్లై, అదేకంగళ్ మొదలగు 100 చిత్రాలకు పైగా హీరోగా నటించిన రవిచంద్రన్ ఆ తరువాత క్యారెక్టర్‌గానూ, దర్శకుడిగానూ చిత్రాలు చేశారు. ఆయన కొడుకు హంసవర్ధన్ కూడా హీరోగా పరిచయమైనా పెద్దగా రాణించలేదు.
కాగా రవిచంద్రన్ మనవరాలు అభిరామి కథానాయకిగా రంగప్రవేశం చేయనున్నారు. ఈమెను దర్శకుడు మిష్కిన్ తను తాజా చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేయనున్నారు. అయితే అభిరామి పేరుతో ఒక నటి ఉండడంతో ఈమె పేరును తాన్యాగా మిష్కిన్ మార్చారు. చిత్తరంపేసుదడి, అంజాదే, ఓనాయుమ్ ఆటుకుట్టి, పిశాచు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మిష్కిన్ ప్రస్తుతం విశాల్ హీరోగా తుప్పరివాలన్ చిత్రం చేయనున్నారు.
ఇందులో రకుల్‌ప్రీత్ నాయకి. కాగా ఈ చిత్రం తరువాత మరో చిత్రానికి మిష్కిన్ కమిట్ అయ్యారు. దీన్ని రఘునందన్ అనే ఫైనాన్షియర్ నిర్మించనున్నారు. ఆయన కొడుకు మైత్రేయను హీరోగా పరిచయం చేస్తున్న ఈ చిత్రంలో తాన్యా నాయకిగా నటించనున్నారు. భరతనాట్యం నేర్చుకున్న తాన్యా ప్రస్తుతం మోడలింగ్ చేస్తున్నారు. తన ఫొటోను చూసిన దర్శకుడు మిష్కిన్ నటించడానికి ఆసక్తి ఉందా అని అడిగారనీ, తాను ఉందని చెప్పడంతో వెంటనే చిన్న స్క్రిప్ట్‌తో ఆడిటింగ్ చేసి ఓకే చేశారనీ తాన్యా వివరించారు.
నటిగా పరిచయానికి తాత రవిచంద్రన్ పేరు ఉపయోగపడుతుంది గానీ తానిక్కడ నిలబడడానికి మాత్రం ఎంపిక చేసుకునే కథ, పాత్రలు, వాటిని మెప్పించడానికి పడే శ్రమ, చేసే కృషి ప్రధానం అవుతాయన్నారు. తాను నటిగా తాత పేరును కాపాడే ప్రయత్నం చేస్తాననీ తాన్యా అంటున్నారు. విశాల్ హీరోగా తుప్పరియాలన్ చిత్రం పూర్తి కాగానే మిష్కిన్ తాన్యా, మైత్రేయ జంటగా నటించే చిత్రాన్ని ప్రారంభించనున్నారు.