‘పౌర సంబంధాలు’ లేవయా..!
సమాచార శాఖకు నిర్లక్ష్యపు జబ్బు
సరెండర్ చేసినా మారని అధికారుల తీరు
సమన్వయ లోపంతో సతమతం
ఫైళ్లు మాయమవుతున్నా.. పట్టింపు కరువు
సాక్షి, హన్మకొండ : ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడం... పథకాలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడం సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రధాన విధి. జిల్లా పౌరసంబంధాల శాఖకు మాత్రం ఇదేమీ పట్టడం లేదు. కొంత కాలంగా ఈ విధులను పక్కనబెట్టేసింది. సాధారణ పాలన వ్యవహారాలను కూడా నిర్వహించలేని దుస్థితికి చేరుకుంది. పౌర సంబంధాల శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ జి.కిషన్ పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సాధారణ ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించాల్సిన జిల్లా పౌర సంబంధాల అధికారి జిల్లా కేంద్రంలో ఉండకపోవడంతో చార్జ మెమో సైతం ఇచ్చా రు. ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల విషయంలో పౌర సంబంధాల శాఖ నిర్లక్ష్యపు ధోరణి కొనసాగడంతో కలెక్టర్ ఏకంగా డీపీఆర్ఓను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. జిల్లాస్థాయి అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేయడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం.
ఈ ఘటనతోనైనా... సమాచార, పౌరసంంధాల శాఖ యంత్రాంగంలో మార్పు వస్తుందని అందరూ ఆశించారు. కానీ... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వారి వైఖరి మారలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించలేకపోయూరు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై పలు శాఖల జిల్లా అధికారులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అంతా అధ్వానం
జిల్లాలో గతంలో డీపీఆర్ఓ స్థాయి అధికారి మాత్రమే ఉండేవారు. ఇద్దరు డివిజనల్ పీఆర్ఓలు, ఇద్దరు ఏపీఆర్ఓవలు సమన్వయంతో విధులు నిర్వర్తించేవారు. మేడారం జాతరలోనూ వారే పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మేరకు సమాచార శాఖ వ్యవస్థలో మార్పులు జరిగాయి. జిల్లా పౌర సంబంధాల అధికారి పోస్టును డిప్యూటీ డెరైక్టర్ పోస్టుగా అప్గ్రేడ్ చేశారు. ఈ మార్పు తర్వాత డీడీ పోస్టులోకి బాలగంగాధర తిలక్, డీపీఆర్ఓగా వెంకటసురేష్ వచ్చారు. అప్పటికే పరిపాలనా పరంగా అధ్వానంగా ఉన్న డీపీఆర్ఓ కార్యాలయంలో వీరిద్దరి రాక తర్వాత పరిస్థితి ఇంకా దయనీయంగా మారినట్లు సమాచారం.
సమన్వయలోపంతో వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కలెక్టర్ కార్యక్రమాల వివరాలను సైతం సమాచార సాధనాలకు చెప్పే పరిస్థితి లేకుండా తయారైంది. అధికారుల నిర్లక్ష్యంతో కార్యాలయంలోని పలు కీలక ఫైళ్లు పోయాయి. ఇవి ఎన్ని అనే దానిపై స్పష్టత రావడంలేదని డీపీఆర్ఓ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పనితీరు సరిగా లేని కారణంగా డీపీఆర్ఓ వెంకటసురేష్ను కలెక్టర్ సరెండర్ చేయడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. గతంలో డీపీఆర్ఓగా పనిచేసిన ఒక అధికారికి ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించినా... సదరు వ్యక్తి బాధ్యతలను స్వీకరించలేదు. దీంతో పరిస్థితి మరింతగా దిగజారినట్లు తెలుస్తోంది. ఫలితంగా పౌర సంబంధాల శాఖ ఎవరికీ సంబంధం లేని శాఖగా మారింది.