సిద్దిపేట మే సోలిపేట
పురపోరు పగ్గాలు అప్పగింత
♦ అభ్యర్థుల ఎంపిక బాధ్యత రామలింగారెడ్డిదే..
♦ ఎంపిక కోసం కమిటీ నియామకం
♦ సభ్యులుగా మురళీయాదవ్, దేవేందర్‌రెడ్డి
♦ టికెట్ల కోసం కదిలిన గులాబీ ‘దండు’
♦ కమిటీకి అందిన 200 మంది బయోడేటా పత్రాలు
♦ తొలిరోజు 16 నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం టీఆర్ఎస్ పార్టీ నియామక కమిటీని వేసింది. పురపోరుకు గులాబీ ‘దళాన్ని’ నడిపే బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అత్యంత సన్నిహితుడు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అప్పగించారు. 34 వార్డులకు గాను గులాబీ దండు నుంచి దాదాపు 250 మందికి పైగా పోటీ పడటంతో నియామక కమిటీ వేయటం తప్పనిసరైంది. వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఈ కమిటీ చూసుకుంటుంది. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్, ఆ పార్టీ నేత దేవేందర్‌రెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఇటీవల రా ష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మే జర్ స్థానాలను ఒంటి చేతితో ఏకగ్రీ వం చేయించినపార్టీ ట్రబుల్ షూట ర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తన సొంత నియోజకవర్గం సిద్దిపేట విషయంలో ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. ఇంతకాలం తన వెంట నడిచిన ఏ ఒక్కరినీ టికెట్ల విషయంలో ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే మంత్రి .. నియామక కమిటీని తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత రాగద్వేషాలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో అభ్యర్థుల ఎంపిక జరగాలని కమిటీకి మంత్రి ఆదేశించారు.
రామలింగారెడ్డి నేతృత్వంలోని నియామక కమిటీ ఆసక్తి గల అభ్యర్థు ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. సోమవారం ఒక్కరోజే 200 మంది అభ్యర్థులు తమ బయోడేటాను కమిటీకి అందజేశారు. ఉద్యమ కాలంలో టీఆర్ఎస్కి అండగా నిలబడిన తీరు.. మంత్రి హరీశ్‌రావుతో వారికి ఉన్న అనుబంధం, సన్నిహిత సంబంధాలులతో కూడిన ప్రతులను బయోడేటాకు జత చేసి కమిటీకి సమర్పించారు. మంగళవారం మరో 100 నుంచి 150 మంది అభ్యర్థులు వస్తారని కమిటీ అంచనా వేస్తోంది . నియామక కమిటీ ఈ బయోడేటాలను వడపోసి తొలుత 68 మంది సభ్యులతో కూడిన ఒక రహస్య జాబితా రూపొందిస్తుంది. అనంతరం అభ్యర్థుల వ్యక్తిగత ప్రవర్తన, ఇంటలిజెన్సీ నివేదికలతో పాటు కమిటీ స్వతహాగా తెప్పించుకున్న అభ్యర్థుల సమాచారం ఆధారంగా తుది జాబితా రూ పొందిస్తారని తెలిసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో మంత్రి హరీశ్‌రావు ఎక్కడా కల్పించుకోరని, కేవలం రాజకీయపరమైన సలహాలు, సూచనలు మాత్రమే చేస్తారని తెలుస్తోంది.
తొలిరోజు 16 నామినేషన్లు....
తొలిరోజే 16 మంది నామినేషన్ ప త్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఇందులో 10 నామినేషన్లు టీఆర్ఎస్ అభ్యర్థులవే కావటం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరు, మిగిలిన వారు స్వంతంత్య అభ్యర్థులు. టీఆర్ఎస్ పార్టీ నుంచి రంగధాంపల్లి నుంచి ఇద్దరు, పటేల్‌పురా, సుభాష్‌నగర్, నర్సాపురం, వివేకానందనగర్, ఖాదర్పురా,నాసర్‌పురా, గాంధీ టూ కమాన్ వార్డుల నుంచి ఒక్కొక్కరి చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు.