అంబానీతో ఢీ.. కేజ్రీవాల్ పదవికి ఎసరు!!
దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యాపార సామ్రాజ్యంతో ఢీకొన్నారు. అలా ఢీకొన్నది ఓ మామూలు సామాన్యుడు. అంతే, అతడి ఉద్యోగానికే ఎసరు వచ్చింది. ఆయనెవరో ఇప్పటికే అర్థమైంది కదూ. అరవింద్ కేజ్రీవాల్.. సరిగ్గా 50 రోజులు కూడా ముఖ్యమంత్రిగా పని చేయకముందే ఆయన పదవి ఊడిపోయేంత పరిస్థితి వచ్చింది. ఇంతకీ అలా ఎందుకు జరిగింది? అంబానీలతో ప్రత్యక్షంగా ఢీకొన్నందుకేనా? గొర్రె పొట్టేలు వెళ్లి కొండను ఢీకొంటే కొండకు ఏమీ కాదు సరికదా.. పొట్టేలు కొమ్ములే విరిగిపోతాయి. ఈ సత్యాన్ని తెలుసుకోలేకనే కేజ్రీవాల్ దాదాపుగా తన పదవి కోల్పోయే పరిస్థితికి చేరుకున్నారు.
ఓ సామాన్య ఐఆర్ఎస్ ఉద్యోగిగా ఉండే అరవింద్ కేజ్రీవాల్.. ఆ తర్వాత సమాచార హక్కు చట్టం కోసం పోరాడేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. ఆ తర్వాత అన్నా హజారేతో కలిసి జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం తీవ్రస్థాయిలో ఉద్యమించారు. అటు నుంచి ఢిల్లీ రాజకీయాలను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటుచేసి, అతి తక్కువ కాలంలోనే ఎన్నికల్లో పోటీకి దిగారు. పూర్తి స్థాయి మెజారిటీ రాకపోయినా, ఢిల్లీ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా నిలిచి కాంగ్రెస్ వెలుపలి నుంచి మద్దతు ఇవ్వడంతో అధికారం చేపట్టారు.
పార్టీ పెట్టిన తొలినాళ్ల నుంచే ఢిల్లీలో కరెంటు బిల్లులు, వాటిలో ఉన్న లోపాల గురించి గట్టిగా పోరాటం చేసిన అరవింద్ కేజ్రీవాల్, పదవిలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే రిలయన్స్ పవర్ ఇండస్ట్రీస్‌పై విచారణకు ఆదేశించారు. రిలయన్స్ లెక్కల్లో ఉన్న తప్పొప్పులు వెతికి తీయాల్సిందిగా కాగ్, ఏసీబీ లాంటి సంస్థలను ఆదేశించారు. అంతేనా.. ఏకంగా చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, గతంలో ఆ శాఖ మంత్రిగా పనిచేసిన మురళీ దేవ్రా, ముఖేష్ అంబానీలపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించారు. అంతే, తెరవెనక ఏం జరిగిందో గానీ.. జనలోక్‌పాల్ బిల్లును అడ్డం పెట్టుకుని కేజ్రీవాల్ తనంతట తానుగానే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగేలా వాతావరణం తీసుకొచ్చారు కాంగ్రెస్ పెద్దలు. కాంగ్రెస్ తలచుకుంటే ఎంతటి సమర్థుడైనా మట్టికరవాల్సిందేనని మరోసారి చెప్పేందుకు సిద్ధమైపోయారు!!