పోలవరంతో భద్రాచలానికి ముప్పు
► దేవాలయంతో పాటే మరో 100 గ్రామాలపై ముంపు ప్రభావం
► ట్రిబ్యునల్ ముందు తెలంగాణ అఫిడవిట్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం రామాలయానికి ముప్పు ఉందని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. దేవాలయంతో పాటు మరో 100 గ్రామాలకు ఈ ప్రాజెక్టుతో నష్టం వాటిల్లే అవకాశం ఉందంది. ఈ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో తెలంగాణ అఫిడవిట్ దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇచ్చిన పర్యావరణ అనుమతుల గడువు ముగిసిందని, దీంతో కొత్తగా అనుమతులు తీసుకోవాలంటూ స్వచ్ఛంద సంస్థ ‘రేలా’ ఎన్జీటీలో పిటిషన్ వేసింది. ప్రతివాదులుగా తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను చేర్చింది. దీనిపై గతం లో విచారణ జరిపిన ట్రిబ్యునల్ వివరణ ఇవ్వాలని ప్రతివాద రాష్ట్రాలను ఆదేశించింది.
ఈ మేరకు రాష్ట్రం తరపున నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి అఫిడవిట్ వేశారు. పోలవరానికి వంద కిలోమీటర్ల ఎగువన గోదావరికి ఎడమ పక్కగా దేశంలోనే ప్రసిద్ధమైన చారిత్రక భద్రాచల రామయ్య ఆలయం ఉందని తెలిపారు. భద్రాచలం వద్ద నీటి ప్రవాహం 43 అడుగుల వద్ద ఉంటే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే ప్రమాద స్థారుుగా పరిగణిస్తారన్నారు. 1976 మొదలు ఇప్పటివరకు 17మార్లు 53 అడుగులకు పైన ప్రమాద స్థారుులో నీరు చేరిందన్నారు. 1986లో 31.91లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వచ్చాయని, దీంతో ప్రాజెక్టు గోపురం వరకు నీరు చేరిందన్నారు. 1988లో బ్యాక్ వాటర్ స్టడీస్‌తో సైతం 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడూ కూనవరం, భద్రాచలం, దుమ్ముగూడెంలో 54 నుంచి 68 మీటర్ల వరకు నీరు చేరిందని తెలిపారు.
గోదావరి నీటిపై బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం రిజర్వాయర్ల బ్యాక్‌వాటర్ మట్టం సముద్రమట్టానికి 150 అడుగులకే పరిమితమవ్వాలనీ, కానీ... పోలవరంతో భద్రాచలం వద్ద 192 అడుగులకు, కుంట వద్ద177 అడుగులు, దుమ్ముగూడెం వద్ద 210 అడుగులకు నీరు చేరుతుందని, ఇది ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు పూర్తి భిన్నమని వివరిం చారు. పోలవరం ప్రాజెక్టును 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే చేపట్టారని, కానీ ప్రస్తుతం దాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచారన్నారు. దీంతో పోలవరం డ్యామ్ నిర్మాణమైతే భద్రాచలం ఆలయంతో పాటు పట్టణం పూర్తిగా మునిగిపోయే ప్రమాదముందన్నారు.
దీంతోపాటే గోదావరికి వరదలు వచ్చినప్పుడు తెలంగాణలోని 9 మండలాలు భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వాజే డు, వెంకటాపురం, బూర్గంపాడు, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లోని 100గ్రామాలపై ముంపు ప్రభావం ఉంటుం దని వివరించారు. ఈ దృష్ట్యా 2015 వరకు ఉన్న గరిష్ట వరద ప్రవాహాల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటూ బ్యాక్‌వాటర్ స్టడీస్ చేసి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కోరింది. బ్యాక్‌వాటర్‌తో తెలంగాణపై పడే ముంపు ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ యూనిట్‌తో సర్వే చేరుుంచాలని విన్నవించింది.