నేరాలకు ప్రేరణ.. ఈ సినిమాలే!
సినిమాకు చాలా సందర్భాల్లో నిజజీవితమే ప్రేరణ. వాస్తవ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా చాలా సినిమాలు తెరమీదకొచ్చాయి. అయితే ఇటీవలికాలంలో ట్రెండ్ మారింది. నిజజీవితం ఆధారంగా వచ్చే సినిమాల కన్నా.. సినిమాల ఆధారంగా జరిగే నేరాల సంఖ్యే అధికంగా కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో 15 ఏళ్ల అభయ్ మోధానిని అపహరించి.. అతని మరణానికి కారణమైన ఘటనకు కూడా ఓ సినిమా కథనే ప్రేరణ తీసుకున్నట్టు తేలింది. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' చిత్రాన్ని ప్రేరేపణగా తీసుకొని ఈ కిడ్నాప్ దారుణానికి పాల్పడినట్టు నిందితులు ఒప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో దారుణాలకు స్ఫూర్తిగా నిలిచిన టాలీవుడ్ సినిమాలు గురించి ఓ కథనం ఇది.
డాన్!
నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ముంబైలో ఓ దారుణానికి కారణమైంది. 2015 జూలైలో ముంబై నలాసోపారా ప్రాంతంలో 13 ఏళ్ల నిలేశ్ తివారీని అతని పాఠశాలకు చెందిన ఇద్దరు సీనియర్లు హత్య చేశారు. నాగార్జున 'డాన్' హిందీ డబ్బింగ్ ను టీవీలో పలుసార్లు చూసిన ఆ ఇద్దరు అబ్బాయిలు తాము కూడా స్థానిక దాదాలు కావాలని కలలు కన్నారు. సినిమాలో మాదిరిగా దాదాగిరి చేస్తూ స్థానిక పిల్లల్ని వారు బెదిరించారు కూడా. ఈ సినిమాలో నాగార్జున మంచి డాన్ గా కనిపించినప్పటికీ, విలన్ పాత్ర పోషించిన కెల్సీ డోర్జీనే ఆ పిల్లల్ని ఎక్కువగా ఆకర్షించాడు. ఆఖరికీ వాళ్ల దాదాగిరి హత్యకు దారితీసింది.
బిజినెస్ మ్యాన్!
మహేశ్ బాబు విజయ్ సూర్యగా నటించిన ఈ సినిమాలో మంచి-చెడు రెండూ కలిసి ఉన్న బిజినెస్ మ్యాన్ గా కనిపించాడు. అయితే నేరస్తులకు ఈ సినిమాలోని చెడ్డ మహేశ్ బాబే ఎక్కువగా ప్రేరణ ఇచ్చాడు. 2012లో 2,11,256 మంది నేరస్తులను అరెస్టు చేయగా, అందులో 85శాతం మంది యువతే ఉన్నారని, ఈజీ మనీతో లావిష్ లైఫ్ గడుపాలన్న ఆలోచనే వారితో నేరాలు చేయించిందని జాతీయ నేర నమోదుబ్యూరో వెల్లడించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే 'బిజినెస్ మ్యాన్' సినిమా విడుదలైన తర్వాత నేరాల రేటు పెరిగిందని, ఈ సినిమా స్ఫూర్తితో నేరాలు పెరిగిపోయాయని స్వయంగా ఓ పోలీసు అధికారే అప్పట్లో పేర్కొన్నారు.
బాడీగార్డ్
ఈ సినిమా కొచ్చి బ్లాక్ మెయిల్ కేసుకు ప్రేరణగా నిలిచింది. రుక్సానా, బిందియా అనే మహిళలు ఓ ఎన్నారై వ్యాపారవేత్తకు వలపుల గాలం వేశారు. బాడీగార్డ్ సినిమాలో 'వాయిస్ చేంజింగ్' సాఫ్ట్ వేర్ తో వెంకటేశ్ ను బురిడీ కొట్టిస్తుంది. అదే తరహాలో ఈ ఇద్దరు మహిళలు ఓ వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేశారు. వెంకటేశ్ మరో సినిమా 'దృశ్యం' తరహాలో తమ సెల్ ఫోన్ ను కర్ణాటక ఆర్టీసీ బస్సులో వదిలేసి.. తాము మాత్రం త్రివేండ్రం పరారయ్యారు. చివరకు పోలీసులకు దొరికిపోవడంతో అసలు గుట్టు రట్టయింది.
ఒక రొమాంటిక్ క్రైమ్ కథ
యువత చైన్ స్నాచింగ్ చేస్తూ.. కిడ్నాప్ లకు పాల్పడుతూ డబ్బు సంపాదించే కథనంతో రూపొందిన ఈ సినిమా చాలా నేరాలకే ప్రేరణగా నిలిచింది. తాజాగా హైదరాబాద్ వాసులను దిగ్భ్రాంత పరిచిన 15 ఏళ్ల అభయ్ మోధాని కిడ్నాప్, హత్య వ్యవహారానికి ఈ సినిమానే ప్రేరేపణ అయింది. ఒక రొమాంటిక్ ప్రేమ కథలోని ఓ సీన్ చూసి.. అభయ్ కిడ్నాప్ కు పథకం రచించామని, ఈ కిడ్నాప్ ద్వారా భారీగా డబ్బు రాబట్టాలని అనుకున్నామని 20, 23 ఏళ్ల మధ్య వయసున్న అందరూ నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. నిజానికి ఈ సినిమా విడుదల కాగానే ఒక్క వరంగల్ లోనే 26 చైన్ స్నాచింగ్ ఘటనలు నమోదయ్యాయి. ఈ సినిమాలో మహిళలు ముఖానికి స్కాఫ్ కట్టుకొని.. ఆ ముసుగులో నేరాలకు పాల్పడినట్టు చూపారు. ఇదే తరహాలో ఇద్దరు బాలికలు ముఖానికి ముసుగు ధరించి ఓ దుకాణానికి వచ్చి.. కారం కొంటామంటూ ఆ కారాన్ని యజమాని కంట్లో కొట్టి రూ. 50వేలతో ఉడాయించారు.
సింగం!
అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన ఈ హిందీ సినిమా ముంబైలో ఓ కిడ్నాప్ కు ప్రేరేపణగా నిలిచింది. సినిమాలోని దృశ్యాల తరహాలోనే హరీశ్ మోహన్ పురోహిత్ అనే వ్యక్తి ఓ వ్యాపారవేత్త ఐదేళ్ల కొడుకును కిడ్నాప్ చేశాడు. ఆ పిల్లాడిని విడిచిపెట్టేందుకు రెండో వాయిదాగా రూ. 10 లక్షలు తీసుకుంటూ అడ్డంగా అతడు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు దొరికిపోయాడు. ఇక మలయళంలో మొదట తెరకెక్కి ఆ తర్వాత ఇతర భాషల్లో రిమేక్ అయిన 'దృశ్యం' సినిమా కూడా పలు నేరాలకు ప్రేరణగా నిలిచింది. ముఖ్యంగా సునీతా అహిరే అనే యువతిని ఆమె ప్రియుడు వికాస్ మహత్రే హత్య చేసి.. సినిమా తరహాలోనే దొంగ సాక్ష్యాలు అల్లేందుకు అతడు ప్రయత్నించాడు.