Registrations income
-
ఏపీలో పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
సాక్షి, అమరావతి: ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా వచ్చే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గతం కంటే ఈ ఏడాది 30 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయానికి రూ.4,210 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు రూ.5,495 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు నెలల ఆదాయం ఇంకా పెరిగే అవకాశముంది. డిసెంబర్లో అత్యధికంగా రూ.685 కోట్ల ఆదాయం వచ్చింది. జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో రూ.600 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం లభించింది. కరోనా కారణంగా మేలో రూ.211 కోట్ల ఆదాయం వచ్చింది. విశాఖలో అత్యధికం.. శ్రీకాకుళంలో అత్యల్పం ► విశాఖ జిల్లా నుంచి అత్యధికంగా రూ.825 కోట్ల ఆదాయం వచ్చింది. ► ఆ తర్వాత కృష్ణా జిల్లాలో రూ.687.66 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.687.65 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.602 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. ► అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో రూ.139 కోట్ల ఆదాయం వచ్చింది. ► విజయనగరం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రూ.227 కోట్లు, రూ.480 కోట్లు, రూ.289 కోట్లు, రూ.314 కోట్ల ఆదాయం లభించింది. ► రాయలసీమలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో రూ.367.56 కోట్ల ఆదాయం రాగా, చిత్తూరులో రూ.333 కోట్లు, వైఎస్సార్ కడపలో రూ.236 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.296.99 కోట్ల ఆదాయం వచ్చింది. డాక్యుమెంట్ల సంఖ్యలో గుంటూరు టాప్ ఇక గతేడాది 17,20,402 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 17,46,682 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. రాబోయే రెండు నెలల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1.95 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కృష్ణాలో 1.71 లక్షలు, తూర్పు గోదావరిలో 1.80 లక్షలు, కర్నూలులో 1.59 లక్షలు, పశ్చిమ గోదావరిలో 1.51 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. అతి తక్కువగా విజయనగరంలో 64 వేలు, శ్రీకాకుళం జిల్లాలో 67 వేల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. గతం కంటే మెరుగైన ఆదాయం లభించింది. ఆదాయానికి గండిపడుతున్న కొన్ని అంశాల్లో కొద్దిపాటి మార్పులు చేయడంద్వారా ఫలితాలు సాధించామని.. వినియోగదారులకు నాణ్యమైన సేవలు సత్వరం అందించేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. -
సగానికి చేరువగా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 22 నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు మళ్లీ ఈ నెల 6 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ 20 రోజుల్లో ఆదాయం రూ.143 కోట్లు దాటింది. సాధారణ సమయాల్లో రోజుకు సగటున 20–25 కోట్ల వరకు ఆదాయం రానుండగా, లాక్డౌన్ నిబంధనల సడలింపు తర్వాత ప్రస్తుతానికి అది రూ.7 కోట్ల వరకు వచ్చింది. అయితే, ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు పెద్దగా లావాదేవీలు జరగకపోయినా ఆ తర్వాత ఊపందుకుని 14వ తేదీ నాటికి రోజుకు రూ.10 కోట్ల వరకు ఆదాయం వచ్చే స్థితికి చేరింది. ఇప్పుడు అది రూ.15 కోట్ల వరకు వచ్చిందని, జూన్ నెలలో దాదాపు సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెపుతున్నారు. మరికొంత సమయం.. వాస్తవానికి, గత మార్చి 22 వరకు రిజిస్ట్రేషన్ల శాఖలో కాసుల పంట పండింది. గతంలో ఎన్నడూ లేనట్లు 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆ శాఖ ఆదాయం రూ.6,200 కోట్లకు పెరిగింది. కానీ, ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఒక్కసారిగా ఊపందుకోలేదని, ఇందుకు పలు కారణాలున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ప్రజల వద్ద నగదు లభ్యత, చేతులు మారడం తక్కువగా ఉంటుందని, దీంతో పాటు రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో భాగస్వాములు కావాల్సిన వారు ఇతర రాష్ట్రాల్లో ఉంటే వచ్చేందుకు అవకాశం లేకపోవడం కూడా కారణమవుతోందని చెపుతున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇతర పెద్ద ప్రాజెక్టులకు బ్యాంకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియకు కూడా ప్రతికూలత ఉందని అంటున్నారు. ఇక, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఖచ్చితంగా భౌతికదూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కో లావాదేవీ పూర్తి చేసేందుకు సాధారణ పరిస్థితుల కంటే ఎక్కువ సమయం పడుతున్న కారణంగా కూడా డిమాండ్ మేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లావాదేవీలు పూర్తి కావడం లేదు. మొత్తంమీద భారీ స్థాయిలో కాకపోయినా ఇప్పటికే రిజిస్ట్రేషన్ల లావాదేవీలు సగానికి చేరుకోవడం ఆశాజనకమేనని, లాక్డౌన్ నిబంధనలు మరికొంత సడలిస్తే మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2,500కు పైగా లావాదేవీలు.. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 5,500–6,000 వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. లాక్డౌన్ తర్వాత ఆ సగటు 2,500 వరకు వచ్చింది. గత 20 రోజుల్లో 53,836 లావాదేవీలు జరిగాయి. అయితే, గత నాలుగైదు రోజులుగా 3వేలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే సరళి కొనసాగితే ఈనెలాఖరుకు రూ.200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తంమీద సాధారణ సమయాల్లో నెలకు రూ.500 కోట్లకు పైగా వచ్చే రిజిస్ట్రేషన్ల ఆదాయం మే నెలలో సగానికి దగ్గరగా రావడం గమనార్హం. -
రిజిస్ట్రేషన్ల ఆదాయం అప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం(2017–18)లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది. నిజానికి ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాబడిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెనుకబడింది. అయితే ద్వితీయ త్రైమాసికం చివరికొచ్చేసరికి లక్ష్యాన్ని మించి పదిశాతం అధిక రాబడిని సాధించింది. మొత్తంమీద ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ.1,950 కోట్ల ఆదాయం సాధించాలనేది లక్ష్యం కాగా రూ.2,155.77 కోట్ల రాబడి వచ్చింది. లక్ష్యంతో పోల్చితే రాబడి 110.55 శాతం కావడం విశేషం. రూ.326.68 కోట్లతో రాబడిలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఈ జిల్లా నుంచి రూ.308.08 కోట్ల ఆదాయ లక్ష్యం కాగా రూ.326.68 కోట్లు(106.04 శాతం) సాధించింది. రూ.55.54 కోట్ల రాబడితో శ్రీకాకుళం జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. అయితే రూ.45.11 కోట్ల ఆదాయ లక్ష్యంతో పోల్చి చూస్తే మాత్రం ఇక్కడ 23 శాతం అధిక రాబడి రావడం గమనార్హం. భారీగా రిజిస్ట్రేషన్లు గతంలో రాష్ట్రంలో నెలకు సగటున లక్ష రిజిస్ట్రేషన్లు జరిగేవి కాగా.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో మాత్రం 7,48,860 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 99,456 రిజిస్ట్రేషన్లతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 28వ తేదీ వరకు రాష్ట్రంలో 1,00,493 రిజిస్ట్రేషన్లు జరగ్గా, ఇందులో 15,545 రిజిస్ట్రేషన్లతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, 6,238 రిజిస్ట్రేషన్లతో అనంతపురం జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా తగ్గింది. 2014-15 ఆర్థిక సంవత్సర ఆరంభంలోని ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యంలో సగానికి మాత్రమే ఆదాయం లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 4,766.79 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్లో రూ. 333.61 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా రూ.181.5 కోట్లు వచ్చింది. మే నెలలో రూ.357.44 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా రూ.183.73 కోట్లు మాత్రమే లభించింది. జిల్లాల వారీగా లక్ష్యాలను పరిశీలిస్తే ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్లగొండల్లో ఆదాయం భారీగా పడిపోయింది. ఖమ్మం జిల్లాలో రూ.9.17 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం రూ. 4.36 కోట్లను మాత్రమే ఆర్జించింది. అలాగే ఆదిలాబాద్లో 58 శాతం, రంగారెడ్డి తూర్పులో 58 శాతం, నల్లగొండలో 52 శాతం తక్కువగా ఆదాయం నమోదైంది. రాష్ట్ర విభజనకు ముందుగా అమ్మకాలు, కొనుగోళ్లు స్తంభించిపోయాయని, అందుకే ఆదాయం తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. జూన్, జూలై నెలలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఈ రెండు నెలల్లోకూడా పరిస్థితి మెరుగుపడలేదని తెలుస్తోంది.