దస్తావేజు లేఖరులకు లైసెన్స్!
అక్రమాల నియంత్రణ కోసం రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కుంభకోణాలకు నిలయంగా మారిన రిజిస్ట్రేషన్లు–స్టాంపుల శాఖను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్లలో కీలకమైన దస్తావేజులను రాసే బాధ్యతలను అర్హత కలిగిన వ్యక్తులకు అప్పగించాలని... దస్తావేజు లేఖరు ల (డాక్యుమెంట్ రైటర్)కు లైసెన్సులు ఇవ్వడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది.
వాస్తవానికి 2000 సంవత్సరానికి ముందు రిజిస్ట్రేషన్ల శాఖలో లైసెన్స్డ్ దస్తావేజుల లేఖరులు ఉండేవారు. ఆ తర్వాత ‘కార్డ్ (కంప్యూటరైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’విధానాన్ని ప్రవేశపెట్టడం తో అప్పటి ప్రభుత్వం దస్తావేజు లేఖరులను తొలగించింది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ఆ తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖలో దళారులకు మంచి అవకాశంగా మారింది. దళారులు డబ్బు ఆశ చూపుతుండడంతో కొందరు సబ్రిజిస్ట్రార్లు భారీ స్థాయిలో అక్రమాలకు వెనుకాడటంలేదు.
మూడు వేల మందికి అవకాశం...
అర్హత కలిగిన వారికి దస్తావేజు లేఖరులుగా లైసెన్స్ ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో సుమారు 3వేల మంది నిరుద్యోగులకు అవకాశం లభించవచ్చని అంచనా. రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా... ఒక్కొక్క కార్యాలయానికి కనీసం 15 మంది చొప్పున నియమించాల ని ప్రభుత్వం భావిస్తోంది.
దీనికి కనీస అర్హత డిగ్రీ కాగా.. న్యాయశాస్త్రం (లా) అభ్యసించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయానికి వచ్చింది. దస్తావేజు రాసినందుకు రూ.10లక్షలలోపు విలువైన డాక్యుమెం ట్‌కు రూ.1,000, రూ.50 లక్షలలోపు రూ.2,000 చొప్పున లేఖరులకు ఫీజు చెల్లించే వీలు కల్పిస్తున్నా రు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్లలో జరిగే తప్పిదాలకు వారిని కూడా బాధ్యులుగా పరిగణించాలని భావిస్తున్నారు.
సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధం
రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల 72 మంది సబ్ రిజి స్ట్రార్లను బదిలీ చేసిన ప్రభుత్వం... తాజాగా ఒకేచోట దీర్ఘకాలంగా పనిచేస్తున్న జూనియర్, సీనియర్ అసి స్టెంట్లను, అటెండర్లను బదిలీ చేయాలని నిర్ణయిం చింది. తొలిదశలో క్షేత్రస్థాయి సిబ్బందిని బదిలీ చేసి... ఆపై జిల్లా రిజిస్ట్రార్ల బదిలీలను కూడా చేపట్టా లని గురువారం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 196 మంది సీనియర్ అసిస్టెంట్లు, 380 మంది జూనియర్ అసిస్టెంట్లు, 190 మంది అటెండర్లు రెగ్యులర్ ఉద్యోగులుగా ఉండగా... కాంట్రాక్టు పద్ధతిన మరో వంద మంది కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు.