rebal candidate
-
బరిలో ఎవరో?
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రాదేశిక ఎన్నికల సందడి నెలకొంది. మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ఇప్పటికే పూర్తవ్వగా గ్రామాల్లో అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రెండో విడత నామినేషన్ల ఉపసంహరణకు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో సమయం ముగుస్తుంది. గతనెల 28వ తేదీ ఆదివారం రెండోవిడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. 7 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాలకు మొత్తంగా జెడ్పీటీసీలకు 53, ఎంపీటీసీలకు 538 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో ఎంత మంది విత్‌డ్రా చేసుకుని ఎంత మంది బరిలో నిలుస్తారో గురువారం తెలుస్తుంది. జెడ్పీటీసీలో బీజేపీకి రెబల్స్ దెబ్బ రెండోవిడత జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఒక్క స్థానానికి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేశారు. ఇందులో అడ్డాకుల జెడ్పీటీసీకి బీజేపీ తరపున ఇద్దరు, మూసాపేటకు ముగ్గురు, దేవరకద్ర నుంచి ఇద్దరు చొప్పున నామినేషన్లు వేశారు. గురువారం జరిగే నామినేషన్ల ఉపసంహరణలో ఆ పార్టీ నాయకత్వంతో రెబల్స్‌గా వేసిన వారితో విత్‌డ్రా చేయిస్తారో.. లేక వారు బరిలో ఉంటారో తెలియాల్సి ఉంది. కాంగ్రెస్‌కూ అదే బెంగ కాంగ్రెస్‌పార్టీకి కూడా రెబెల్స్ నుంచి పోటీ నెలకొంది. సీసీ కుంట నుంచి ఇద్దరు, కోయిల్‌కొండ నుంచి ఇద్దరు కాంగ్రెస్‌పార్టీ తరఫున నామినేషన్లు వేశారు. వీరిలో పార్టీ ఎవరికి బీ ఫాం ఇస్తుందో.. ఎవరితో విత్‌డ్రా చేయిస్తుందో తెలియదు. పార్టీ ఆదేశాలను దిక్కరించి ఎవరు బరిలో రెబల్‌గా నిలుస్తారో చూడాలి. టీఆర్ఎస్ లైన్ క్లియర్ రెండోవిడతకు టీఆర్ఎస్ పార్టీకి లైన్ క్లీయర్ అయింది. రెండోవిడత జరిగే స్థానాలకు ఒక్కో నామినేసన్ మాత్రమే వచ్చాయి. దీంతో అధికారికంగా టీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ బెడద లేకుండా పోయింది. ఆ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి వారితో నామినేషన్లను వేయించింది. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నచ్చజెప్పి ఒక్కరితోనే నామినేషన్లు వేయించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయారు. ఏడుగురు ఇండిపెండెంట్లు ఈ విడతలో ఏడుగురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. ఇందులో అడ్డాకుల నుంచి ఇద్దరు, మహబూబ్‌నగర్, కోయిల్‌కొండ నుంచి ఇద్దరు చొప్పున నామినేషన్లు వేశారు. హన్వాడ నుంచి ఒక్కరు బరిలో ఉన్నారు. గురువారం వీరు విత్‌డ్రా చేసుకుంటారా.. లేక బరిలో నిలుస్తారా.. అని తెలియాల్సి ఉంది. ఎంపీటీసీలో అన్ని పార్టీల్లో రెబల్స్ రెండోవిడత జరిగే 91 స్థానాలకు గాను 543 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో ప్రధానపార్టీల నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఒక్క స్థానానికి నామినేషన్లు వేశారు. ఇందులో 91 ఎంపీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్‌పార్టీ నుంచి 119 మంది, టీఆర్ఎస్ పార్టీ నుంచి 110 మంది, బీజేపీ నుంచి 96 నామినేషన్లు వేశారు. 83 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. విత్‌డ్రా చేయించే పనిలో నేతలు.. రెబల్స్ లేకుండా ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ పార్టీ నాయకత్వంపై అభ్యర్థులు ఒత్తిడి తెస్తున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభానికి ముందే తమ ప్ర త్యేర్థులెవరో తెలుసుకుని ముం దుకు పోయారు. వారి వద్దకు వెళ్లి పోటీ నుంచి తప్పుకోవాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఒక ఎంపీటీసీ స్థానం నుంచి ఒకే పార్టీకి చెందిన నలుగురైదుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో ఆయా పార్టీ నేతలు వారిని సుముదాయించుకునేందుకు చేస్తున్న ప్ర యత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది. అస మ్మతి నేతలను బరిలోంచి విత్‌డ్రా చేయించాలని అభ్యర్థులు తమకు తాము ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. మద్యాహ్నం 3 గంటల వరకే.. రెండో విడుత నామినేషన్ల పర్వానికి ఆదివారానికి తెర పడింది. మే 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటకు నామినేషన్ల ఉపసంహరణకు చావరి గడువు ముగుస్తుంది. అంతలోపు కార్యాలయంలో ఉన్న వారికి నామినేషన్ల ఉపసంహరణకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ రోజు 3 గంటల అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. మే నెల 10వ తేదిన పోలింగ్ జరుగుతుంది. -
రెబల్.. గుబులు!
అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు రెబల్ అభ్యర్థులు గుబులు పుట్టిస్తున్నారు. ఒక్కో ప్రాదేశిక స్థానానికి ఒకే పార్టీ తరఫున ఐదారుగురు అభ్యర్థులు బరిలో నిలుస్తుండటంతో ఆ రెండు ప్రధాన పార్టీల నేతలు అయోమయంలో పడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలిదశగా ఏడు మండలాల పరిధిలోని 96 ఎంపీటీసీ, ఏడు జె డ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించిన అధికారులు పరిశీలన ప్రక్రియ కూడా పూర్తిచేశారు. ఈనెల 28న ఉపసంహరణ ఘట్టం కూడా ముగియనుంది. అయితే ఇందుకు మరో రోజు మాత్రమే మిగిలింది. కాగా, ఒక్కో స్థానానికి ఒకే పార్టీ తరఫున పోటీపడుతున్న నాయకులను బుజ్జగించడం నేతలకు కష్టంగా మారింది. ముఖ్యంగా ఎంపీటీసీలకు ఎన్నడూ లేని విధంగా పోటీ ఏర్పడింది. రెబల్ అభ్యర్థులను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఒకరిద్దరు వెనకడుగు వేస్తున్నా.. కొందరు మాత్రం తప్పనిసరిగా బరిలో ఉంటామని తేల్చిచెబుతున్నారు. పార్టీ ‘బీ’ ఫారం ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటామని హెచ్చరికలు సైతం జారీచేస్తున్నారు. ఇటువంటి వారికి సర్దిచెప్పడానికి పార్టీ నేతల తలబొప్పి కడుతోంది. ఆయా పార్టీల నుంచి వలసలు జరగడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ నుంచి అధిక సంఖ్యలో ద్వితీయ శ్రేణి, చిన్న నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. గులాబీ కండువా కప్పుకున్న వారికి భవిష్యత్‌లో తగిన ప్రాధాన్యం ఇస్తామని చాలామందిని టీఆర్ఎస్లోకి లాగారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాదేశిక స్థానాలకు టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంతా అయ్యింది. దీనికితోడు పార్టీ పరంగా క్రియాశీలకంగా మెలగని నేతలూ రేసులో ఉన్నారు. ఆర్థికంగా పరిపుష్టిగా ఉండటంతో తమకే ‘బీ’ ఇవ్వాలంటున్నారు. మరికొందరు తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేశామని, దీనికి గుర్తింపుగా టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ఎవరికి వారు టికెట్లు ఆశించి అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఇటువంటి వారిని బుజ్జగించడం గులాబీ నేతలకు అగ్ని పరీక్షగా మారింది. అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేలకే రెబల్స్ బెడద లేకుండా చూడాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. దీంతో ఎమ్మెల్యేలంతా బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒకే రోజు గడువు ఉండటంతో శక్తిమేరకు ప్రయత్నిస్తూనే అవసరం ఉన్న చోట తాయిలాలు, హామీలు గుప్పిస్తున్నారు. కొందరికి డబ్బు ఆశ చూపి పక్కకు తప్పిస్తుండగా.. మరికొందరికి వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. అయినా కొందరు నేతలు పట్టువీడకపోతుండటంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పదవుల ఎర టీఆర్ఎస్లో మాదిరిగానే కాంగ్రెస్‌కూ రెబల్ అభ్యర్థులు తలనొప్పిగా మారారు. అసలే వలసలతో పార్టీ ఖాళీ అవుతున్న వేళ స్థానిక సంస్థలను ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకుంది. ఎలాగైనా పూర్వవైభవాన్ని ప్రదర్శించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇటువంటి సమయంలో రెబల్ అభ్యర్థుల తీరుతో పార్టీ సతమతమవుతోంది. కొన్ని చోట్ల నాయకులకు పార్టీ జిల్లా పెద్దలు నచ్చజెప్పి బరి నుంచి వైదొలగేలా చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల మాత్రం అభ్యర్థులు బెట్టువీడడం లేదు. పార్టీ సంస్థాగతంగా, వచ్చే ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని భరోసా కల్పిస్తున్నారు. చివరకు నేతల మాటలకు కట్టుబడి ఉంటారా.. లేదా అనేది ఈనెల 28న తేలనుంది. ఎంపీటీసీలకిలా... ఏడు మండలాల్లోని మొత్తం 96 స్థానాలకు టీఆర్ఎస్ తరఫున 234 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా చేవెళ్లలో బరిలో నిలిచారు. ఈ మండలంలో మొత్తం 17 ఎంపీటీసీలు ఉండగా టీఆర్ఎస్ పార్టీ తరఫున 46 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన మండలాల్లోనూ ఇంచుమించు ఇదే స్థాయిలో పోటీ నెలకొంది. అత్యల్పంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని 10 స్థానాలకు 24 మంది బీఫారం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే తరహాలో పోటీ కనిపిస్తోంది. అత్యధికంగా షాబాద్ మండలంలోని 15 ఎంపీటీసీలకు 36 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అత్యల్పంగా ఇబ్రహీంపట్నంలోని 10 స్థానాలకు 21 నామినేషన్లు రిటర్నింగ్ అధికారులకు అందాయి. జెడ్పీటీసీల్లోనూ.. ఎంపీటీసీలతో పోల్చుకుంటే జెడ్పీటీసీలకు పోటీ బాగానే ఉంది. కొన్ని స్థానాలకు రెండు మూడు నామినేషన్లు దాఖలుకాగా.. మరికొన్ని మండలాల్లో ఈ సంఖ్య ఆరు వరకు ఉండటం గమనార్హం. టీఆర్ఎస్ తరఫున మొయినాబాద్ జెడ్పీటీసీకి ఆరుగురు పోటీపడుతున్నారు.ఆ తర్వాతి స్థానంలో ఇబ్రహీంపట్నం నిలిచింది. ఇక్కడ ఐదుగురు రేసులో ఉన్నాయి. షాబాద్‌కు మాత్రం ఈ పార్టీ నుంచి ఒక్క నామినేషన్ మాత్రమే అందింది. ఇక కాంగ్రెస్ తరఫున అబ్దుల్లాపూర్‌మెట్ స్థానానికి విపరీతంగా పోటీ కనిపిస్తోంది. ఇక్కడ ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంచాల, షాబాద్, మొయినాబాద్ స్థానాలకు నలుగురు చొప్పున వరుసలో నిలిచారు. -
9మంది రెబల్ అభ్యర్థులపై టీడీపీ వేటు
సాక్షి, అమరావతి : రెబల్ అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన పార్టీ నేతలు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినా పోటీ నుంచి తప్పుకోకపోవడంతో రెబల్స్‌పై వేటు వేశారు. దీంతో పార్టీని ధిక్కరించి...పోటీ చేస్తున్న 9మంది అభ్యర్థులపై వేటు వేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయినవారు... 1. రంపచోడవరం - కేవీఆర్కే ఫణీశ్వరి 2. గజపతి నగరం - కే.శ్రీనివాసరావు 3. అవనిగడ్డ - కంఠమనేని రవి శంకర్ 4. తంబళ్లపల్లి - ఎం.మాధవరెడ్డి 5. తంబళ్లపల్లి - ఎన్.విశ్వనాథ్ రెడ్డి 6. మదనపల్లె - బొమ్మనచెరువు శ్రీరాములు 7. బద్వేల్ - ఎన్. విజయజ్యోతి 8. కడప - ఏ.రాజగోపాల్ రెడ్డి 9. తాడికొండ - సర్వా శ్రీనివాసరావు -
దేవెగౌడ నామినేషన్
బెంగళూరు: జనతాదళ్(సెక్యులర్) పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(85) సోమవారం కర్ణాటకలోని తుముకూరు లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన జేడీఎస్, కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. పొత్తుల్లో భాగంగా తుముకూరు సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన జేడీఎస్‌కు కేటాయించింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ముద్ద హనుమగౌడ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. కాంగ్రెస్ కండువా ధరించి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. చివరి నిమిషంలోనైనా తనకే కాంగ్రెస్ టికెట్ లభిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. రాజన్న అనే మరో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తుముకూరు నుంచి నామినేషన్ చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణులు విభేదాలను వీడి, కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాల్లోని కూటమి అభ్యర్థులను గెలిపించాలని దేవెగౌడ పిలుపునిచ్చారు. పొత్తుల్లో భాగంగా జేడీఎస్ 8, కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. దేవెగౌడ ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్న హసన్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి తన మనవడు, మంత్రి రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ పోటీ చేస్తున్న తుముకూరు లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతోపాటు జేడీఎస్ కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. పొత్తులో భాగంగా సిట్టింగ్ స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. జేడీఎస్‌లో దేవెగౌడ కుటుంబానికి మాత్రమే అధిక ప్రాధాన్యత లభిస్తోందని కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేవెగౌడ గెలుపు అంత సులువు ఏమీ కాదని పరిశీలకులు భావిస్తున్నారు. -
పార్టీ ప్రకటనకు ముందే రెబల్‌గా నామినేషన్..
-
తొలి రోజే టీడీపీకి షాకిస్తున్న రెబల్స్..
సాక్షి, అమరావతి: నామినేషన్ల పర్వం మొదలైన రోజే టీడీపీకి గట్టి షాక్ తగిలింది. పలువురు టీడీపీ రెబల్ అభ్యర్థులు తొలి రోజే తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రెబల్స్ నామినేషన్ల పర్వం ఓ వైపు.. పార్టీలో అసమ్మతి నేతల మరోవైపు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మెజారిటీ జిల్లాలో ఇలాంటి పరిస్థితులే నెలకొనడం టీడీపీకి మింగుడుపడని అంశంగా మారింది. రెబల్స్‌ను బుజ్జగించాలని చూస్తున్న టీడీపీ నేతల ప్రయత్నాల ఫలించడంలేదు. రెబల్ అభ్యర్థిగా బరిలోకి త్రిమూర్తులు రాజు... విజయనగరం: జిల్లాలో తొలి నామినేషన్ అధికార పార్టీ రెబెల్ అభ్యర్థితో మొదలైంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె తిమూర్తులు రాజు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. చీపురుపల్లి టికెట్‌పై ఆశపెట్టుకున్న త్రిమూర్తులు రాజుకు నిరాశే మిగిలింది. దీంతో ఆయన టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ చీపురుపల్లి టికెట్‌ను ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగర్జునకు కేటాయించింది. దీనిని వ్యతిరేకిస్తూ త్రిమూర్తులు రాజు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం తన నివాసంలో సమావేశమయ్యారు. కిమిడి మృణాళిని కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దన్న పార్టీ పట్టించేకోలేదన్నారు. మూడు రోజులుగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన అనంతరమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. (విజయనగరం టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి జ్వాలలు) త్రిమూర్తులు రాజు నిర్ణయానికి పార్టీలోని మెజారిటీ ప్రజలు అండగా నిలిచారు. ఆయన నామినేషన్ ప్రక్రియకు కార్యకర్తలు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు. పార్టీ ఓడిపోయేవారికి టికెట్ ఇచ్చిందని.. అందుకే పార్టీని బ్రతికించడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు త్రిమూర్తులు రాజు వ్యాఖ్యానించారు. త్రిమూర్తులు రాజును ఎలాగైనా బుజ్జగించి.. పోటీలో లేకుండా చేయాలనే టీడీపీ నేతల ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ ప్రకటనకు ముందే రెబల్‌గా నామినేషన్.. అనంతపురం: కల్యాణదుర్గం టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతుండటంతో.. పార్టీ అభ్యర్థిని ప్రకటించకముందే సిట్టింగ్ ఎమ్మెల్యే రెబల్‌గా బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. టికెట్ ఖరారు కాకముందే నామినేషన్ వేయడంపై ఆయన వ్యతిరేక వర్గం భగ్గుమంటుంది. హనుమంతరాయ చౌదరి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. పార్టీ తరఫున టికెట్ వచ్చినా.. రాకపోయిన పోటీ చేసి తీరుతానని హనుమంతరాయ చౌదరి స్పష్టం చేశారు. మాల్యాద్రిని చిత్తుగా ఓడిస్తాం.. గుంటూరు: తాడికొండ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రవణ్‌కు కేటాయించకపోవడం ఆయన వర్గం కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. శ్రవణ్‌కు టికెట్ కేటాయించాలని సీఎం నివాసం వద్ద కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. తాడికొండ టికెట్ మాల్యాద్రికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రవణ్‌కు టికెట్ ఇవ్వకపోతే.. మాల్యాద్రిని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎంపీ సుజనా చౌదరి అండతోనే మాల్యాద్రికి సీటు ఇచ్చారని విమర్శిస్తున్నారు. మల్యాద్రి ముసుగులో రాజధానిలో అవినీతికి పాల్పడాలని సుజనా చూస్తున్నారని ఆరోపించారు. మాల్యాద్రిని గ్రామాల్లోకి కూడా రానివ్వమని టీడీపీ కార్యకర్తలు తేల్చిచెప్పారు. తూర్పు గోదావరిలో అసంతృప్త జ్వాలలు.. తూర్పుగోదావరి: జిల్లాకు చెందిన పలువురు అసంతృప్త నేతలు బాహాటంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం ఏజెన్సీలో వంతల రాజేశ్వరి ఎంపికపై విలీన మండలాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పులపర్తి నారాయణమూర్తికి పి గన్నవరం టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు. -
టీడీపీకి గట్టి షాక్ తగిలింది
-
90కి చేరిన టీఆర్ఎస్ బలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ బుధవారం కేటీఆర్‌ను కలిసి టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో కోరుకంటి చందర్ రామగుండంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై గెలిచారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సోమారపు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోరుకుంటి చందర్‌పై గెలుపొందారు. అనంతరం సత్యనారాయణ టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు కోరుకంటి చందర్ విషయంలోనూ ఇదే జరిగింది. వైరా నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కపోవడంతో రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అసెంబ్లీ రద్దుకు ముందు టీఆర్ఎస్ పార్టీకి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. కేసీఆర్ మా నాయకుడు: చందర్ ‘ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పీడీ యాక్టులతో ఇబ్బంది పెట్టిన వెనకడుగు వేయలేదు. నాటి నుంచి నేటి వరకు మా నాయకుడు కేసీఆరే.. నాకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆరే. నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేటీఆర్‌ను కలిసి నా మద్దతు తెలిపా. టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా’అని చందర్ అన్నారు. -
బాబ్బాబు.. విరమించండి
కంటిలోన నలుసు.. పంటికింద రాయి.. చెప్పులోన ముల్లు.. చెవిలోన జోరీగ.. ఈ మాటలు టీడీపీ రెబెల్స్‌కు అచ్చంగా అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షానికి సీట్ల కేటాయింపు వంటి విషయాల్లో తప్పటడులు వేసిన చంద్రబాబు తీరుతో మొదలైన ధిక్కార స్వరం మరింత పెరుగుతోంది. పలు నియోజకవర్గాల్లో మింగుడుపడని రెబెల్స్‌ను దారికి తెచ్చుకునేందుకు టీడీపీ నేతలు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ప్రత్యేకంగా చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన టీడీపీ దూతలు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించటం లేదు. సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు బుధవారంతో ముగియనుండటంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంగళవారం చక్కర్లు కొట్టి మంత్రాంగం నెరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో మరోమారు చర్చించి ఏదోరకంగా దారికి తెచ్చుకుంటామని చెబుతున్నారు. జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు 39 మంది, 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 305 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ తొలిరోజు కావడంతో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు తుదిరోజు కావడంతో పోటీని తగ్గించేందుకు బుజ్జగింపులు ఊపందుకున్నాయి. ప్రధాన అభ్యర్థులను వణికిస్తున్న తిరుగుబాటు అభ్యర్థుల విషయంలో టీడీపీ నేతలకు కంటి మీద కునుకులేదు. ‘కంఠంనేని’ ససేమిరా.. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠంనేని రవిశంకర్ వద్దకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి మంత్రాంగం నడిపారు. దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. మీరు పోటీలో ఉంటే టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌కు నష్టం, నామినేషన్ ఉపసంహరించుకుని ఆయన గెలుపుకోసం కృషి చేయాలని సుజనా చౌదరి బతిమాలినట్టు సమాచారం. అయితే వాడుకుని వదిలేయడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారని, 2009 ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారని ఎదురుచూస్తే తనకు ఆశచూపి అంబటి బ్రాహ్మణయ్యకు ఇచ్చారని, ఇప్పుడు కనీసం తన పేరు కూడా పరిశీలించలేదని రవిశంకర్ ఘాటుగానే సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలో తాను పోటీ నుంచి తప్పుకొనేది లేదని, పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించకుంటే ఆ కడుపుమంట ఎలా ఉంటుందో చూపించాలనే పోటీకి దిగానని ఆయన తేల్చిచెప్పినట్టు తెలిసింది. మెత్తబడ్డ జయమంగళ.. తొలినుంచి టిక్కెట్ ఇస్తానని చెప్పి చివరకు కైకలూరు టిక్కెట్‌ను బీజేపీకి కేటాయించడంతో మండిపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నామినేషన్ వేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పోటీనుంచి తప్పించేందుకు టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి బాబు, బీజేపీ నేతలు సోమ, మంగళవారాల్లో ఆయనతో చర్చలు జరిపారు. ‘ఏం ఆశ పెట్టారో ఏమో’ జయమంగళ తన నామినేషన్ ఉపసంహరించుకునేలా మెత్తబడినట్టు తెలిసింది. కైకలూరు నియోజవర్గంలోని మరో రెబల్ అభ్యర్థి చలమలశెట్టి రామానుజయను కూడా బుజ్జగించినట్టు సమాచారం. చంద్రబాబు జిల్లాకు వచ్చిన సమయంలో ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్న చలమలశెట్టి రామానుజయ సతీమణి కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకున్నారంటూ టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్న తమను కాదని వేరొకరికి టిక్కెట్ ఇవ్వడంపై మండిపడిన చలమలశెట్టి ఇప్పుడు మెత్తబడి నామినేషన్ ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నూజివీడు టీడీపీలో తిరుగుబాటు.. పార్టీని నమ్ముకున్నవారికి కాకుండా స్థానికేతరుడికి టిక్కెట్ ఇవ్వడంపై నూజివీడు తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగిరింది. కాంగ్రెస్‌కు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు నూజివీడు టీడీపీ టిక్కెట్ ఇవ్వడం తెలిసిందే. దీంతో టీడీపీలో తీవ్ర ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. తనకు కాదని వేరొకరికి టిక్కెట్ ఇవ్వడంతో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నెల 18న జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఈ నెల 19న బచ్చుల అర్జునుడిని విజయవాడ పిలిపించుకుని బుజ్జగించారు. అవనిగడ్డలో టిక్కెట్ ఇస్తానని వాడుకుని వదిలేయడంతో ఆగ్రహంతో రగిలిపోతున్న నోవా విద్యా సంస్థల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు వల్ల నూజివీడులో టీడీపీ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో ఆయనను కూడా బుజ్జగిస్తున్నారు. చంద్రబాబు సమక్షంలోనే తన నిరసన తెలిపిన ముత్తంశెట్టి మెత్తబడే అవకాశంలేదని చెబుతున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో మొదలైన తిరుగుబాటు పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల పుట్టిముంచుతుందని భయపడుతున్నారు.