Reliance Defence
-
రఫేల్ ఒప్పందం సక్రమమే
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పెద్ద ఊరట. రఫేల్ ఒప్పందంపై కేంద్రం తీరును సమర్థిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగినట్లు తమకు కనిపించడం లేదని స్పష్టం చేసింది. విమానాల కొనుగోలుకు నిబంధనలను అనుసరించి రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానాల (డీపీపీ) ప్రకారమే మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని పేర్కొంది. ఈ ఒప్పందం లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ గత కొన్ని నెలలుగా పదేపదే ఆరోపిస్తుండటం తెలిసిందే. రఫేల్ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ వచ్చిన 36 పిటిషన్లను సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. ‘ప్రభుత్వ నిర్ణయాన్ని సందేహించాల్సినం తగా మాకు ఈ ఒప్పందంలో తప్పులేవీ కనిపించడం లేదు’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం తెలిపింది. ఒకవేళ చిన్నచిన్న పొరపాట్లేమైనా ఈ ఒప్పందంలో జరిగి ఉంటే అవి ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన లేదా క్షుణ్నంగా పరిశీలించాల్సినంత పెద్ద తప్పులేమీ కాదని పేర్కొంది. ఈ తీర్పు అద్భుతమనీ, చాలా మంచి తీర్పనీ, ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినట్లుగా ఉందని కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్, తదితరులు రఫేల్ ఒప్పందంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం తెలిసిందే. ధరలను పోల్చడం మా పని కాదు.. యూపీఏ హయాంలో కొనుగోలుకు ప్రతిపాదించిన యుద్ధ విమానాలు, బీజేపీ ప్రభుత్వం కొంటున్న యుద్ధ విమానాల ధరలను పోల్చి చూడటం తమ పని కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వివరాలను రహస్యంగానే ఉంచాలంది. కేవలం విలేకరుల సమావేశాల్లో కొందరు చేసిన వ్యాఖ్యలు లేదా ఇచ్చిన సలహాల ఆధారంగా ఈ ఒప్పందంపై న్యాయ సమీక్ష చేయలేమనీ, అందునా ఆ వ్యాఖ్యలు లేదా సలహాలను ఇరు దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా ఖండిస్తున్నప్పుడు మళ్లీ వాటిపై న్యాయ సమీక్ష జరపడం కుదరదని ధర్మాసనం తెలిపింది. భారత ప్రభుత్వ బలవంతంతోనే రిలయన్స్‌ను డసో ఏవియేషన్ ఆఫ్సెట్ భాగస్వామిగా ఎంపిక చేసుకుందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ కొన్ని నెలల క్రితం ఫ్రెంచి మీడియాతో చెప్పడం తెలిసిందే. ‘యూపీఏ హయాంలో అనుకున్నట్లుగా 126 యుద్ధ విమానాలనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని మేం బలవంతం చేయలేం. ఈ అంశంలో కోర్టు ప్రభుత్వానికి పై అధికారిగా వ్యవహరిస్తూ ఒప్పందం, విమానాల సేకరణకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలించడం సరికాదు’అని న్యాయమూర్తులు 29 పేజీలో తీర్పులో పేర్కొన్నారు. భారత వాయుసేనకు ఆధునిక విమానాలు కావాలనీ, శత్రుదేశాలు నాల్గో, ఐదో తరం యుద్ధ విమానాలను కూడా కలిగి ఉన్నందున మన వైమానిక దళానికి కూడా ఆధునిక విమానాలు కావాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అలా కాకుంటే మనం విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడం లేదా అసంపూర్తిగా సిద్ధం అవడం కిందకు వస్తుందన్నారు. (రఫెల్‌పై వెనక్కి తగ్గేదిలేదు) రిలయన్స్ ఎంపికలో ప్రభుత్వ పాత్ర లేదు.. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి పిటిషనర్ల ఆరోపణల్లోని ప్రధానంగా మూడు అంశాలపై విచారణ జరిపామని సుప్రీంకోర్టు తెలిపింది. వాటిలో ఒకటి ప్రభుత్వ నిర్ణయం, రెండోది విమానాల ధరలు కాగా ఇక మూడోది భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక ప్రక్రియ అని పేర్కొంది. ఈ మూడు అంశాలను పరిశీలించిన మీదట ఈ సున్నితమైన కేసులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తమకు అనిపించలేదని న్యాయూర్తులు అన్నారు. రఫేల్ విమానాలను ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్ కంపెనీ తయారు చేస్తుండగా భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామిగా రిలయన్స్‌ను ఆ కంపెనీ ఎంపిక చేసుకోవడం తెలిసిందే. మోదీ ప్రభుత్వ ఒత్తిడితోనే విమానాల తయారీలో అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ను కాదని కొత్త సంస్థ రిలయన్స్ డిఫెన్స్‌ను డసో ఏవియేషన్‌ను తమ ఆఫ్సెట్ భాగస్వామిగా ఎంపిక చేసుకుందని ఆరోపణలున్నాయి. అయితే ఇందుక తగ్గ ఆధారాలేవీ లేవనీ, ప్రభుత్వం వాణిజ్యపరంగా ఆశ్రిత పక్షపాతం చూపిందని నిరూపించేలా సాక్ష్యాలేవీ లేవని కోర్టు పేర్కొంది. ఒప్పందం ప్రకారం ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక నిర్ణయం అసలు ప్రభుత్వం చేతుల్లోనే లేదని ధర్మాసనం తెలిపింది. -
రాఫెల్ డీల్ : రాహుల్ ఆరోపణలు తోసిపుచ్చిన దసాల్ట్
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను దసాల్ట్ ఏవియేషన్ సీఈవో ఎరిక్ తపిర్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఆరోపణలను ప్రస్తావించిన ఆయన తాను అసత్యాలు ఏమీ చెప్పలేదని అన్నారు.ఎరిక్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను రాఫెల్ డీల్ గురించి అసత్యాలు వెల్లడించలేదని, తాను ఇచ్చిన స్టేట్మెంట్లు వాస్తవమని, అబద్ధాలు చెప్పే అలవాటు తనకులేదని చెప్పుకొచ్చారు. దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో 1953లో భారత్- ఫ్రాన్స్ మధ్య జరిగిన తొలి ఒప్పందాన్ని గుర్తు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో తమ కంపెనీకి అనుబంధం ఉందని పేర్కొన్నారు. తాము భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని, ఏ పార్టీతో కాదని స్పష్టం చేశారు. భారత వాయుసేనకు, ప్రభుత్వానికి తాము వ్యూహాత్మక ఉత్పత్తులను సరఫరా చేస్తామని, పార్టీలతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఆఫ్సెట్ భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకోవడంపై స్పందించారు. ఈ ఒప్పందం ద్వారా సమకూరే నిధులు నేరుగా రిలయన్స్‌కు వెళ్లబోవని, జాయింట్ వెంచర్‌కు చేరతాయని వెల్లడించారు. తొలివిడతగా దసాల్ట్ ఏవియేషన్ అనిల్ అంబానీ కంపెనీకి రూ 284 కోట్లను చెల్లించిందని ఇటీవల రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో దసాల్ట్ సీఈవో ఈ మేరకు వివరణ ఇచ్చారు. -
రిలయన్స్ జేబులో రూ.30 వేల కోట్లు
ఢిల్లీ: ఇంత అత్యవసరంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ దేశానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని, అందులోనూ దసాల్ట్ ఏవియేషన్ ఫ్యాక్టరీకే ఎందుకు వెళ్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఢిల్లీలో రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ.. రాఫెల్ కాంట్రాక్ట్, దసాల్ట్‌కి ఇవ్వడానికి రిలయన్స్ డిఫెన్స్ సంస్థను భాగస్వామిగా తప్పనిసరిగా చేర్చుకోవాల్సి వచ్చిందని ఆ కంపెనీ డిప్యూటీ సీఈఓ చెప్పారని ఫ్రెంచ్ మీడియాలో వచ్చిన కథనాలను ఉదహరించారు. కేవలం ఈ కాంట్రాక్టుకు 10 రోజుల ముందే అనిల్ అంబానీ, రియలన్స్ డిఫెన్స్ సంస్థను ఏర్పాటు చేశారని వెల్లడించారు. కాంట్రాక్ట్ వారికే అప్పగించడం ద్వారా ప్రధాని మోదీ రిలయన్స్ జేబులో రూ.30 వేల కోట్లు వేశారని ఆరోపించారు. నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కాదని, అంబానీలకే ప్రధాని అని ఎద్దేవా చేశారు. భారత ప్రభుత్వం ఏం చెప్పమంటే అదే చెప్పేలా దసాల్ట్ కంపెనీపై తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆరోపించారు(ఈ వ్యాఖ్యలను దసాల్ట్ కంపెనీ కొట్టిపడేసింది). మీడియాపైన కూడా ఇదే రకమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శించారు. గతంలో ఫ్రెంచ్ పోర్టల్ మీడియా పార్ట్‌లో వచ్చిన కథనాల ప్రకారం దసాల్ట్ కంపెనీ తప్పనిసరిగా రిలయన్స్‌తో జోడీ కట్టాల్సి వచ్చిందని రాసిందని పేర్కొన్నారు. ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నట్లు ఈ వ్యవహారంపై మోదీ ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయించటం లేదని ప్రశ్నించారు. -
‘రాఫెల్ వివాదం’లో పారదర్శకత ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘గత ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా 126 రాఫెల్ యుద్ధ విమానాలకు బదులుగా 36 యుద్ధ విమానాలనే కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఈ విషయంలో మా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగాను, నియమ నిబంధనల ప్రకారమే వ్యవహరించింది. గత యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పోల్చడానికే వీల్లేదు. ఎందుకంటే మా ఎన్డీయే ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు సరళంగా, సజావుగా, వేగంగా ఉండడమే కాకుండా అన్నింటికన్నా పారదర్శకంగా ఉంటాయి’ అని రాఫెల్ యుద్ధ విమానాల వివాదంపై కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 17, 2017 నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారత భాగస్వామి పార్టీగా అంబానీకి చెందిన రిలయెన్స్ డెఫెన్స్ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందని, రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే కంపెనీ డాస్సూకు తనకు ఇష్టమైన భాగస్వామిని ఎంపిక చేసుకునే అధికారం ఉన్నప్పటికీ భారత్ సూచించిన రిలయెన్స్ కంపెనీని ఎంపిక చేయక తప్పలేదని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే చేసిన ఆరోపణలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు సూటిగా, పారదర్శకంగా సమాధానం ఇవ్వడం లేదు? రాఫెల్ ఒప్పందంపై సంతకం చేసిన హొలాండేనే స్వయంగా ఆరోపణలు చేసినప్పుడు, ఆ ఒప్పందంపై సంతకం చేసిన నరేంద్ర మోదీ ఎందుకు నోరు విప్పడం లేదు? ఆయన తరఫున ఆయన మంత్రులు ఒకదానికి ఒకటి పొంతనలేని డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకు ఇస్తున్నారు? రాహుల్ గాంధీ, హొలాండే, పాకిస్థాన్‌ను కలిసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాయని, రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని రాహుల్ గాంధీ తన బావైన రాబర్ట్ వాద్రాకు ఇప్పించాలని చూస్తున్నారని సాక్షాత్తు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన ఆరోపణల్లో ఏమైనా అర్థం ఉందా? రాఫెల్ ఒప్పందానికి పాకిస్థాన్‌కు సంబంధం ఏమిటీ? ఆ ఒప్పందంలో రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీ తప్పుకుంటే, ఆ ఒప్పందంలో రాబర్ట్ వాద్రా కంపెనీని చేర్చే అవకాశం ఎలా ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఉంటుందనుకుంటే దీనిపై ఇంత రాద్ధాంతం చేస్తున్న రాహుల్ గాంధీ, వాద్రాకు ఎలా ఇప్పించుకుంటారు? హొలాండే ఆరోపణల బాంబు పేల్చిన దాదాపు 24 గంటల పాటు మౌనం పాటించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ మరుసటి రోజు హొలాండే ఇదే విషయమై మరోసారి చేసిన వ్యాఖ్యల్లో సగ భాగాన్నే తీసుకొనే అర్ధరహితంగా ఎందుకు స్పందించింది? ఆ రెండో భాగాన్నే తీసుకున్న ప్రభుత్వ అనుకూల మీడియాలోని ఓ భాగం మోదీ ప్రభుత్వానిది తప్పులేదని తేల్చగా మిగతా మీడియా ‘ఇది మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్’ అని పేర్కొన్నాయి. ఫ్రాన్స్‌లోని ‘మీడియా పార్ట్’ వెబ్‌సైట్‌తో శుక్రవారం హొలాండే మాట్లాడుతూ రిలయెన్స్ విషయంలో మోదీ ప్రభుత్వం ప్రమేయం గురించి వెల్లడించిన విషయం తెల్సిందే. ఆ మరుసటి రోజు ‘ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్ (ఏఎఫ్‌పీ) ప్రశ్నించినప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ‘రాఫెల్ ఒప్పందంపై జరిగిన చర్చల్లో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కొత్త ఫార్ములా కింద రిలయెన్స్ గ్రూపు పేరును తీసుకొచ్చింది’ అని హొలాండే అన్నారు. డాస్సూతో పనిచేసేందుకు రిలయెన్స్ గ్రూప్ విషయంలో భారత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని మీరు భావిస్తున్నారా? అని ఏఏఫ్‌పీ నొక్కి ప్రశ్నించగా ‘అది నా కంతగా తెలియదు. ఈ విషయంలో సమాధానం ఇవ్వగలిగిందీ డాస్సూ కంపెనీయే’ అంటూ హొలాండే వ్యాఖ్యానించారు. మొదటి ప్రశ్నకు మోదీ ప్రభుత్వమే రిలయెన్స్ గ్రూప్‌ను తీసుకొచ్చిందంటూ స్పష్టం చేసిన హొలాండే రెండో ప్రశ్నకు కొద్దిగా మార్చి తనకంటే డాస్సూకే ఎక్కువ తెలుసునని చెప్పారు. భారత వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే ఆయన అలా సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే భారత్‌లోని పాలకపక్ష మీడియా రెండో ప్రశ్నకు హొలాండే ఇచ్చిన సమాధానాన్నే ప్రచురించి మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చింది. 126 రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం కాస్త 36 విమానాలకే ఎందుకు పరిమితం అయింది? డాస్సూ కంపెనీకి భారత భాగస్వామ్య కంపెనీగా ప్రభుత్వ రంగ సంస్థ ‘హిందుస్థాన్ ఎరోనాటిక్స్ కంపెనీ’ స్థానంలో రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీ ఎలా వచ్చింది? 16 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్త 51వేల కోట్ల రూపాయలకు ఎందుకు చేరుకుంది? వీటిల్లో ఏ ప్రశ్నకు కూడా మోదీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు సరైన సమాధానం లేదు. ఇక పారదర్శకత ఎక్కడ? -
రాఫెల్ వివాదంలో మరో మలుపు
-
రాఫెల్ వివాదంలో ఎన్ని మలుపులో!
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్‌తో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసుకున్న రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గత రెండేళ్లకు పైగా సాగుతున్న వివాదంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే ఆజ్యం పోశారు. భారత భాగస్వామ్య కంపెనీగా అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేయడంలో తమ ప్రమేయం లేదని, ఆ కంపెనీ పేరును భారత ప్రభుత్వమే సూచించిందని హొలాండ్ శుక్రవారం బాంబు పేల్చిన విషయం తెల్సిందే. యుద్ధ విమానాల ఒప్పందం ప్రకారం భారత్‌లోని 72 కంపెనీల్లో ఏ కంపెనీనైనా భాగస్వామి కంపెనీగా ఎంపిక చేసుకొనే అవకాశం డసాల్ట్ కంపెనీకి ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం సూచించిన రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీని ఎంపిక చేసుకోక తప్పలేదని కూడా ఆయన వివరించారు. రిలయెన్స్ కంపెనీ ఎంపికలో తమ ప్రమేయం లేదని, భారత్‌లో ఏ కంపెనీని ఎంపిక చేసుకోవాలన్నది రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే డసాల్ట్ కంపెనీ ఇష్టమని, ఈ మేరకు ఒప్పందంలో కూడా వెసులుబాటుందని భారత ప్రభుత్వ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఖండిస్తూ వస్తోన్న కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వారం అంటే వారం క్రితమే మళ్లీ ఇదే పాట పాడారు. ‘రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో డసాల్ట్ కంపెనీ భారత దేశ భాగస్వామ్య కంపెనీ ఏదో కూడా నాకు తెలియదు. దానికంటూ ఓ ప్రత్యేకమైన నిబంధనావళి ఉంటుంది. సామర్థ్యం కలిగిన కంపెనీల్లో ఏ కంపెనీని ఎంపిక చేసుకోవాలన్నది డసాల్ట్ కంపెనీ ఇష్టం. నేను ఈ విషయంలో ఫలానా కంపెనీని ఎంపిక చేయాల్సిందిగా సూచించలేను. ఆమోదించలేను. అలా అని తిరస్కరించనూ లేను’ అంటూ సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ అత్యంత గమనార్హం. ఫ్రాంకోయిస్ హొలాండ్ శుక్రవారం వెల్లడించిన ఈ తాజా అంశాలపై ఇటు నిర్మలా సీతారామన్‌గానీ అటు ప్రధాని కార్యాలయంగానీ స్పందించలేదు. ‘ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మాత్రం ముక్తిసరిగా స్పందించారు. హొలాండ్ వ్యాఖ్యలను గుడ్డిగా ఖండించడం కుదరదు. ఎందుకంటే ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఈ యుద్ధ విమానాల ఒప్పందం చేసుకున్నారు. ఎందుకీ బాంబు పేల్చారు? ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు హొలాండే జీవిత భాగస్వామియే కాకుండా నిర్మాత కూడా అయిన అందాల తార ఫ్రెంచి నటి జూలి గయెత్‌తో అంబానీ గ్రూప్ ‘రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్’ ఫ్రెంచ్‌లో ఓ సినిమా తీసేందుకు చర్చలు జరిపింది. 2016, జనవరి 24వ తేదీన ఈ మేరకు జూలి గయెత్‌కు చెందిన ‘రోగ్ ఇంటర్నేషనల్’ సంస్థతో రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆ తర్వాత రెండు రోజులకే అంటే, 2016, జనవరి 26వ తేదీన భారత్‌తో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై హొలాండే సంతకం చేశారు. ఇప్పుడు ఈ అంశం ఫ్రెంచ్ రాజకీయాలను వేడిక్కించింది. జూలి గయెత్‌తో సినిమా ఒప్పందం కుదుర్చుకున్నందునే రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీని హొలాండ్ ఎంపిక చేశారంటూ ఫ్రెంచ్ మీడియాలో దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీని భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందనే విషయాన్ని ఆయన వెల్లడించాల్సి వచ్చింది. ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు భారత భాగస్వామ్య కంపెనీగా ప్రభుత్వరంగ సంస్థ ‘హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్’ను సూచించింది. మోదీ అధికారంలోకి వచ్చాక సీన్ పూర్తిగా మారింది. 28వేల కోట్ల రూపాయల ఒప్పందం కాస్త 51 వేల కోట్ల రూపాయలకు చేరింది. 2017, అక్టోబర్ నెలలో యుద్ధ విమానాల ప్రాజెక్ట్‌ను సంయక్తంగా చేపడుతున్నామని డసాల్ట్, రిలయెన్స్ కంపెనీలు సంయుక్త ప్రకటన చేశాయి. అదే నెలలో నాగపూర్‌లో ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫోరెన్సీ పార్లీలు పాల్గొన్నారు. అయినా రిలయెన్స్ వ్యవహారం మన నిర్మలా సీతారామన్‌కు తెలియదట. ఆమెను పిలవనందుకు అలిగి అలా చెబుతున్నారని అనుకోవాలా!! -
రిలయన్స్ డిఫెన్స్ పేరు మార్పు
కొత్త పేరు రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ న్యూఢిల్లీ: రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్‌డీఈఎల్) సంస్థ పేరు మార నుంది. రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌గా పేరును మార్చేందుకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరనున్నట్లు సంస్థ తెలిపింది. భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ దళాలకు అందించే సర్వీసులకు అనుగుణంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఆగస్టు 22న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకోసం వాటాదారుల అనుమతి తీసుకుంటా మని పేర్కొంది. ఆర్‌డీఈఎల్ గతంలో పిపావవ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో ఉండేది. 2016లో పిపావవ్ డిఫెన్స్‌లో కీలక వాటాలు కొనుగోలు చేసిన తర్వాత రిలయన్స్ గ్రూప్.. ఈ సంస్థ పేరును ఆర్‌డీఈఎల్ కింద మార్చింది. -
ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో రిలయన్స్ భారీ డీల్
ముంబై: పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్ , ఇండియన్ కోస్ట్ గార్డ్ తో భారీ డీల్ కుదుర్చుకుంది. భారత తీర రక్షక దళం(ఇండియన్ కోస్ట్ గార్డ్) నుంచి రూ. 916 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందినట్లు రిలయన్స్ డిఫెన్స్ మార్కెట్ ఫైలింగ్ లో తెలిపింది. ఒక ప్రైవేటు రంగ షిప్ యార్డ్‌తో ప్రభుత్వం ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి. 14 ఫాస్ట్ పెట్రోల్ ఓడల నిర్మాణానికి ఈ డీల్ కుదుర్చుకున్నట్టు అనిల్ అంబానీ సోమవారం ప్రకటించారు. ఈ కాంట్రాక్టులో భాగంగా 14 మీడియం, హై స్పీడ్ పేట్రోల్ వెస్సల్స్‌ను సరఫరా చేయాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. తీరప్రాంతాల్లో నిఘా, యాంటీ స్మగ్లింగ్ వ్యతిరేక , యాంటీ పైరసీ, సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్స్‌లో వీటిని వినియోగించనున్నట్టు చెప్పారు. మాడ్యులర్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో గణనీయమైన నైపుణ్యం తో కమర్షియల్, వినియోగం నౌకాదళాంలో వినియోగంకోసం పెద్ద ఓడల్ని నిర్మిస్తున్న దేశంలో అతిపెద్ద షిప్ యార్డ్ రిలయన్స్ డిఫెన్స్ . మరోవైపు ఫ్రంట్ లైన్ సంస్థలులార్సన్ అండ్ టుబ్రో, కొచ్చిన్ షిప్ యార్డ్, గోవా నౌకా నిర్మాణ కేంద్రం, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ సహా ప్రాజెక్ట్ కోసం బిడ్ వేయగా రిలయన్స్ ఈ ఆర్డర్‌ను చేజిక్కించుకోవడం విశేషం. ఈ ఒప్పంద వార్తలతో మార్కెట్లో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. రిలయన్స్ డిఫెన్స్ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసింది.