నేటి 'సీఎం'ను ఆనాడు రానివ్వనేలేదు!
ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ఐటీ అంటే రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసిందే.. ఇక్కడ చదివే పిల్లల ఇబ్బందులు, ఆందోళనలు, నిరసనలు ఇలా ఎదో ఒక విషయంలో ట్రిపుల్ఐటీ ఎప్పుడు వార్తల్లో నిలిచేది. బాసరలో 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఇక్కడి విద్యార్థులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక సమస్యలు పరిష్కారం కాక ఇప్పటికీ అక్కడ చదివే విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ రహస్య క్యాంపస్‌గా మారింది. మీడియాకు, విద్యార్థి సంఘాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మేధావులకు ఎవరైనా సరే లోపలికి అనుమతించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు చదివే ఈ విశ్వవిద్యాలయంలో ఏమి జరుగుతుందోనని తెలియక పోషకులు ఆందోళనకు గురవుతున్నారు.
మీడియాకు నో ఎంట్రీ
2022 ఆగస్టు 7న బాసర ట్రిపుల్ఐటీకి గవర్నర్ హోదాలో తొలిసారి వచ్చిన తమిళిసై పర్యటన కవరేజీకి వెళ్లిన మీడియాను అధికారులు అనుమతించ లేదు. ట్రిపుల్ఐటీ ప్రధాన ద్వారాన్ని మూసివేసి ఉంచారు. మీడియాతో పాటు ఉదయం వేళ ట్రిపుల్‌ఐటీలో పనిచేసే సిబ్బందిని కూడా అనుమతించ లేదు. గవర్నర్ బాసర ట్రిపుల్ఐటీ నుంచి నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీకి వెళ్లే సమయంలో ప్రధాన ద్వారం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే మీడియాతో గవర్నర్ తమిళసై మాట్లాడారు.
ఇప్పటికై నా మారేనా?
నాటి ప్రభుత్వంలో బాసర ట్రిపుల్‌ఐటీలో ఆంక్షలపేరుతో ఎవరిని అనుమతించలేదు. డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా పదవీ ప్రమాణం స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారు. ప్రజాభవన్‌గా మార్చి అక్కడే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మాత్రం నేటికి పాత ఆంక్షలే కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చి సమస్యలు తెలుసుకుని శాశ్వత పరిష్కారానికి మార్గం చూపుతారని ఇక్కడి విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
తీరిక లేక..
విద్యార్థులకు ప్రతీరోజు క్రీడలు ఆడుకునేలా షెడ్యూల్ ఉంచాలి. ఉదయం నిద్రలేవగానే రాత్రి పడుకునే వరకు స్నానాలు, భోజనాలు, తరగతి గదులు వీటితోనే రోజు పూర్తి అవుతుంది. క్రీడల్లో ఉన్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి కాస్త దూరమవుతారు. వారంలో ఒక్కరోజైన చెవులకు ఇంపైనా సంగీతం, వినోద కార్యక్రమాలు తిలకించే ఏర్పాట్లు చేయాలి. అవేవి ఇక్కడ జరగడం లేదు. విద్యార్థుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌లు ఇప్పిస్తూ మానసికస్థితిని తెలుసుకోవాలి. ఒంటరిగా ఉండే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిచి గతంలో ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే విషయాలను చర్చించాలి. ఇకనైనా విద్యార్థులపై శ్రద్ధ వహించాలని పలువురు కోరుతున్నారు.
నేటి సీఎంకు అప్పట్లో నో ఎంట్రీ..
నేటి సీఎం రేవంత్‌రెడ్డికే అప్పట్లో బాసర ట్రిపుల్‌ఐటీలో అనుమతించలేదు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు గోడ దూకివచ్చిన పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ గేటుద్వారా బయటకు పంపించారు. ప్రస్తుతం ఆయన సీఎంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని విద్యార్థులు భావిస్తున్నారు.
ఇవి చదవండి: పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు