ఇంకాస్త టైముంది
♦ హెల్మెట్‌పై మొదటి రోజు స్పందన శూన్యం
♦ ఈనెల 4 తరువాత వాహనంతోపాటు హెల్మెట్ కొనాల్సిందే
♦ అంతకుముందు కొన్న వాహనాలకు సడలింపు
సాక్షి, సిటీబ్యూరో : ద్విచక్రవాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధన మొదటి రోజే తుస్సుమంది. నగరంలోనే ఏ ఆర్టీఏ కార్యాలయంలోనూ ఈ నిబంధన అమలు కాలేదు. హెల్మెట్ లేకపోయినప్పటికీ రవాణా అధికారులు వాహనాలను రిజిస్ట్రేషన్లు చేశారు. నిబంధన అమల్లోకి వచ్చిన రోజు కంటే ముందే వాహనాలు కొనుగోలు చేసి ఉండడంతో అధికారులు సడలింపునిచ్చారు. మరోవైపు హెల్మెట్‌పై వాహనదారుల్లో మొదట విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని, ఆ తరువాత క్రమంగా తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు.
నిబంధన అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 4 నుంచి కొనుగోలు చేసే వాహనాలకు తప్పనిసరిగా వాహనాల ఇన్వాయిస్తో పాటు హెల్మెట్ బిల్లు కూడా ఉండాల్సిందేనన్నారు. గ్రేటర్‌లోని ఖైరతాబాద్, మెహదీపట్నం, బహదూర్‌పురా, సికింద్రాబాద్, మలక్‌పేట్, ఉప్పల్, అత్తాపూర్,మేడ్చెల్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి,తదితర కార్యాలయాల్లో ప్రతి రోజూ వెయ్యికి పైగా ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతాయి. కొనుగోలు చేసిన తరువాత నెల లోపు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకొనే వెసులుబాటు ఉండడంతో వాహనదారులు కొనుగోలు చేసిన రోజునే రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ వద్దకు వెళ్లరు.
చాలా మంది వాహనాలు కొనుగోలు చేసిన 15 రోజుల నుంచి 30 రోజుల మధ్య మంచి ముహూర్తం చూసుకొని రిజిస్ట్రేషన్ కోసం వస్తారు. అలా హెల్మెట్ నిబంధన అమల్లోకి వచ్చిన తేదీ కంటే ముందే కొనుగోలు చేసిన వాహనాలు కావడంతో ఆర్టీఏ అధికారులు హెల్మెట్లు లేకపోయినా రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు.
విస్తృత ప్రచారం
మరోవైపు హెల్మెట్ అమలుపై మొదటి దశలో విస్తృతమైన ప్రచారం చేపట్టేందుకు హైదరాబాద్ ఆర్టీఏ సన్నాహాలు చేపట్టింది. నగరంలోని అన్ని షోరూమ్‌లలో బ్యానర్లు, కరపత్రాల ద్వారా అవగాహన కల్పించనున్నట్లు జేటీసీ రఘునాథ్ చెప్పారు. నగరంలో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.