Recovery of money
-
దోచిన ప్రతి పైసా కక్కిస్తాం
న్యూఢిల్లీ: ‘‘ప్రజల నుంచి గతంలో మీరు దోచుకున్న ప్రతి పైసానూ కక్కిస్తా. దాన్నంతటినీ ప్రజలకు తిరిగిచ్చేయాల్సిందే’’ అని విపక్షాలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘ఇది మోదీ హామీ’ అంటూ శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందినదిగా చెబుతున్న వ్యాపార సంస్థ నుంచి రూ.200 కోట్లను ఐటీ శాఖ రికవర్ చేసిందన్న వార్తను ప్రధాని టాగ్ చేశారు. పలు అల్మారాల్లో అరల నిండా పేర్చిన కరెన్సీ నోట్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ సైట్లలో వైరల్‌గా మార్చడం తెలిసిందే. ఈ కరెన్సీ నోట్ల గుట్టను దేశ ప్రజలంతా చూడాలని మోదీ కోరారు. తర్వాత నిజాయితీపై కాంగ్రెస్ నేతలు దంచే స్పీచులు వినాలంటూ ఎద్దవా చేశారు. పలు ఎమోజీలను కూడా పోస్టుకు జత చేశారు. వెడ్ ఇన్ ఇండియా సంపన్నులకు మోదీ పిలుపు డెహ్రాడూన్: సంపన్నులు డెస్టినేషన్ పెళ్లిళ్లకు దేశీయ లొకేషన్లనే ఎంచుకోవాలని మోదీ కోరారు. ఇందుకోసం మేడిన్ ఇండియా మాదిరిగానే ‘వెడ్ ఇన్ ఇండియా’ అంటూ విప్లవమే రావాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. సంపన్న పారిశ్రామికవేత్తలు తమ కుటుంబాల్లో కనీసం ఒక్క పెళ్లినైనా ఉత్తరాఖండ్ వంటి చోటప్లాన్ చేయాలని సూచించారు. తద్వారా ఈ హిమాలయ రాష్ట్రం వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మారుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. శుక్రవారం ఇక్కడ ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ తొలి సెషన్లో మోదీ ప్రసంగించారు. భారత్‌లో సంపన్న వ్యాపార వర్గాలు పెళ్లిళ్లకు విదేశాలనే ఎంచుకోవడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. ‘‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు. మరి వాటిని చేసుకునేందుకు యువ జంటలు దేవ భూమి ఉత్తరాఖండ్‌కు బదులు విదేశాలకు ఎందుకు వెళ్లడం?’’ అని ప్రశ్నించారు. -
మెహుల్ చోక్సీ బ్యాంక్, డీమ్యాట్, ఫండ్ ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: భారత్ నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ చెల్లించాల్సిన రూ.5.35 కోట్ల బకాయిల రికవరీ దిశలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. చోక్సీ బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్‌ల జప్తునకు ఆదేశించింది. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ షేర్లలో మోసపూరిత ట్రేడింగ్‌కు పాల్పడిన కేసులో సెబీ 2022 అక్టోబర్‌లో విధించిన జరిమానాను చెల్లించడంలో చోక్సీ విఫలమైన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ గ్రూప్‌లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న చోక్సీ, మరో ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోడీకి మామ కావడం గమనార్హం. ప్రభుత్వ ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని రూ.14,000 కోట్లకు పైగా మోసగించినట్లు వీరిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీఎన్బీ స్కామ్ వెలుగులోనికి వచ్చిన తర్వాత 2018 తొలి నాళ్లలో వీరు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా లేదా బార్ముడాలో ఉన్నారని వార్తలు వస్తుండగా, మోడీ బ్రిటిష్ జైలులో ఉన్నారు. తనను అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను కోర్టులో ఆయన సవాలు చేశారు. -
విదేశీ హ్యాకర్ల నుంచి డబ్బు రికవరీ
సాక్షి, అమరావతి బ్యూరో: ఓ విదేశీ కంపెనీ వ్యాపార లావాదేవీలకు వినియోగించే మెయిల్‌ను హ్యాకింగ్ చేసిన హ్యాకర్లు కొందరు ఆ కంపెనీ మెయిల్ ఐడీని పోలిన మరొక నకిలీ మెయిల్ రూపొందించి తద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీని బురిడీ కొట్టించి రూ.1.14 కోట్లు కొల్లగొట్టారు. మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు విజయవాడ కమిషనర్ బత్తిన శ్రీనివాసులును కలిసి సహాయం చేయాలని కోరగా.. పశ్చిమగోదావరి ఎస్పీతో మాట్లాడిన పోలీసు కమిషనర్ భీమవరం టూ టౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయించి.. బెజవాడ సైబర్ క్రైం పోలీసులతో కేసు దర్యాప్తు చేయించి హ్యాకర్లు కొల్లగొట్టిన సొమ్ము నుంచి కొంత రికవరీ చేయించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ సెంటర్‌కు అమెరికాలోని హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఆ కంపెనీతో ఉత్తర ప్రత్యుత్తరాలను మెయిల్ ద్వారా జరుపుకునేవారు. ఇలాంటి మెయిల్స్ కోసం ఇంటర్నెట్లో సంచరించే హ్యాకర్లు భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ సెంటర్ మెయిల్‌ను హ్యాక్ చేసి వారి వ్యాపార లావాదేవీలపై అవగాహనకు వచ్చారు. అనంతరం హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ మెయిల్ ఐడీని పోలిన నకిలీ మెయిల్‌ను సృష్టించారు. దాని ద్వారా భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ కంపెనీకి మెయిల్స్ పంపి, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బును హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ అకౌంట్లో కాకుండా.. తాము సూచించిన అకౌంట్ నందు జమ చేసే విధంగా హ్యాకర్లు ఏర్పాట్లు చేసుకున్నారు. సదరు మెయిల్స్ నిజమైనవిగా భావించిన భీమవరం కమ్యూనిటీ సెంటర్ నిర్వాహకులు రూ. 1.14 కోట్ల (1,50,913 యూఎస్ డాలర్లు)ను రెండు దఫాలుగా హ్యాకర్లు సూచించిన అకౌంట్లో జూన్ నెలలో జమ చేశారు. ఆ తరువాత తాము మోసపోయామని గుర్తించిన నిర్వాహకులు విజయవాడ పోలీసు కమిషనర్‌ను కలిసి సహాయం చేయమని విజ్ఞప్తి చేశారు. దాంతో కమిషనర్ స్పందించి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో మాట్లాడి.. భీమవరం టూ టౌన్ పోలీసుస్టేషన్లో బాధితుడి ద్వారా ఫిర్యాదు చేయించారు. దర్యాప్తునకు బెజవాడ సైబర్‌క్రైం పోలీసులు సహకారం అందించాలని ఆదేశించారు. రూ. 33.08 లక్షల రికవరీ.. నగర కమిషనర్ ఆదేశాలతో దర్యాప్తును కొనసాగించిన సైబర్‌క్రైం పోలీసులు బాధితులు పోగొట్టుకున్న నగదు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన హెచ్ఎస్బీసీ బ్యాంక్‌లో జమ అయినట్లు గుర్తించారు. తరువాత బాధితుడి అకౌంట్ ఉన్న ఎస్బీఐ ఫోరెక్స్ బ్రాంచ్ ద్వారా చెన్నై హెచ్ఎస్బీసీ బ్రాంచ్‌కు వివరాలు తెలిపారు. చెన్నై బ్రాంచ్ ద్వారా యూకే హెచ్ఎస్బీసీ బ్రాంచ్‌ను సంప్రదించిన సైబర్ పోలీసులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి బాధితుడు పోగొ ట్టుకున్న సొమ్ములో రూ.33,08,068 లక్షల నగదు (44, 551.11 యూఎస్ డాలర్లు)ను భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ కంపెనీ అకౌంట్లో జమ చేయించారు. ఈ కేసు కౌంటర్ పార్ట్ అయిన హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ యాజమాన్యాన్ని విజయవాడ సైబర్‌క్రైం పోలీసులు సంప్రదించి వారి ద్వారా యూకేలోని వెస్ట్ యార్క్‌షైర్ పోలీసుస్టేషన్లో కూడా కేసు నమోదు చేయించారు. -
త్వరలో పీసీఏ నుంచి బైటపడతాం
మొండిబాకీల రికవరీకి, నిర్వహణ మెరుగుపర్చుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మళ్లీ లాభాల బాట పట్టగలమని ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) ఎండీ, సీఈవో కరణం శేఖర్ తెలిపారు. తద్వారా సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ)పరమైన ఆంక్షల పరిధి నుంచి త్వరలోనే బైటపడగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ ఈ విషయాలు వెల్లడించారు. మరిన్ని వివరాలు.. పీసీఏ నుంచి ఎలా బైటపడబోతున్నారు? ఐవోబీ 2015లో పీసీఏ పరిధిలోకి వచ్చింది. మొండిబాకీలు పేరుకుపోయిన బ్యాంకులపై పీసీఏపరమైన ఆంక్షలు విధించేందుకు ఆర్బీఐ ప్రధానంగా నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వీటిలో లీవరేజీ అంశంలో మేం మెరుగ్గానే ఉన్నాం. మూలధన నిష్పత్తి విషయంలో సెప్టెంబర్ త్రైమాసికంలో గట్టెక్కాం. మొండిబాకీలు కూడా నిర్దేశిత 6 శాతం దిగువకి తగ్గనున్నాయి. ప్రొవిజనింగ్ క్రమంగా తగ్గుతుండటంతో డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లోనే మళ్లీ లాభాల్లోకి వచ్చే అవకాశముంది. మొండిబాకీల రికవరీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొండిబాకీలను (ఎన్పీఏ) రాబట్టుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. అన్ని ఎన్పీఏలను 16 అసెట్ రికవరీ మేనేజ్మెంట్ శాఖలకు (ఏఆర్‌ఎంబీ) బదలాయిస్తున్నాం. రికవరీ బాధ్యతలను వాటికే అప్పగిస్తున్నాం. ప్రత్యేక వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద రూ. 25 కోట్ల దాకా రుణాల సెటిల్మెంట్కు అవకాశం కల్పిస్తున్నాం. దీన్నుంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటి ఊతంతో నికర ఎన్పీఏలు 6 శాతం లోపు స్థాయికి దిగి రావొచ్చు. మొండిబాకీల పరిమాణం తగ్గే కొద్దీ ప్రొవిజనింగ్ కూడా క్రమంగా తగ్గనుంది. తద్వారా మళ్లీ స్థిరంగా లాభాలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, డిఫాల్టర్ల ప్రాపర్టీల వేలం ప్రక్రియ కూడా చురుగ్గా నిర్వహిస్తున్నాం. ఇలాంటివి సుమారు 8,000 దాకా ప్రాపర్టీలు ఉన్నాయి. ప్రతి నెలా 1,000–1,500 దాకా వేలం నిర్వహిస్తున్నాం. గతేడాది జూలైలో ప్రారంభమైన తొలి విడత ఈ జనవరిలో పూర్తి కానుంది. దీనికి క్రమంగా మంచి స్పందనే వస్తోంది. రుణాల పోర్ట్‌ఫోలియో పరిస్థితి ఎలా ఉంది? మేం ఎక్కువగా కార్పొరేట్ రుణాల జోలికి వెళ్లడం లేదు. ప్రధానంగా లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), రిటైల్ గృహ రుణాలు, వ్యవసాయ రుణాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. ఎంఎస్ఎంఈ రుణాల పోర్ట్‌ఫోలియో సుమారు రూ. 30,000–35,000 కోట్ల స్థాయిలో ఉంది. దీనితో పాటు రిటైల్, వ్యవసాయ రుణాలన్నీ కలిపి రూ. 1 లక్ష కోట్ల పైగానే ఉంటాయి. ఎంఎస్ఎంఈ రుణాలకు సంబంధించి ప్రత్యేకంగా 200 శాఖలను గుర్తించాం. వీటిలో 20 శాఖలు తెలుగు రాష్ట్రాల్లో ఉండనున్నాయి. ఎంఎస్ఎంఈల రుణావసరాలు తదితర అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ఈ శాఖల్లో ఉంటారు. జనవరి–మార్చి త్రైమాసికంలోనే ఈ వ్యూహాన్ని అమల్లోకి తేనున్నాం. ఎంఎస్ఎంఈ, రిటైల్ రుణాల్లో పెద్దగా మొండిబాకీల సమస్య లేదు. నికర వడ్డీ మార్జిన్లు మెరుగ్గా ఉంటాయి. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో -
ఉపాధ్యాయుల్లో ‘ఎల్టీసీ’ గుబులు
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం కల్పించిన ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్షెషన్) సుదుపాయాన్ని దుర్వినియోగపరచి జేబులు నింపుకున్న ఉపాధ్యాయుల నుంచి సొమ్ము రికవరీకి గడువు సమీపిస్తుండడంతో అటు అధికారుల్లో, ఇటు ఉపాధ్యాయుల్లోనూ టెన్షన్ మొదలైంది. జిల్లాలో 2008 సంతవ్సరంలో ఎల్టీసీ కింద జిల్లాలో 1900 మంది ఉపాధ్యాయులు దొంగ బిల్లులు పెట్టి ఏకంగా రూ. కోటి 33 లక్షలు దండుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం వెలుగుచూడడంతో ఆడిట్ జనరల్ జిల్లా వ్యాప్తంగా విచారణ చేయించింది. 2012 డిసెంబరు నుంచి బోగస్ టికెట్లతో ఎల్టీసీ లబ్ధిపొందిన ఉపాధ్యాయుల వివరాలను పంపి, వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని ఏజీ నేరుగా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. ఇప్పటిదాకా సుమారు 600 మంది ఉపాధ్యాయుల నుంచి రికవరీ చేశారు. స్వాహా చేసిన డబ్బు తిరిగి చెల్లించారంటే తప్పుచేసినట్లు అంగీకరించినట్టేనని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. బిల్లులు మంజూరు చేసిన ఎంఈఓలపై కూడా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై హైకోర్టు రెండు నెలల గడువు ఇస్తూ రికవరితోపాటు బాధ్యులపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారో వివరించాలని విద్యాశాఖను ఆదేశించింది. ఇప్పటికే దాదాపు నెల గడిచింది. కేవలం నెల రోజులు మాత్రమే ఉండడంతో విద్యాశాఖ అధికారులు ఆఘమేఘాలపై సమావేశాలు నిర్వహిస్తూ సొమ్ము రికవరీ చేయిస్తున్నారు. అప్పట్లో ఎల్టీసీ మంజూరుకు బిల్లులో సుమారు 25 శాతం దాకా ఖర్చు చేసుకున్న ఉపాధ్యాయులు ప్రస్తుతం మొత్తం బిల్లు వెనక్కు చెల్లిస్తుండడం గమనార్హం. పైగా రికవరీ తర్వాత ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారోనని ఉపాధ్యాయుల్లో టెన్షన్ మొదలైంది. ఈ భాగోతంలో ఉపాధ్యాయులతోపాటు కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా ఉన్నారు.