Reality show Big Boss
-
బిగ్‌బాస్ వంటి షోల్లో హింస, అశ్లీలత తప్ప ఏముంది?
సాక్షి, అమరావతి: బిగ్‌బాస్ వంటి షోల్లో హింస, అశ్లీలత వంటివి తప్ప ఏమున్నాయని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. రియాల్టీ షోల పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే తాము కళ్లు మూసుకుని ఉండలేమని స్పష్టం చేసింది. బిగ్‌బాస్ షోలో ఏం చూపిస్తున్నారో అందరికీ తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. బిగ్‌బాస్ షోను ఆపేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణను వేసవి సెలవుల తరువాతకు సీజే ధర్మాసనం వాయిదా వేసిన విషయాన్ని తమ దృష్టికి తీసుకురాకపోవడం పట్ల పిటిషనర్ తరఫు న్యాయవాదిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. నిజాయితీగా ఈ విషయాన్ని తమకు తెలియచేసి ఉంటే తాము ఈ వ్యాజ్యాన్ని విచారించేవాళ్లమని, అలా చెప్పకుండా దాచిపెట్టిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై తాము విచారణ జరపబోమంది. సీజే ధర్మాసనం వద్దే ఈ వ్యాజ్యం గురించి ప్రస్తావించుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి సెన్సార్షిప్ లేకుండా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, కేవలం ధనార్జనే ధ్యేయంగా ప్రసారమవుతున్న వీటిని అడ్డుకోవాలంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వాటిని అనుమతించేది లేదు ఈ వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బిగ్‌బాస్ షో వల్ల యువత చెడిపోతుందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోల్లో ఏది పడితే అది చూపిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటిని అనుమతించేది లేదంది. ఈ సమయంలో బిగ్‌బాస్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఇదే పిటిషనర్ బిగ్‌బాస్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తర్వాత ఉపసంహరించుకున్నారని తెలిపారు. బిగ్‌బాస్ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఇటీవల సీజే ధర్మాసనం ముందు అభ్యర్థించారన్నారు. అయితే ధర్మాసనం వేసవి సెలవుల తరువాత చూస్తామని చెప్పిందని వివరించారు. ఈ విషయాలను ప్రస్తుత ధర్మాసనం దృష్టికి తీసుకురాలేదన్నారు. దీంతో ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనం ముందే తేల్చుకోవాలంటూ విచారణ నుంచి ఈ వ్యాజ్యాన్ని తొలగించింది. -
బిగ్‌బాస్ గ్రాండ్ ప్రీమియర్..సెప్టెంబర్ 5న ప్రారంభం
వినోద ప్రియులు మరీ ముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, స్టార్ మా యొక్క ప్రతిష్టాత్మక రియాల్టీ షో బిగ్‌బాస్ మరో మారు తెలుగు ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ ఐదవ సీజన్ గ్రాండ్ ప్రీమియర్ 'స్టార్ మా' ఛానెల్లో సెప్టెంబర్ 05, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. గత సీజన్ గ్రాండ్ ఫైనల్.. భారతదేశంలో మరే రియాల్టీ షో కూడా సాధించలేనట్టి రీతిలో అత్యధిక వీక్షణ రేటింగ్‌ను సాధించి రికార్డులను సృష్టించింది. ఆ రికార్డులను తిరగరాసే రీతిలో ఈ సారి బిగ్‌బాస్ షో ఉండనుంది. బిగ్‌బాస్ తెలుగుకు సంబంధించి ఓ సీజన్ ముగింపు రాత్రే తరువాత సీజన్‌కు సంబంధించిన చర్చ కూడా ఆరంభమవుతుంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రచారాన్ని రూపొందించారు. ఈ షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోనంటూ ఎదురుచూసున్న అభిమానుల జీవితాల్లో పూర్తి వినోదాన్ని తీసుకువస్తామంటూ ఈ ప్రచారం జరిగింది. ''స్టార్ మా ఇప్పుడు అత్యున్నత శిఖరాలను చేరుకుంది. మా వీక్షకులు మా పట్ల చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలే దీనికి కారణం. అగ్రశ్రేణి ఛానెల్స్ సరసన మేము నిలిచాం. తద్వారా దేశంలో ప్రాంతీయ ఛానెల్ శక్తిని ప్రదర్శించాం. బిగ్‌బాస్ తెలుగు మరో సీజన్‌ను తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేడు మా దగ్గర ఉన్న ఉత్సాహపూరితమైన షోలలో బిగ్ బాస్ ఒకటి. వీక్షకులకు 100 రోజులకు పైగా వినోదాన్ని ఇది అందిస్తుంది. తెలుగు వీక్షకుల నడుమ ఇది అపూర్వ ఆదరణను సొంతం చేసుకుంది..’’ అని స్టార్ మా అధికార ప్రతినిధి అన్నారు. అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో పాటుగా డ్రామా, రొమాన్స్, యాక్షన్, వినోదంను నూతన టాస్క్‌లు, ఆసక్తికరమైన పోటీదారులతో మొత్తం కుటుంబానికి సమగ్రమైన వినోదం అందించనున్నారు. బిగ్‌బాస్ ఐదవ సీజన్‌కు హోస్ట్ చేయడం గురించి నాగార్జున మాట్లాడుతూ ‘‘గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ సవాల్‌గా నిలిచాయి. ఈ షోతో మా అభిమానుల జీవితాలలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఓ నటునిగా, పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తద్వారా వారిని మరింతగా ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించే ఈ షోలో భాగం కావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు. అంతర్జాతీయంగా అత్యంత విజయవంతమైన నాన్ ఫిక్షన్ ఫార్మాట్లలో బిగ్ బాస్ ఒకటి. భారతదేశంలో ఏడు భాషలలో 37 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఎండెమోల్షైన్ గ్రూప్ సొంతం.బిగ్‌బాస్ తెలుగు–సీజన్ 5, స్టార్‌మాలో సెప్టెంబర్05, సాయంత్రం 6 గంటలకు తొలిసారి ప్రసారం అవుతుంది. అనంతరం 15 వారాల పాటు రాత్రి 10 గంటలకు సోమవారం–శుక్రవారం వరకూ మరియు రాత్రి 9 గంటలకు శని–ఆదివారాలలో ప్రసారమవుతుంది. -
‘బిగ్’ లాక్!
రియాల్టీ షో బిగ్ బాస్‌లో వలపుల పంట పండుతోంది. రొమాన్స్‌ల రచ్చ తారస్థాయికి చేరుతోంది. ఒకరికి మించి ఒకరు... ‘షో’లో ‘రియల్’గా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఉపెన్, కరిష్మాల వంతు. ఇద్దరి సాన్నిహిత్యం గురించి చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ లేదు గానీ... ఈ మధ్య అది మరీ ముదిరిపోయింది. కాస్త సైడైతే చాలు... లిప్‌లాక్‌లతో చెలరేగిపోతున్నారు. హౌస్‌లో ఉన్నవారంతా నిద్దర పోతుండగా... అధరామృతాన్ని ఆస్వాదించేశారు. కాసేపటికి ‘కెమెరా కన్ను’ ఉందని రియలైజ్ అయిన కరిష్మా... బయట తనకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకొచ్చింది. ముందు అతని వ్యవహారం సెటిల్ చేసి ఇతగాడికి గురించి ఆలోచిస్తానంటోంది!