రూ.10వేల కోట్లతో స్కైవేలు
సాఫీ ప్రయాణ ఏర్పాట్లకు రూ.7 వేల కోట్లు
దశల వారీగా పూర్తి
సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం.. మార్గమధ్యలో రెడ్సిగ్నళ్లు లేకుండా ఒకచోటు నుంచి మరో చోటుకు సాఫీ ప్రయాణానికి తలపెట్టిన స్కై వేల కోసం ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనుంది. సుమారు 100 కి.మీ. మేర స్కైవేలు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా. వీటితో పాటు ప్రధాన మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ వేలు, సమగ్ర రహదారుల అభివృద్ధికి మరో రూ.7 వేల కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. మొత్తంగారూ.17వేల కోట్లు వ్యయం కాగలదని అంచనా. నగరంలోని వివిధ మార్గాల్లో స్కైవేలు.. కొన్ని ప్రాంతాల్లో మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు (ఫ్లై ఓవర్లు), ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు, స్పైరల్ మార్గాలు, ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్లకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో... స్కైవేలకు రూ.10 వేల కోట్లు, నగరంలో తీవ్ర రద్దీ ఉండే సుమారు 600 కి.మీ. రహదారి అభివృద్ధి పనులు, 50 జంక్షన్లలో రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్లు/ఆర్ఓబీలకు మరో రూ.7 వేల కోట్లు అవసరమవుతాయని లెక్క తేల్చారు.
కన్సల్లెంట్ల నుంచి నివేదికలు అందాక అవకాశాన్ని బట్టి తొలుత కొన్ని మార్గాల్లో ఈ పనులు ప్రారంభించనున్నారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల మేరకు రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ శనివారం విలేకరులకు చెప్పారు. ఈ మార్గాల్లో సెంట్రల్ డివైడర్లు, డక్టింగ్, గ్రీనరీ, వరద కాలువలతో పాటు అవసరమైన ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. ఈ రహదారులను నాలుగు లేన్లతో ఏర్పాటు చేస్తారు. ప్రణాళికలు తుదిరూపు సంతరించుకునేందుకు మరో 15 రోజులు పడుతుందన్నారు. పనులు చేపట్టేందుకు సుమారు నెల రోజులు పడుతుందన్నారు. దశల వారీగా వీటిని చేపడతారు. తొలిదశలో ఎంపిక చేసిన 60 మార్గాల్లోని 300 కి.మీ. రహదారులు అభివృద్ధి చేస్తారు.
ఎక్కడెక్కడంటే...
నగరంలోని హరిహరకళాభవన్ -ఉప్పల్, మాసబ్‌ట్యాంక్ -హరిహర కళాభవన్, నాగార్జున సర్కిల్-మాదాపూర్, తార్నాక -ఈసీఐఎల్, చార్మినార్- బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల్లో స్కైవేలు నిర్మిస్తారు. ఎల్బీనగర్, ఉప్పల్, బంజారాహిల్స్ పార్క్, ఖైరతాబాద్, సచివాలయం, నెక్లెస్ రోడ్డు చౌరస్తా, అబిడ్స్, చాదర్‌ఘాట్, కోఠి, ఒవైసీ హాస్పిటల్, తిరుమలగిరి జంక్షన్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సంగీత్, ప్యారడైజ్ తదితర జంక్షన్ల వద్ద మల్టీ లెవల్ గ్రేడ్ సపరేటర్స్ ఏర్పాటు చేసే యోచన లో అధికారులు ఉన్నారు.