భీమవరం రాయలం డ్రెయిన్‌లో పడి ఏడేళ్ల బాలుడి మృతి
భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : భీమవరంలో ఇటీవల నిర్మించిన రాయలం క్లోజ్డ్ డ్రెయిన్ ఏడేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకుంది. డ్రెయిన్ నిర్మించినా మెస్ ఏర్పాటు చేయకపోవడంతో అందులో పడిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అడ్డవంతెన సమీపంలోని రామ్‌నగర్‌లో నివాసముంటున్న పొత్తూరి సుబ్బరాజు, ప్రభావతిల కుమారుడు హేమంత్ వర్మ (7) స్థానిక రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాయలం రోడ్డులో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చాడు. మరో ఇద్దరు పిల్లలతో కలిసి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సమీపంలోని పంట కాలువ, రాయలం క్లోజ్డ్ డ్రెయిన్ ఉన్న ప్రాంతానికి వెళ్లాడు.
అక్కడ పంట కాలువ గట్టు దాటుతుండగా ప్రమాదవశాత్తు క్లోజ్డ్ డ్రెయిన్‌లో పడి గల్లంతయ్యాడు. హేమంత్ వర్మ డ్రెయిన్‌లో పడిపోవడాన్ని చూసిన స్థానిక మహిళలు కేకలు వేయడంతో అటువైపు వెళ్లే వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. అయితే డ్రెయిన్‌లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో దిగే సాహసం చేయలేకపోయారు. స్థానికుల సమాచారంతో టూటౌన్ ఎస్సై విష్ణు, ఏఎస్సై ఖాన్, అగ్నిమాపక అధికారులు తమ సిబ్బందితో అక్కడకు చేరుకుని డ్రెయిన్ చివర వలలు ఏర్పాటు చేశారు. విషయం తెలిసినా సాగునీటి శాఖ అధికారులు మాత్రం రాలేదు. డ్రెయిన్ నిర్మించిన కాంట్రాక్టర్ అక్కడకు వచ్చి ఎక్కడ మేన్‌హోల్స్ ఉన్నాయో చెప్పారు. స్థానికులు మేన్‌హోల్ ఇనుప చువ్వలను కట్ చేసి డ్రెయిన్లోపలకు వెళ్లి గాలించగా సాయంత్రం 5 గంటల సమయంలో బాలుడు లభ్యమయ్యాడు. పైకి తీసి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రమాదకరంగా డ్రెయిన్
సుమారు రూ.6 కోట్లతో ఇటీవలే రాయలం క్లోజ్డ్ డ్రెయిన్‌ను నిర్మించారు. డ్రెయిన్ ప్రారంభంలో ఎటువంటి మెస్ ఏర్పాటు చేయకుండా దానిని అలాగే వదిలేశారు. పక్కనే పంట కాలువ ఉండడంతో ప్రమాదకరంగా మారింది. ఇరిగేషన్ అధికారులు స్పందించి డ్రెయిన్ ప్రారంభంలో మెస్ ఏర్పాటు చేయడం లేదా పూర్తిగా మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
పుట్టినరోజునే తిరిగిరాని లోకాలకు..
అప్పటి వరకు కళ్లెదుటే తిరిగిన తమ గారాల కుమారుడు డ్రెయిన్‌లో పడి మృతిచెందాడన్న విషయం తెలుసుకుని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు తల్లడిల్లారు. వారి రోదనలు చూపరులను కన్నీరుపెట్టించాయి. హేమంత్వర్మది ఆదివారమే పుట్టిన రోజు. బర్త్‌డే జరుపుకుని బంధువుల ఇంటికి వచ్చినట్లు బాలుడి కుటుంబికులు తెలిపారు.