చక్కని బొమ్మల చుక్కాని
ప్రపంచంలోని తెలుగువారు ఏమూలన ఉన్నా ఇది బాపు గారి బొమ్మ అనేలా గర్వంగా చెప్పుకొనేలా సంతకం అక్కరలేని విలక్షణమైన శైలి కలిగిన చిత్రకారులు మన బాపుగారు. కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా, దర్శకుడిగా పదహారణాల తెలుగుదనానికి రూపునిచ్చిన బాపు 1933, డిసెంబరు 15న వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని కంతేరు గ్రామం ఆయన స్వస్థలం. అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. జాతీయోద్యమ రోజుల్లో జన్మించిన వారి అబ్బాయిని, మహాత్ముడి స్ఫూర్తితో తల్లి తండ్రులు ‘బాపు’ అని ముద్దుగా పిలుచుకొనేవారు. బాపు, రమణ రెండు పదాలు తెలుగువారికి విడదీయలేని జంట పదాలు. 1945లో చిన్నారుల కొరకు ముద్రించే బాల పత్రికలో ముళ్లపూడి రమణ తొలి రచన ‘అమ్మ మాట వినకపోతే’, బాపు తొలి చిత్రం ‘వెన్న చిలుకుతున్న బాలిక’ రెండూ అచ్చయ్యాయి.
అలా మొదలైన వారి రాత–గీత, బంధం–స్నేహం, దేహాలే వేరు ప్రాణం ఒక్కటే అనేలా దశాబ్దాలపాటు కొనసాగింది. 1945 నుండి బాపు చిత్రాలను, వ్యంగ్యచిత్రాలను, పుస్తకాల, పత్రికల ముఖచిత్రాలను, కథలకు బొమ్మలను లెక్కకుమించి వేశారు. ఆయన సుమారు లక్షా యాభై వేలకు పైగా చిత్రాలు వేయగా అందులో నేడు 75 వేల బొమ్మలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ఆయన చేతిరాతే ఒక ఫాంట్గా రూపుదిద్దుకోవడం విశేషం.
ఇతిహాసాల నుండి రోజు వారి జీవితాల వరకూ ఆయన బొమ్మల్లో అనువణువునా ప్రతిఫలించే తెలుగు సంస్కృతులు, తెలుగు సంప్రదాయాలు, తెలుగు జీవితాలు, తెలుగు సౌందర్యాలే వారికి తెలుగుపై ఉన్న మమకారానికి నిదర్శనాలు. కాబోయే కోడలు బాపు బొమ్మలా ఉండాలని కోరుకొని అత్తామామలుండరు అనేలా ఆయన బొమ్మలు ప్రతి తెలుగువారింట్లో దర్శనమిస్తూనే ఉంటాయి. తన సినీ రంగప్రవేశం 1967లో సాక్షితో మొదలై 2011లో శ్రీ రామరాజ్యం వరకూ తెలుగు, తమిళం, హిందీ బాషల్లో మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఆయన వెండి తెరపై మరపురాని వైవిధ్యమైన దృశ్య కావ్యాలను సృష్టించారు. అందులో బాపు సృష్ఠించిన అద్భుత దృశ్యకావ్యం సంపూర్ణ రామాయణం, మరో అద్భుత చిత్ర కావ్యం ముత్యాల ముగ్గు. ఆరు నంది అవార్డులు, మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఏపీ ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య జీవిత సాఫల్య పురస్కారంతో పాటు ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా పొందారు. ప్రాణ స్నేహితుడు ముళ్లపూడి వెంకటరమణ 2011లో, ఆ తర్వాత సతీమణి భాగ్యవతి మరణించిన దిగులుతో బాపు 2014, ఆగస్టు 31న చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఆయన మన మధ్య లేకపోయినా యువచిత్రకారులను, ఎందరో కళాప్రియులకు అయన బొమ్మలు ఎప్పటికి గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి.
– రేగుళ్ళ మల్లికార్జునరావు, సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ