Reserve posts
-
జనరల్ సీట్లో గెలిచినా అర్హులే
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ, ఎస్సీ, బీసీలతోపాటు మహిళలకు రిజర్వ్ చేసిన మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ఆయా వర్గాలకు రిజర్వ్ స్థానం నుంచే కాకుండా జనరల్ సీటు నుంచి గెలిచిన వారు కూడా పోటీకి అర్హులే. జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే స్పష్టతనిస్తూ సర్క్యులర్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు, మహిళలకు రిజర్వ్ చేసిన చైర్మన్, మేయర్ పదవులకు సంబంధిత రిజర్వేషన్ స్థానం నుంచి కాకుండా జనరల్ స్థానం నుంచి సదరు కేటగిరికి చెందిన వ్యక్తి గెలిచినా ఆయా పదవులకు పోటీ చేసేందుకు అర్హులని స్పష్టతనిచ్చింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వ్ చేసిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ఆయా కేటగిరీల వారు జనరల్ సీటు నుంచి పోటీచేసి గెలిచినా ఆయా పదవులకు పోటీ పడవచ్చునని పేర్కొన్నారు. -
కాపు ఉద్యోగుల్ని వేధిస్తే సహించం
ప్రభుత్వానికి కాపునాడు హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చేసిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపారన్న సాకుతో ప్రభుత్వ శాఖల్లోని కాపు ఉద్యోగులను ఉన్నతాధికారులు వేధిస్తున్నారని కాపునాడు ఆరోపించింది. కాపునాడు రాష్ట్ర సంఘం నేతలు కఠారి అప్పారావు, అద్దేపల్లి శ్రీధర్ తదితరులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాపు కులానికి చెందిన ఉద్యోగులను బదిలీ చేయడమో, రిజర్వ్ పోస్టుల్లో ఉంచడమో చేస్తున్నారని విమర్శించారు. విజయనగరం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో సీనియర్ అధికారిగా ఉన్న చైతన్య మురళీని ముద్రగడ దీక్ష విరమించిన రోజే బదిలీ చేశారని, అయితే పోస్టింగ్ ఇవ్వకుండా రిజర్వ్‌లో ఉంచారని విమర్శించారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలువురు కాపు, బలిజ, ఒంటరి కులాలకు చెందిన ఉద్యోగుల్ని అకారణంగా బదిలీ చేశారన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దీనిపై చర్చించేందుకు ఆదివారం కాపునాడు కార్యవర్గం భేటీ అవుతుందని తెలిపారు.