రాత్రయితే అన్నం రంగు మారుతోంది!
– వారం రోజులుగా కోట కందుకూరులో వింత
– ఓ ఇంట్లో చీకటి పడితే ఎరుపు రంగులోకి మారుతున్న అన్నం
– భయాందోళనలో కుటుంబీకులు
ఆళ్లగడ్డ:
ఎన్నెన్నో అనుమానాలు.. ఏయేవో భయాలు.. కోట కందుకూరులో ఓ కుటుంబం వారం రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. గ్రామానికి చెందిన గాలిమిషన్ ఉషేన్బాషా, ఇమాంబి దంపతులు వ్యవసాయ కూలీలు. వారం రోజుల క్రితం వీరి ఇంట్లో అన్నం వండి కొంత సద్ది వేసుకుని మిగిలిన అన్నం కుమారుడు పాఠశాలకు వెళ్లి వచ్చిన తరువాత తినేందుకు పెట్టి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుమారుడు అన్నం తిందామని చూడగా కాస్త ఎర్రగా కనిపించింది. దీంతో తినలేక అన్నాన్ని పడేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. మరుసటి రోజు రాత్రి అన్నం వండి భోజనం చేసిన తరువాత మిగిలిన అన్నం ఉదయం తినవచ్చని తీసి పెట్టారు. ఉదయం లేచి చూసేసరికి అన్నం అంతా ఎర్రగా రక్తం పులిమినట్లు కనిపించడంతో ఆందోళన చెందారు. బియ్యమో, నీళ్లలోనో తేడా వచ్చి ఉంటుందని అన్నం గేదెలకు వేశారు. రంగు మారిన అన్నాన్ని గేదెలు కూడా తినలేదు. మరుసటి రోజు కూడా కొద్దిగా మిగిలిన అన్నం కూడా తెల్లవారే సరికి ఎర్రగా మారింది.
పక్కింటి అన్నం ఈ ఇంట్లో పెట్టినా అంతే:
మరుసటి రోజు రాత్రి ఉషేన్బాషా ఇంట్లో వండిన అన్నం పక్కింట్లో పెట్టి తెల్లారిని చూస్తే ఎటువంటి రంగు మారలేదు. వేరేవారి ఇంట్లో వండిన అన్నం ఉషేన్బాషా ఇంట్లో ఉంచగా ఆ అన్నం కూడా ఎర్రగా మారింది. ఈ విషయం గ్రామంలో దావానంలా వ్యాపించడంతో గ్రామంలోని ప్రజలు ఈ ఇంటిని, అన్నాన్ని పరిశీలించేందుకు బారులు తీరుతున్నారు. ఇదేదో స్వామి మాయ అని కొందరు.. దెయ్యం తిరుగుతోందని కొందరు చెబుతున్నారు. మరి కొందరు ఏదో ఉపద్రవానికి సూచకమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భయంగా ఉంది: ఇమాంబి
గురువారం నుంచి వండిన అన్నం రాత్రి అయ్యేసరికి కొంచెంకొంచెంగా ఎర్రగా మారుతూ తెల్లవారే సరికి పూర్తిగా రక్తం కలిపినట్లు అవుతోంది. ఎండపొద్దున మా పిల్లాడు ఇంటికి రావడంతో వాడి వెంట దెయ్యం వచ్చి ఇంట్లో ఉందని దీంతో ఇలా జరుగుతుందని కొందరు చెబుతున్నారు. రేవనూరు ఉషేనయ్య స్వామికి ముక్కుబడి చెల్లించనందుకే ఇలా జరుగుతుంది వెంటనే వెల్లి ముక్కుబడి చెల్లించాలని మా అత్త చెబుతోంది. ఇంట్లో ఉండాలంటే భయంభయంగా ఉంది. అందుకే చీకటి పడేసరికి బయటనే ఉంటున్నాం.