Red cross blood storage
-
మాతా శిశు కేంద్రంలో బ్లడ్‌స్టోరేజీ సెంటర్
కరీంనగర్‌హెల్త్: పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బాలింతలు, గర్భిణులకు అత్యసవర సమయంలో రక్తం అందుబాటులో ఉంచాలని బ్లడ్ స్టోరేజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఈ స్టోరేజీ సెంటర్‌ను వారం క్రితమే ఇక్కడికి తరలించారు. కొత్తగా ఆధునిక హంగులతో బ్లడ్‌స్టోరేజ్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ప్రభుత్వం ఇక్కడికి తరలించింది. రోగుల సంఖ్యకు తగినట్లుగా వైద్యం.. మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి కాన్పుల కోసం వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిపించాలని కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన విషయం విధితమే. ఈ పథకంతో ఆస్పత్రిలో ప్రసవాలు పెరిగాయి. ప్రసుతం నెలలో వెయ్యి ప్రసవాల వరకు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎంసీహెచ్‌సీలో మెరుగైన వైద్యం అందిస్తుండటంతో మాతాశిశు మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. మరణాలు తగ్గడం, మెరుగైన సేవలతో ప్రసవాల సంఖ్య రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచి ఉత్తమ వైద్య సేవలకు జిల్లాకు అవార్డు వచ్చింది. ఇదేవిధంగా మరింత వైద్య సేవలతో ప్రజలకు మేలు జరుగాలనే ఉద్దేశంతో బ్లడ్‌స్టోరేజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రాజన్న సిరిసిల్ల నుంచి తరలింపు.. రాజన్నసిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్‌స్టోరేజీ సెంటర్ నిర్వహిస్తున్నారు. కొత్తగా జిల్లా కావడంతో అక్కడ బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వం రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి అధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి కరీంనగర్ మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సెంటర్ నిర్వహణకు ఉపయోగించే మిషనరీతోపాటు అక్కడ పనిచేస్తున్న ఇద్దరు టెక్నీషియన్లను కూడా డిప్యుటేషన్‌పై బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. బ్లడ్‌స్టోరేజ్ లైసెన్స్ కోసం.. మాతాశిశు ఆరోగ్యం కేంద్రంలో వెంటనే బ్లడ్‌స్టోరేజ్ సెంటర్ ఏర్పాటుకు గదిని కేటాయించారు. ఈ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్ మంజూరు కావాల్సి ఉంది. లైసెన్స్ కోరుతూ సంబంధి శాఖకు దరఖాస్తు చేసుకోగా ఇటీవల ఐదుగురు సభ్యులు గల బృందం మాతాశిశు కేంద్రాన్ని పరిశీలించింది. బ్లడ్‌స్టోరేజీ సెంటర్‌కు మిషనరీతోపాటు సిబ్బంది, రిఫ్రిజిరేటర్ సౌకర్యం, గది వైశాల్యం నిబంధనల ప్రకారం ఉండాల్సి ఉంది. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే అన్ని రకాల బ్లడ్ 3 నుంచి 4 యూనిట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. లైసెన్స్ మంజూరు కాగానే బ్లడ్‌సోరేజీ సెంటర్ త్వరలోనే ప్రారంభం అవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని నియమించాలి.. జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌సీలో బ్లడ్‌స్టోరేజీ సెంటర్ ఏర్పాటు చేయడంతోపాటు బ్లడ్‌బ్యాంక్ ను మరింత ఆధునికీకరించి సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. కోట్లాది రూపాయలతో ఆస్పత్రుల్లో సౌకర్యాలు, మెషినరీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం కావాల్సిన సిబ్బందిని నియమించడంలో వెనకాడుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆధునిక సౌకర్యాలతో సేవలం దించేందుకు బ్లడ్‌బ్యాంక్‌లో సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
తనిఖీలతో హడలెత్తించిన కలెక్టర్
ఆత్మకూరు, న్యూస్‌లైన్ : ‘లక్షలు పోసి యంత్రాలు ఏర్పాటు చేస్తే నిరుపయోగంగా వదిలేస్తారా.. పొరపాట్లకు పాల్పడితే రిటైరైనా చర్యలు తప్పవంటూ కలెక్టర్ శ్రీకాంత్ హెచ్చరించారు. ఆత్మకూరులో గురువారం కలెక్టర్ శ్రీకాంత్ విస్తృతంగా పర్యటించారు. తొలుత ప్రభుత్వాసుపత్రిలోని రెడ్‌క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రాన్ని, రికార్డులు, రక్తనిల్వ కేంద్రం పనితీరును తనిఖీ చేశారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, ఇతర విభాగాలను పరిశీలించారు. ఫొటోథెరపీ యంత్రం, వార్మింగ్ యంత్రం నిరుపయోగంగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని ఎందుకు ఉపయోగించడంలేదని డీఎంహెచ్ఓ, ఏరియా వైద్యశాల వైద్యాధికారిని ప్రశ్నించారు. శిక్షణ పొందిన సిబ్బంది లేరని, అందువల్ల ఉపయోగించడంలేదని వారు సమాధానం ఇవ్వడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది లేరని ఏడాది నుంచి నిరుపయోగంగా వదిలేస్తారా అంటూ ప్రశ్నించారు. శిక్షణ ఇచ్చే బాధ్యత ఎవరిదని డీఎంహెచ్ఓను ప్రశ్నించగా ఈ బాధ్యత పీఓడీటీదని చెప్పారు. వీటిని అప్పటి పీఓడీటీ సాగర్ ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఆయన రిటైర్ అయ్యారని చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ ఆయన పింఛన్లో కోత విధించాలని ఆదేశించారు. శిక్షణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సోమవారం సాయంత్రానికి తమకు పంపాలని ఆదేశించారు. అనంతరం క్రిస్టియన్‌పేట, ఒందూరుగుంట ప్రాం తాల్లో ఆయన పర్యటించారు. మీరు ఇంజనీర్లేనా.. మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా తాగునీటి పథకం, డ్రైనేజీ, పారిశుధ్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.65 కోట్లతో పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయని పబ్లిక్‌హెల్త్ అధికారులు వివరించారు. ఆ పథకం పూర్తయితే ప్రజలకు రోజుకు ఎన్నిగంటలు నీరిస్తారని ప్రశ్నించారు. రోజుకోసారి మాత్రమే ఇస్తామని వారు కలెక్టర్‌కు వివరించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు 24 గంటలు నీరివ్వలేరా అంటూ ప్రశ్నించారు. కొన్ని లెక్కలు అడుగగా వారు నీళ్లు నమిలారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ లెక్కలు చెప్పలేకపోతున్నారు.. మీరేం ఇంజనీర్లంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్ఓను ఆత్మకూరులోనే ఉండి దోమలు, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మినరల్ వాటర్ సీసా వెనకబాటుతనానికి గుర్తు కలెక్టర్ మున్సిపల్ కార్యాలయానికి రావడంతోనే సిబ్బంది మినరల్ వాట ర్ సీసా తెచ్చి టేబుల్‌పై పెట్టారు. దాని ని చూడటంతోనే ఆయన స్పందిస్తూ ప్రజలకు సరఫరా చేసే నీరు శుద్ధి చేయరా అంటూ ప్రశ్నించారు. మినరల్ వాటర్ సీసా వెనుకబాటు తనానికి గుర్తు అని సుతిమెత్తగా మందలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కోదండరామిరెడ్డి, తహశీల్దార్ బీకే వెంకటేశులు, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.