regular employees
-
సమాన పనికి సమాన వేతనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో దినసరి భత్యంపై పనిచేసే వాచ్మెన్, కామాటి, వంట మనుషులకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో (క్లాస్ ఫోర్) సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు కనీస వేతన స్కేల్ ఇవ్వాలని.. దినసరి భత్యంతో పనిచేసే ఉద్యోగుల వ్యాజ్యానికి అనుకూలంగా గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. వారికి కనీస వేతన పేస్కేల్ అమలు చేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా దినసరి వేతన ఉద్యోగులకు జీతాలివ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని, సింగిల్ జడ్జి వద్దే రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 29న హైకోర్టు సింగిల్ జడ్జి వద్దకు దినసరి వేతన ఉద్యోగి ఎం.కృష్ణ సహా 20 మంది దాఖలు చేసిన వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. నాలుగో తరగతి ఉద్యోగుల విధులతో సమానంగా పనిచేసే దినసరి వేతన కార్మికులకు కనీస వేతన స్కేల్ అమలు చేయాలని సుప్రీంకోర్టు 2016లో ఇచ్చిన తీర్పును పిటిషనర్లు సింగిల్ జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్లకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సింగిల్ జడ్జి జారీ చేసిన ఆ ఉత్తర్వుల్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. -
టీటీడీలో సమ్మె సైరన్..
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) రెగ్యులర్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. 22 డిమాండ్లతో గురువారం టీటీడీ పరిపాలన భవనం ముందు ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణతో తమ ఆందోళనకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. రెగ్యులర్ ఉద్యోగులందరికీ నివాస స్థలాలు, ఖాళీ పోస్టులు భర్తీ, సమాన పనికి సమాన వేతనం, మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందించటం, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరో వారం రోజుల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఆగస్టు 15లోపు సమస్యలను పరిస్కరించకపోతే... సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. టీటీడీలో రెగ్యులర్ ఉద్యోగులు 8,500 మంది ఉండగా.. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు 14,500 మంది ఉన్నారు. పారిశుధ్య విభాగం నుంచి ఇతర విభాగాలన్నింటిలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులే అధికం. అయితే తాము కాంట్రాక్టర్ల చేతిలో దోపిడీకి గురవుతున్నామని వారు చెబుతున్నారు. చాలీ చాలని వేతనాలతో బతుకులీడుస్తున్నామని, సగటున ఒక్కో కార్మికునికి రూ. 7 వేల వేతనం కూడా రావడం లేదని, వచ్చే జీతంతో ఇంటి అద్దెలు చెల్లించలేక, పిల్లలకు చదువులు చెప్పించలేక, కుటుంబ పోషణ భారమై దుర్భర జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టరు మారినప్పుడల్లా ఉద్యోగులను భయం వెంటాడుతోంది. ఎవర్ని పనిలో నుంచి తీసేస్తారో తెలియకుండా ఉంది. టీటీడీలో అమలు కాని జీవో రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచుతూ జీవో నంబర్ 151 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ జీఓ విడుదల చేసి రెండేళ్లవుతున్నా టీటీడీలో మాత్రం అది అమలు కావడం లేదు. జీవో అమలైతే కింది స్థాయిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కూడా నెలకు రూ. 12 వేలు వేతనం అందుతుంది. జీవో అమలు చేయాలని కార్మికులు ఆందోళన చేస్తున్నా టీటీడీ పట్టించుకోవడం లేదు. సమాన పనికి సమాన వేతనంపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అమలు చేయడంలేదని కార్మికులు చెబుతున్నారు. ఆ ఆదేశాల ప్రకారం రెగ్యులర్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు అనే తేడా ఉండకూడదు. ఒకే విధమైన పనిచేసే వారికి ఒకే రకమైన వేతనం ఇవ్వాలి. దీన్ని అమలు చేస్తే జీవో 151 కంటే మెరుగైన వేతనం లభిస్తుందని కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భోజనం, వైద్యం అందదు.. టీటీడీ నిత్యం లక్ష మందికి అన్నదానం చేస్తోంది. అయితే సంస్థలో పనిచేసే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు మాత్రం సరైన భోజనం పెట్టటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్లలో వీరికి ప్రవేశం లేదు. ప్రముఖ ధార్మిక సంస్థగా పేరుగాంచిన టీటీడీలో కనీస కార్మిక చట్టాలు కూడా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యం పాలైతే టీటీడీ ఆసుపత్రుల్లో తమకు చికిత్స చేయరని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆగస్టు 15, జనవరి 26న ఇచ్చే ప్రశంసాపత్రాలు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. కాంట్రాక్టర్ ఎందుకు? టీటీడీకి తమకు మధ్య కాంట్రాక్టర్ ఎందుకని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఇచ్చే వేతనాలను కాంట్రాక్టర్ స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ లేకుండా ఉంటే టీటీడీ ఇచ్చే వేతనం పూర్తిగా చేతికి అందుతుందని చెబుతున్నారు. లేబర్ కాంట్రాక్టర్ వ్యవస్థను పూర్తిగా రద్దుచేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ప్రారంభించిన సంతకాల సేకరణతో టీటీడీ పెద్దలు స్పందించకపోతే అంతా కలిసి సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. -
జీహెచ్ఎంసీ ఉద్యోగులకూ హెల్త్‌కార్డులు
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీహెచ్ఎంసీలోని రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్‌కార్డులు జారీ చేయనున్నారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్‌కు ఈ విషయాన్ని తెలిపారు. హెల్త్‌కార్డులతోపాటు అర్హులైన వారికి పదోన్నతులు, బదిలీలు కూడా జరిపేందుకు కమిషనర్ హామీ ఇచ్చారని గోపాల్ విలేకరులతో అన్నారు. త్వరలోనే పీఆర్సీ అమలు కూడా జరుగనున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ సర్కారు ఉద్యోగుల పక్షపాతిగా వ్యవహరిస్తోందని అన్నారు. హెల్త్‌కార్డులతో నగదు లేకుండానే ఏ ఆస్పత్రిలోనైనా వైద్యచికిత్సలు చేయించుకోవచ్చునన్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం
అడ్డాకుల, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణలోని కాం ట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్వీఎం ద్వారా జిల్లాలో పని చేస్తున్న సీఆర్పీలు, ఐఈఆర్టీ, సీఆర్టీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, డీఎల్ఎంటీలు, మెసేంజర్లు, తాత్కాలిక శిక్షకుల సర్వసభ్య సమావేశం మండల పరిధిలోని మూసాపేట వద్ద వీహాన్ స్కూల్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జితేందర్‌రెడ్డితో పాటు టీ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయిస్తామని కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. సీమాంధ్రలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రారని, తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందన్నారు. పరిశ్రమలు ఎక్కువగా పాల మూరు జిల్లాకు రానున్నాయని, వాటితో ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పారు. ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ ప్రాం తం పూర్తి అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న టెట్‌ను రద్దు చేయాలని టీ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షడు హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్, డిగ్రీ మార్కుల ఆధారంగా టీటీసీ, బీఈడీ సీట్లు కేటాయిస్తారని, ఇక్కడ మాత్రం అన్ని ప్రవేశాలకు పరీక్షలను నిర్వహిం చడం సోచనీయమన్నారు. టెట్‌ను రద్దు చేస్తామనే ప్రకటన టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు కృష్ణారెడ్డి, మొగులయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు