Razia Begum
-
నా బిడ్డ మొండిఘటం.. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా వస్తాడు!: రజియా బేగం
‘‘ఉక్రెయిన్ దేశం యుద్ధంలో ఉందనే సంగతి మొదట నా బిడ్డే ఫోన్ చేసి నాకు చెప్పాడు. ఎప్పటికప్పుడు వాడు తన క్షేమసమాచారాలను అందిస్తున్నాడు. వీలైతే ఫోన్ చేస్తున్నాడు. లేదంటే మెసేజ్ చేస్తున్నాడు. నాకు గుండె ధైర్యం ఎక్కువ. నా బిడ్డ కూడా నాలాగే మొండి ఘటం. వాడు క్షేమంగా ఉక్రెయిన్ నుంచి తిరిగొస్తాడనే నమ్మకం ఉంది నాకు. కానీ, తల్లి ప్రేమ కదా. అందుకే అధికారుల సాయం కోరుతున్నా’’ అని చెబుతోంది యాభై ఏళ్ల టీచరమ్మ రజియా బేగమ్. అన్నట్లు ఈమె గురించి మీకు పరిచయం ఉందో లేదో.. ఈమె అప్పట్లో నేషనల్ ఫేమస్ అయ్యారు. సుమారు రెండేళ్ల కిందట కరోనా మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ఆ సమయంలో ఎక్కడికక్కడే చిక్కుపోయి.. స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు చాలామంది. ఈ తరుణంలో నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఓ తల్లి తన బిడ్డ కోసం వందల కిలోమీటర్లు స్కూటీ మీద వెళ్లి.. సురక్షితంగా అతన్ని తెచ్చేసుకుంది(1400కి.మీ.పైనే). నెల్లూరులో చిక్కుకుపోయిన కొడుకు నిజాముద్దీన్ అమన్‌ను తీసుకొచ్చుకునేందుకు బోధన్ ఎస్పీ నుంచి పర్మిషన్ తీసుకుని మరి సాహసం చేసింది. కొడుకు కోసం తల్లి పడ్డ ఆరాటాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. సాలంపాడ్ క్యాంప్ విలేజ్‌లో గవర్నమెంట్ టీచర్‌గా పని చేసే రజియాబేగం కథ అప్పుడు బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ కొడుకు అమన్ ఇప్పుడు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకుపోయాడు. అతను ఉంటున్న ప్రాంతంలో భారతీయుల తరలింపులో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. రజియా భర్త 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అందుకే తన బిడ్డను డాక్టర్ కావాలని ఆమె కోరుకుంది. ఉక్రెయిన్ సుమీ స్టేట్ యూనివర్సిటీలో చేర్పించింది. సుమారు 50 దేశాల నుంచి రెండు వేల మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ. మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న అమన్. ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో ఓ బంకర్లో అతను ఆశ్రయం పొందుతున్నాడు. అయితే అతను ఉంటున్న ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన బిడ్డ మాత్రమే కాదు.. తన బిడ్డల్లాంటి వాళ్లందరినీ వీలైనంత త్వరగా ఇక్కడకు రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను రజియాబేగం కోరుతున్నారు. ఇప్పటికే ఆమె నిజామాబాద్ కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు. -
అమ్మా నీవెక్కడ...?
తల్లిని వెతుక్కుంటూ సౌదీ నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు చాంద్రాయణగుట్ట: ఈ జన్మకు తల్లే లేదనుకుంటూ 30 ఏళ్లుగా జీవిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లకు తండ్రి చనిపోతూ చెప్పిన ఒక్క మాట భావోద్వేగాన్ని కలిగించింది. తమను నవ మాసాలు మోసి కన్న తల్లి హైదరాబాద్‌లో ఉం దని తెలిసి ఆ అక్కాచెల్లెళ్లు తల్లి ఫొటో తీసుకొని నగరానికి చేరుకున్నారు. దక్షిణ మండలం డీసీపీని కలిసి తమ తల్లి ఆచూకీ కనిపెట్టాలని కోరడంతో పోలీసులు పాతబస్తీలో గాలింపు చేపట్టారు. వివరాల ప్రకారం... బార్కాస్ ప్రాంతానికి చెందిన రజియా బేగం వివాహం సౌదీ అరేబియాకు చెందిన రషీద్‌తో 1981 డిసెంబర్ 7న బార్కాస్‌లో జరిగింది. వివాహనంతరం రజియా బేగం భర్తతో సౌదీ అరేబియాకు వెళ్లింది. ఇద్దరు ఆడపిల్లలు అయేషా రషీద్, ఫాతిమా రషీద్ పుట్టాక భార్యాభర్తల నడుమ మనస్పర్థలు వచ్చి 1988లో విడాకులు తీసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరు పిల్లలను రజియా బేగం భర్త వద్దే వదిలేసి హైదరాబాద్‌కు వచ్చేసింది. అప్పటి నుంచి ఆ అక్కాచెల్లెళ్లు తండ్రితోనే ఉన్నారు. తండ్రి చనిపోతూ చెప్పిన మాటతో.. ఇటీవలే రషీద్ చనిపోతూ భార్య రజియా బేగం వివరాలను కుమార్తెలకు చెప్పి.. భార్య ఫొటో, అప్పటి వివాహ సర్టిఫికెట్లను ఇచ్చాడు. దీంతో ఆ అక్కాచెల్లెళ్లు తల్లిని వెతుక్కుంటూ నగరానికి వచ్చారు. రెండు రోజుల క్రితం దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణను కలిసి తమ తల్లి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. ఆయన ఆదేశాలతో దక్షిణ మండలం పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అప్పట్లో వారి పెళ్లి చేసిన ఖాజీ చనిపోయినప్పటికీ... పెళ్లికి సాక్షిగా వ్యవహరించిన సయ్యద్ ఖాజా పాషా అనే వ్యక్తి రజియా బేగం సోదరుడిగా తేలింది. అతడు ప్రస్తుతం యాకుత్‌పురాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు రజియా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే తల్లి, కూతుళ్లను కలుపుతామని పోలీసులు పేర్కొన్నారు. కరపత్రాల పంపిణీ... రజియా బేగం ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరుతూ దక్షిణ మండలం పోలీసులు కరపత్రాలను ముద్రించారు. అదనపు డీసీపీ కె.బాబూరావు చాంద్రాయణగుట్ట పోలీసులతో కలిసి మంగళవారం ఈ కరపత్రాలను స్థానికులకు పంపిణీ చేశారు. అలాగే వీటిని గోడలపై అతికిస్తున్నారు. రజియాబేగం ఆచూకీ తెలిస్తే దక్షిణ మండలం డీసీపీ (9490616476), అదనపు డీసీపీ బాబూరావు(9490616480)లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.