పునరావాసానికి చర్యలు ఎట్టకేలకు షురూ..
సాక్షి, జడ్చర్ల : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండంలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న ఉదండాపూర్ గ్రామాన్ని పునర్నిర్మించేందుకు ఎట్టకేలకు అడుగు ముందుకు పడింది. రెవెన్యూ అధికారులు బుధవారం స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఉన్న ఉదండాపూర్‌కు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలోని కావేరమ్మపేట (జడ్చర్ల) శివారులో బండమీదిపల్లి గ్రామ సమీపాన ఉన్న భూమిని ఉదండాపూర్ గ్రామానికి కేటాయించారు. పూర్తి స్థాయిలో ఇక్కడ వారికి ఇళ్లు, మౌళిక సదుపాయాలు కల్పించి నూతన గ్రామాన్ని నిర్మించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
భూమి చదును..
బండమీదిపల్లి శివారులోని సర్వే నంబర్ 407లో గల దాదాపు 90 ఎకరాల ప్రభుత్వ భూమిని చదును చేసే పనులకు స్థానిక తహసీల్దార్ శ్రీనువాస్‌రెడ్డి భూమిపూజ చేసి పనులు మొదలెట్టారు. భూమిలో ఉన్న బండరాళ్లు, చెట్లను తొలగించి పునరావాస నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుకూలంగా చేస్తున్నారు. ఈ భూమిని అనుసరించి మరో వంద ఎకరాలను సైతం ఊరు నిర్మాణానికి కేటాయించనున్నారు. భూమి చదును అనంతరం ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కార్యక్రమంలో ఆర్.ఐ సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జంగయ్య, సుదర్శన్, పాండు పాల్గొన్నారు.
వల్లూరుకు ఎక్కడ?
రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న ఉదండాపూర్ గ్రామానికి సంబంధించి బండమీదిపల్లి శివారులో భూమిని ఖరారు చేయగా మరో గ్రామం వల్లూరు, ఇతర గిరిజన తండాలకు ఎక్కడ భూమిని కెటాయిస్తా రోనని ఆయా గ్రామాల ప్రజలు చర్చింకుకుంటున్నారు. తమకు నక్కలబండ తండా దగ్గర భూమిని కేటాయించాలని ఇదివరకే వారు డిమాండ్ చేశారు. కానీ భూమి లభ్యతను బట్టి అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావస్తున్న తరుణంలో ముంపు గ్రామాల పునరావాస చర్యలను కూడా వేగవంతం చేసే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పలుసార్లు ఆయా గ్రామాల ప్రజలతో చర్చలు జరిపి పనులు సవ్యంగా ముందుకు సాగేలా చేశారు.