అనుష్క సినిమాతో ఆ థియేటర్ మూత!
దేశ రాజధాని నగరంలోని ప్రఖ్యాత రీగల్ సినిమా థియేటర్ ఈ నెలాఖరుకు మూతపడిపోతోంది. చిట్టచివరిసారిగా ఈ థియేటర్లో ప్రదర్శిస్తున్న సినిమా.. అనుష్కాశర్మ దెయ్యంగా నటిస్తున్న ఫిల్లౌరీ. ఈ థియేటర్ యజమానులు స్ట్రక్చరల్ సెక్యూరిటీ సర్టిఫికెట్ పొందలేకపోవడంతో దీన్ని మూసేస్తున్నారు. 84 ఏళ్ల క్రితం ఢిల్లీ నడిబొడ్డున కనాట్ప్లేస్ ప్రాంతంలో ఈ థియేటర్ కట్టారు. దీన్ని మూసేస్తున్నట్లు థియేటర్ యజమానులు బయట అతికించిన ఒక నోటీసులో తెలిపారు. ఈ థియేటర్ను మల్టీప్లెక్సుగా మార్చి మళ్లీ తెరవాలన్నది యజమానుల ఉద్దేశం.
అయితే.. కనాట్ప్లేస్ ప్రాంతంలో ఉన్న పాత భవనాలన్నింటికీ న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) స్ట్రక్చరల్ సెక్యూరిటీ సర్టిఫికెట్ సమర్పించాలంటూ నోటీసులు జారీ చేయడంతో అనుకున్నదాని కంటే ముందుగానే ఈ థియేటర్ మూతపడుతోంది. ఈ ప్రాంతంలో గత నెలలో రెండు భవనాల పైకప్పులు కూలిపోవడంతో ఎన్డీఎంసీ అన్ని పాత భవనాలకూ నోటీసులు ఇచ్చింది. తమ భవనంలో కూడా అలాంటి విషాదం ఏదీ జరగకూడదన్న ఉద్దేశంతోనే థియేటర్ను మూసేయాలని నిర్ణయించినట్లు యజమానులు చెప్పారు. ఎన్డీఎంసీ నుంచి అనుమతులు వచ్చిన తర్వాత థియేటర్ను మల్టీప్లెక్సుగా మారుస్తామని తెలిపారు.