'హ్యాట్రిక్'తో సింధు సంచలనం
మకావు: తెలుగు తేజం సింధు మరోసారి అంతర్జాతీయ యవనికపై సంచలనం సృష్టించింది. వరుసగా మూడోసారి మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో జపాన్ కు చెందిన మినత్సు మితానిని మట్టికరిపించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
66 నిమిషాలు పాటు సాగిన మ్యాచ్ లో సింధు 21- 9, 21- 23, 21- 14 తేడాతో మితానిని ఓడించింది. మొదటి సెట్ సునాయాసంగా గెలుచుకున్న సింధుకు రెండో సెట్ లో మితానిని గట్టి పోటీ ఇచ్చింది. అయితే గేమ్ పాయింట్ వరకు పోరాడిన సింధు తృటిలో (23-21) తేడాతో సంపూర్ణ విజయావకాశాన్ని కోల్పోయింది. ఆ వెంటనే మూడో గేమ్ ప్రారంభం నుంచి ధాటిగా ఆడి 21- 14తేడాతో గెల్చుకుని వరుసగా మూడో ఏడాది మకావు ఓపెన్ విజేతగా సంచలనం నమోదు చేసింది.
కాగా మకావు ఓపెన్ 2013, 2014లలో విజేతగా నిలిచిన ఈ తెలుగు తేజం 2015 టైటిల్ ను కూడా గెల్చుకోవడం ద్వారా అరుదైన 'హ్యాట్రిక్' నమోదు చేసినట్లయింది. గత ఏడాది ఇదే మకావు ఓపెన్‌లో చివరిసారి అంతర్జాతీయ టైటిల్ సాధించిన సింధుకు ఆ తర్వాత ఇతర టోర్నీల్లో నిరాశ ఎదురైంది. గత నెలలో డెన్మార్క్ ఓపెన్‌లో సింధు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ రన్నరప్‌గా సంతృప్తి పడింది.