అమ్మా నీవెక్కడ...?
తల్లిని వెతుక్కుంటూ సౌదీ నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు
చాంద్రాయణగుట్ట: ఈ జన్మకు తల్లే లేదనుకుంటూ 30 ఏళ్లుగా జీవిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లకు తండ్రి చనిపోతూ చెప్పిన ఒక్క మాట భావోద్వేగాన్ని కలిగించింది. తమను నవ మాసాలు మోసి కన్న తల్లి హైదరాబాద్‌లో ఉం దని తెలిసి ఆ అక్కాచెల్లెళ్లు తల్లి ఫొటో తీసుకొని నగరానికి చేరుకున్నారు. దక్షిణ మండలం డీసీపీని కలిసి తమ తల్లి ఆచూకీ కనిపెట్టాలని కోరడంతో పోలీసులు పాతబస్తీలో గాలింపు చేపట్టారు. వివరాల ప్రకారం... బార్కాస్ ప్రాంతానికి చెందిన రజియా బేగం వివాహం సౌదీ అరేబియాకు చెందిన రషీద్‌తో 1981 డిసెంబర్ 7న బార్కాస్‌లో జరిగింది. వివాహనంతరం రజియా బేగం భర్తతో సౌదీ అరేబియాకు వెళ్లింది. ఇద్దరు ఆడపిల్లలు అయేషా రషీద్, ఫాతిమా రషీద్ పుట్టాక భార్యాభర్తల నడుమ మనస్పర్థలు వచ్చి 1988లో విడాకులు తీసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరు పిల్లలను రజియా బేగం భర్త వద్దే వదిలేసి హైదరాబాద్‌కు వచ్చేసింది. అప్పటి నుంచి ఆ అక్కాచెల్లెళ్లు తండ్రితోనే ఉన్నారు.
తండ్రి చనిపోతూ చెప్పిన మాటతో..
ఇటీవలే రషీద్ చనిపోతూ భార్య రజియా బేగం వివరాలను కుమార్తెలకు చెప్పి.. భార్య ఫొటో, అప్పటి వివాహ సర్టిఫికెట్లను ఇచ్చాడు. దీంతో ఆ అక్కాచెల్లెళ్లు తల్లిని వెతుక్కుంటూ నగరానికి వచ్చారు. రెండు రోజుల క్రితం దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణను కలిసి తమ తల్లి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. ఆయన ఆదేశాలతో దక్షిణ మండలం పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అప్పట్లో వారి పెళ్లి చేసిన ఖాజీ చనిపోయినప్పటికీ... పెళ్లికి సాక్షిగా వ్యవహరించిన సయ్యద్ ఖాజా పాషా అనే వ్యక్తి రజియా బేగం సోదరుడిగా తేలింది. అతడు ప్రస్తుతం యాకుత్‌పురాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు రజియా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే తల్లి, కూతుళ్లను కలుపుతామని పోలీసులు పేర్కొన్నారు.
కరపత్రాల పంపిణీ...
రజియా బేగం ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరుతూ దక్షిణ మండలం పోలీసులు కరపత్రాలను ముద్రించారు. అదనపు డీసీపీ కె.బాబూరావు చాంద్రాయణగుట్ట పోలీసులతో కలిసి మంగళవారం ఈ కరపత్రాలను స్థానికులకు పంపిణీ చేశారు. అలాగే వీటిని గోడలపై అతికిస్తున్నారు. రజియాబేగం ఆచూకీ తెలిస్తే దక్షిణ మండలం డీసీపీ (9490616476), అదనపు డీసీపీ బాబూరావు(9490616480)లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.