బాధ్యతాయుతంగా పనిచేయండి
– పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలుండొద్దు
– డీఐజీ అకున్‌సబర్వాల్
మహబూబ్‌నగర్ క్రైం : పుష్కరాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పోలీసుశాఖ పాత్ర కీలకంగా ఉంటుందని, శాంతిభద్రతలకు, పార్కింగ్, ట్రాఫిక్సమస్య రాకుండా సమయస్ఫూర్తిగా పనిచేయాలని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకూన్ సబర్వాల్ ఆదేశించారు. పుష్కర బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించటానికి సోమవారం ఉదయం డీఐజీ జిల్లా పోలీసు కార్యాలయంలో శాఖ అధికారులతో ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సమయానుకూల నిర్ణయాలు తీసుకోవటం, అమలు చేయటంలో విజ్ఞత కనపర్చాలన్నారు. పోలీసు బందోబస్తుపైనే పుష్కరాల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని అందరు గుర్తుంచుకొని ప్రతిక్షణం జాగ్రత్తతో మసలుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పుష్కరఘాట్ల వద్ద బందోబస్తు నిర్వాహణ ప్రణాళికను కంప్యూటర్ చిత్రపటాల ద్వారా వీక్షించిన డీఐజీ సంతృప్తిని వ్యక్తపరిచారు. బందోబస్తు నిర్వాహణతో పాటు, గత అనుభవాలు, ప్రాంత చరిత్రను బట్టి తీసుకుంటున్న జాగ్రత్తలను ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వరి వివరించారు. సిబ్బందికి విధి నిర్వాహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, యాత్రికులకు సూచనలందిస్తూ ముద్రించిన పుస్తకాలు, కరపత్రాలు, తయారుచేస్తున్నామని ఆమె తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ డివి.శ్రీనివాస్‌రావు, ఏఎస్పీ కల్మేశ్వర్ సింగేనవర్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ లావణ్య, డీఎస్పీలు చెన్నయ్య, బాలకోటి, కృష్ణమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.