నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ఏర్పాటు
వైవీయూ:
సాహస కృత్యాల పట్ల ఆసక్తి కలిగిన యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ (ఎన్‌ఏఎఫ్)ను ఏర్పాటు చేసినట్లు విశ్రాంత ఎయిర్‌ఫోర్సు ఉద్యోగి, పారామోటార్ గ్లైడింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన లేబాకు మదన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1996లో ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో మెకానికల్ విభాగంలో చేరానన్నారు. స్పోర్ట్స్, అడ్వెంచర్లపై ఆసక్తితో పదేళ్లుగా పారాసైయిలింగ్, పారా గ్లైడింగ్, పారా మోటార్, పవర్ట్ హెంగ్ గ్లైయిడింగ్, పారా జంపింగ్ అంశాల్లో పలు ప్రదర్శనలు నిర్వహించానన్నారు. 2012లో పారామోటార్ ప్రపంచ పోటీలలో పాల్గొన్న తొలిభారతీయుడిగా స్థానం పొందానని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా పారామోటార్‌తో 10,070 కి.మీ దూరం 53రోజుల పాటు నిరంతరాయంగా ప్రయాణించి రెండు జాతీయ, ప్రపంచ రికార్డులు నెలకొల్పానన్నారు. పవర్హెంగ్ గ్లైయిడింగ్లో 2016లో సెప్టెంబర్‌లో 10,700 అడుగుల ఎత్తుకు వెళ్లి సరికొత్త రికార్డు సృష్టించానని తెలిపారు.
సాహస కృత్యాలకు శిక్షణ...
సెప్టెంబర్ 30న ఉద్యోగ విరమణ చేశానని.. నేర్చుకున్న విద్యను అందరికీ పంచాలన్న ఉద్దేశ్యంతో నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశానన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆసక్తి ఉన్న వారికి ఈ ఫౌండేషన్ ద్వారా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందులో పారా సెయిలింగ్, పారామోటార్, పవర్హ్యాంగ్ గ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, పారాజంపింగ్ విభాగాల్ల శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 9494289222 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి సుధాకర్ పాల్గొన్నారు.