'ప్రత్యేకహోదా ఇస్తామంటే రాజీనామాకైనా సిద్ధం'
రాజమండ్రి రూరల్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామంటే అవసరమైతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమని రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అనేది సున్నితమైన అంశమని, తమ నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కేంద్రంతో సామరస్యపూర్వక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తి బలం ఉందని, తెలుగుదేశం పార్టీ బెదిరించినా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని ఆరోపించారు. దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారన్నారు.