ఐసీడీఎస్ అధికారులపై విచారణ
ప్రొద్దుటూరు: ఐసీడీఎస్ ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు అధికారిణిపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి మంగళవారం కర్నూలు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శారదాదేవి అంగన్వాడీలను విచారణ చేశారు. ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్తలను హాజరు పరిచారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసిన ప్రశ్నావళి పత్రాన్ని ఇచ్చి సంతకాలు చేసి నింపాలని కోరారు. ఇందులో ‘సీడీపీఓ రాజేశ్వరిదేవి, సూపర్వైజర్ సావిత్రి ప్రతి విషయానికి ఇబ్బంది పెట్టి, భయపెట్టి, డబ్బు ఇవ్వకపోతే మీపై అధికారులకు రిపోర్టు చేస్తామని మిమ్మల్ని బెదిరిస్తున్నారన్నది వాస్తవమా కాదా?, సీనియర్ అసిస్టెంట్ బాషా పనితీరు సరిగా లేదని ఆరోపణలు చేయడం జరిగింది. వివరాలు తెలపగలరు?, ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి అంగన్వాడీ కార్యకర్త రూ.1000 అందించాలని సీడీపీఓతోపాటు సూపర్వైజర్లు మిమ్మల్ని ఆదేశించారా లేదా?, ఆరోపణ నిజమైనచో మీరు ఎంత మొత్తం, ఎవరికి చెల్లించారో తెలపగలరు?, సీడీపీఓ ట్రైనింగ్ పేరిట మీతో సంతకాలు తీసుకుని మీకు డబ్బు చెల్లించలేదన్న ఆరోపణ నిజమా కాదా? నిజమైనచో ఆ ట్రైనింగ్ వివరాలు, తేదీలతోపాటు హాజరయ్యారో లేదో తెలపగలరు?, ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌ను ఏర్పాటు చేశామని ప్రతి నెల రూ.6 వేలు మీ వద్ద నుంచి వసూలు చేయడం జరిగిందా లేదా? మీరు ఆ సొమ్ము ఎవరికి ఇచ్చారో తెలపగలరు?, అర్బన్ ప్రాజెక్టులోని మురికి వాడల్లో ఉన్న ఎస్సీ అంగన్వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ సావిత్రి నోటికి వచ్చినట్లు కులం పేరుతో దూషించడం జరిగిందన్న ఆరోపణలపై మీరు వివరణ ఇవ్వడంతోపాటు ఎవరిని దూషించారో తెలపగలరు?’ తదితర ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు రాసిన అనంతరం పత్రాలను తీసుకున్నారు.
ఉద్దేశ పూర్వకంగానే ఫిర్యాదు సమావేశం అనంతరం కొంత మంది అంగన్వాడీలు ఆర్డీడీని కలిశారు. సీడీపీఓ తాము చెప్పినట్లు వినలేదనే కారణంతో యూనియన్ నేతలు కొంత మంది ఉద్దేశ పూర్వకంగానే ఈ విధంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదు చేసిన వారిని ఆమె పిలిపించారు. యూనియన్ నేతల ఒత్తిడి వల్లే తాము ఫిర్యాదు చేశామని వారు కూడా ఆర్డీడీకి వివరించారు. అనంతరం యూని యన్ నేతలను పిలిపించి మాట్లాడారు. తర్వాత లెటర్ హెడ్‌పై ఫిర్యాదు చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డిని కలిశారు. అలాగే అధికారులను విచారణ చేశారు. ఆర్డీడీ వెంట ఆర్డీడీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరమ్మ, సూపరింటెండెంట్ పద్మిని ఉన్నారు.