revenue lands
-
భూ ఆక్రమణలపై కన్నెర్ర!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ, మునిసిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ భూముల ఆక్రమణదారులను ఆరు నెలల్లో ఖాళీ చేయించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. మునిసిపాలిటీ, అటవీ భూములను ఆక్రమించుకున్న వారిని రెండు నెలల్లోగా గుర్తించి ఆ తరువాత ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించిన తరువాత తిరిగి కబ్జాల బారిన పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించే విషయంలో నిబంధనలు అనుసరించాలని అధికారులకు సూచించింది. పంచాయతీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల పేరు మీద క్రమబద్ధీకరించరాదని, వాటిని ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించాల్సిందేనంటూ జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు 2011లోనే విస్పష్టమైన తీర్పు ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. సుప్రీం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది జీవో 188 జారీ చేసి ఆక్రమణల తొలగింపునకు నిబంధనలు రూపొందించిందని తెలిపింది. అయినప్పటికీ అధికారులు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆక్రమణలపై పలు వ్యాజ్యాలు దాఖలు.. జీవో 188 జారీ అయినప్పటికీ ప్రభుత్వ భూములు, నీటి వనరులు, అటవీ, క్రీడా స్థలాలు, శ్మశానాల స్థలాలను ఆక్రమణల నుంచి అధికారులు కాపాడటం లేదని, ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది బుస్సా రాజేంద్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై పలు పిల్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై సీజే ధర్మాసనం ఉమ్మడిగా విచారణ జరిపింది. ఆక్రమణల చెర నుంచి ప్రభుత్వ భూములకు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితి మారాలి... ‘జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం 2011లో జీవో 188 జారీ చేసింది. ఆ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ (ఆస్తుల పరిరక్షణ) రూల్స్‌ను తెచ్చింది. వీటి ప్రకారం పంచాయతీ భూములను మూడు రకాలుగా వర్గీకరించింది. 1.సొంతవి, సేకరించిన భూములు 2. దానంగా, విరాళంగా, పంచాయతీలకు బదిలీ చేసిన భూములు 3. పంచాయతీకి చెందిన భూములు. ఏటా పంచాయతీ పరిధిలోని భూముల వివరాలను సేకరించి గెజిట్‌లో ప్రచురించాలి. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఖాళీ చేయించాలి. ఆక్రమణల గుర్తింపు, తొలగింపు కోసం కలెక్టర్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ మూడు నెలలకొకసారి సమావేశమై ఆక్రమణల తొలగింపు పురోగతిని సమీక్షించాలి. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా దురదృష్టవశాత్తూ అధికారులు వీటిని అమలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఏటా పెరిగిపోతున్నాయి. హైకోర్టులో పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు నిబంధనలను అమలు చేయడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ఆక్రమణదారుల చెర నుంచి ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. çపంచాయతీ, మునిసిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలి’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించే ముందు నోటీసు ఇచ్చి వారి వాదన వినాలని స్పష్టం చేసింది. నిర్దిష్ట సమయం నిర్ణయించుకుని ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని మునిసిపల్ అధికారులకు తేల్చి చెప్పింది. పంచాయతీ కార్యదర్శులంతా జీవో 188 ప్రకారం ఆక్రమణదారులను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పంచాయతీ భూముల నుంచి ఆక్రమణదారులను ఆరు నెలల్లో ఖాళీ చేయించాలని నిర్దేశించింది. వక్ఫ్ భూములను ఈ జాబితాలో చేర్చలేం.. ధర్మాసనం మొదట తన ఉత్తర్వులను పంచాయతీ, మునిసిపల్, అటవీ భూములకే పరిమితం చేయగా రెవెన్యూ, దేవదాయశాఖ భూములను కూడా జత చేయాలని రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ రెవెన్యూ భూములను ఆక్రమణల తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చింది. దేవదాయ శాఖ భూములపై వేరుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ సమయంలో ప్రభుత్వ మరో న్యాయవాది ఖాదర్ బాషా జోక్యం చేసుకుంటూ వక్ఫ్ భూములు కూడా పెద్ద సంఖ్యలో ఆక్రమణల్లో ఉన్నాయని, వాటిని కూడా ఆ ఉత్తర్వుల్లో చేర్చాలని కోరారు. అయితే ధర్మాసనం అందుకు నిరాకరిస్తూ వక్ఫ్ భూముల విషయంలో బహుళ వివాదాలుంటాయని, అందువల్ల వాటిని ఈ ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురాలేమని పేర్కొంది. -
వీళ్లు మహాముదుర్లు, స్వామికే.. శఠగోపం పెట్టారుగా!
చింతపల్లి(నల్లగొండ): విలువైన దేవుని మాన్యం అన్యాక్రాంతమవుతోంది. దేవాదాయ శాఖ పర్యవేక్షణ లోపం, పూజారుల ఇష్టారాజ్యం వల్ల చింతపల్లి మండల కేంద్రంలోని గట్టుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి భూములలు ఆక్రమణకు గురవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయ రికార్డుల్లో 110 ఎకరాలు ఉండగా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 70 ఎకరాలను మాత్రమే అధికారికంగా లెక్క చూపిస్తుండడం పలు సందేహాలకు తావిస్తోంది. ఎంతో చరిత్ర కలిగిన ఆలయం హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారికి కేవలం వంద మీటర్ల దూరంలో గట్టుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. 600 సంవత్సరాల క్రితం ఇక్కడ వేంకటేశ్వరస్వామి వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం ఆధీనంలో 110 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు ఎకరం రూ.1.50 కోట్లు పలుకుతుంది. విలువైన భూములు కావడంతో కొందరు అక్రమార్కులు హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రికార్డులను తారుమారు చేస్తూ తప్పుడు లెక్కలతో దేవాలయ భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలుస్తోంది. ఆలయానికి దేవరకొండ, గోకారం, గడియగౌరారం గ్రామాల్లో కూడా ఈ దేవాలయానికి సంబంధించి భూములు ఉన్నాయి. అవి కూడా ఎక్కడా రికార్డుల్లో లేని పరిస్థితి. పూజారుల ఆధీనంలో.. గట్టుపతి దేవాలయం భూములు ఇక్కడి 80 ఏళ్ల నుంచి పూజారుల ఆధీనంలో ఉన్నాయి. అసలు దేవాదాయ శాఖ కమిటీ ఆధీనంలో దేవాలయ ఈ భూములు ఉండాలి. దానిపై కమిటీ సభ్యుల పర్యవేక్షణ ఉంటుంది. భూములకు సంబంధించి దేవాదాయ శాఖ ప్రత్యేకంగా రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ భూములు కౌలు వేలం వేసి దేవాలయ నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కానీ వేలంపాట నిర్వహించకుండానే విలువైన భూములు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ఇప్పటివరకు సుమారు 40 ఎకరాల వరకు భూములు మాయమైనట్లు తెలుస్తోంది. 40 ఎకరాల లెక్క తేల్చని రికార్డులు గట్టుపతి దేవాలయ భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల ఆధారంగా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ రికార్డులో 110 ఎకరాలకు బదులుగా 70 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తుండగా.. మిగతా 40 ఎకరాల ప్రస్తావన ఎక్కడా చూకపోవడం ఇటు దేవాదాయ శాఖ అధికారులు అటు రెవెన్యూ అధికారుల ఉదాసీనతకు అద్దంపడుతోంది. సంబంధిత అధికారులు స్పందించి భూముల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం దేవాలయ భూములు అన్యాక్రాంతమైన విష యం తమ దృష్టికి వచ్చింది. భూముల విలువలు పెరగడంతో అక్రమార్కులు దేవాదాయ భూములను ఆక్రమిస్తున్నారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. భూముల వేలంపాటకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. – సత్యనారాయణమూర్తి, దేవాదాయ శాఖ ఈఓ చదవండి: Hyderabad Collector L Sharman: బైక్‌పై వెళ్లి.. తనిఖీలు చేసి.. -
భూ ఫిర్యాదులపై సమగ్ర విచారణ..
-
భూ ఫిర్యాదులపై సమగ్ర విచారణ..
సాక్షి, అమరావతి: రెవెన్యూ భూముల సంస్కరణల మంత్రి వర్గ ఉప సంఘం భేటీ గురువారం జరిగింది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. సీసీఎల్ఏ నీరబ్‌కుమార్, రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రెవెన్యూ సంబంధిత సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. భూ రికార్డుల ప్రక్షాళన చేస్తూ సమస్యలు తగ్గించేలా అందరికీ ఆమోదయోగ్యమైన సూచనలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ప్రజలకు సులభతరమైన రెవెన్యూ సేవలు, సమగ్ర సర్వే, పక్కాగా భూ రికార్డులు పరిశీలన,సూచనలు చేయడమే లక్ష్యంగా చర్చ సాగింది. (చదవండి: పరిటాల సునీత ఫ్యామిలీ భూబాగోతం!) 22ఏ కింద ఉన్న భూములపై అధ్యయనం చేయాలని కమిటీ నిర్ణయించింది. ఎస్టేట్, ఇనాం భూములపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ భూములను అతి తక్కువగా నామినల్ రుసుము చెల్లించి కన్వెర్ట్ చేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నారనే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూముల ఫిర్యాదుల పట్ల సమగ్ర విచారణ చేసి తగిన న్యాయం చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకునేందుకు నెల రోజులపాటు స్పందన ఫిర్యాదులను అధ్యయనం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. -
రెవెన్యూ రికవర్రీ!
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాల్సిన వారు డిఫాల్ట్ అయినప్పుడు, సంస్థలు మూతపడినప్పుడు, ప్రభుత్వ పథకాల్లో అక్రమాలకు పాల్పడ్డప్పుడు, ప్రభుత్వం నుంచి రావాల్సిన దాని కన్నా అదనంగా బకాయిలు పడినప్పుడు వాటిని రాబట్టడం కోసం నోటీసులు ఇస్తారు. నోటీసులకు స్పందించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా వారికి ఉన్న ఆస్తులను వేలం వేసి ఆ డబ్బులు జమ చేస్తారు. అయితే గత ప్రభుత్వ హయాం నుంచి ఈ బకాయిలు వసూలు చేయకపోవడం వల్ల ఇవి కొండంత పెరిగిపోయాయి. జిల్లాలో ఎక్కువగా డ్వామా, సినిమా థియేటర్ల నుంచి రావాల్సిన బకాయిలు, భూసేకరణలో జరిగిన అక్రమాలకు సంబంధించిన బకాయిలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. డివిజన్ల వారీగా బకాయిలు ఇలా.. ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 93 మంది వ్యక్తులు, సంస్థల నుంచి రూ.122 కోట్ల 96 లక్షలు రావాల్సి ఉంది. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 46 మంది వ్యక్తుల నుంచి రూ.11 కోట్ల 87 లక్షలు రావాల్సి ఉండగా, నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 38 మంది వ్యక్తుల నుంచి రూ.8 కోట్ల 22 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్ పరిధిలో 23 మంది వ్యక్తుల నుంచి రూ.11 కోట్ల 13 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. భూ సేకరణ అక్రమాలు అ‘ధనం’ వీటికి భూసేకరణ అక్రమాలు అదనంగా తోడయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు గిరిజనేతరులకు ఇళ్ల నిర్మాణానికి జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పరిధిలోని తాడువాయి, మంగిశెట్టిగూడెం, చల్లవారిగూడెం గ్రామాల పరిధిలో సుమారు 1100 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో సేకరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద కుక్కునూరు, వేలేరుపాడు నిర్వాసితులకు తొలివిడతగా ఇళ్లు నిర్మించేందుకు ఈ భూములు సేకరించారు. అయితే ఈ భూముల సేకరణలో భారీ అవినీతి కూడా గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది. పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అవినీతిపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన భూముల్లో లేనివి ఉన్నట్లు చూపించి రూ.కోట్ల పరిహారాన్ని నొక్కేశారు. వర్జీనియా పొగాకు బ్యారన్లు లేకపోయినా ఉన్నట్లు, వ్యవసాయ బోర్లు లేకపోయినా ఉన్నట్లు, లేని మామిడి తోటలు, కోకో, ఆయిల్‌పామ్, కొబ్బరి తోట తదితర పంటలు ఉన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి రూ.కోట్లు నొక్కేశారు. దీనికి అధికారులు, సిబ్బంది కూడా తమ వంతు సహకారం అందించారు. అయితే ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో అధికారులు స్పందించి వరుసగా మూడుసార్లు సర్వే చేశారు. ఈ సర్వేల్లో అవినీతి బయటపడటంతో వివిధ శాఖలకు సంబంధించిన సుమారు 13మందిని విధుల నుంచి తొలగించారు. సర్వేల అనంతరం చివరకు అవినీతి జరిగిందని గుర్తించి రైతులకు చెల్లించిన పరిహారం సొమ్ము రికవరీకి నడుంబిగించారు. స్పందించని రైతులు ఇందుకోసం ఏయే రైతులు అవినీతికి పాల్పడ్డారో గుర్తించి, లేనివి ఉన్నట్లు చూపించి అదనంగా పొందిన సొమ్ములు రికవరీ చేసేందుకు నోటీసులు జారీ చేశారు. ఇలా మూడుసార్లు రైతులకు నోటీసులు జారీ చేసినా ఏ ఒక్కరూ స్పందించలేదు. అయితే అధికారులు నోటీసులు జారీ చేయడంతో కేవలం రూ. 97 లక్షలు మాత్రం రికవరీ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.16 కోట్ల పైచిలుకు సొమ్ము రైతుల నుంచి రివకరీ కావాల్సి ఉంది. తాడువాయి భూసేకరణలో అవినీతికి పాల్పడిన 51 మందిని అధికారులు గుర్తించారు. మూడు సార్లు నోటీసులు ఇచ్చినా రైతులు స్పందించకపోవడంతో చివరకు ఐటీడీఏ పీఓ, భూసేకరణ అధికారి హరీంద్రియ ప్రసాద్, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. అయితే అధికారులు వేగంగా స్పందించకపోవడంతో అక్రమార్కులు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. తాజాగా జిల్లా అధికారులు ఈ బకాయిల వసూలుపై దృష్టి పెట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆర్ఆర్ యాక్టు బకాయిల వసూలుపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇటీవల వరదలు రావడంతో కొంత ఆలస్యమైందని, త్వరలోనే ఈ బకాయిలు అన్నీ వసూలు చేస్తామని జాయింట్ కలెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఇక.. ప్రైవేటు భూములే మిగిలాయి..!
సాక్షి టాస్క్‌ఫోర్స్: మదనపల్లె పట్టణంలో గూడులేని పేదవాడికి సెంటు స్థలం ఇవ్వాలంటే మీనమేషాలు లెక్కించే రెవెన్యూ అధికారులు.. అధికారం అండగా టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములన్నింటినీ దర్జాగా కబ్జా చేస్తున్నా చూస్తుండిపోయారు. నకిలీ పట్టాలు, పత్రాలతో యథేచ్చగా రూ.వేల కోట్ల విలువ చేసే వందల ఎకరాల భూములు స్వాహా చేస్తున్నా.. ఎందుకు వచ్చిన గొడవలే అని ఊరకుండిపోయారు. ఫలితంగా ప్రభుత్వ భూములకు ప్రహరీగోడలు ఏర్పాటు చేసుకుని రియల్ ఎస్టేట్ ముసుగులో వెంచర్లు వేసి అమ్మేందుకు సిద్ధమయ్యారు. పట్టణంలోనే డీకేటీ బ్రదర్స్‌గా పేరుమోసిన టీడీపీ నాయకుల్లో ఒకరిని ఏకంగా ముఖ్యమంత్రి మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే అభద్రతా భావంలో ఉంటున్న ప్రజలకు ఈయన ఎమ్మెల్యేగా అయితే ప్రైవేటు భూములు వదలిపెట్టడన్న బెంగ పట్టుకుంది. మాజీ సైనికుల భూముల్లో టీడీపీ కార్యాలయం.. బీకే.పల్లెలోని సర్వేనెంబరు 8లో ఉన్న భూమి చెరువు పొరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. దీనిపక్కనే ఉన్న స్థలాన్ని మాజీ సైనికులకు ఇళ్ల పట్టాల కింద ప్రభుత్వం కేటాయించింది. సర్వేనెంబర్ 8/1లో 142 మంది మాజీ సైనికులకు 2సీ పట్టాలు ఇచ్చారు. దీనిపై కన్నేసిన టీడీపీ అభ్యర్థి ఇదే నెంబరులో 2.07 ఎకరాల భూమిని మాజీ సైనికుడు ఇంద్రసేన రాజు పేరుతో 1984 సెప్టెంబర్ 23న పట్టా ఇచ్చినట్లు తహసీల్దార్ సంతకాలతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. 2016 జూన్‌లో ఇంద్రసేన రాజుకు చెందిన భూమిని అనంతపురం జిల్లాకు చెందిన జాస్తి నాగేంద్ర పేరుతో జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు. 2016 ఆగస్టులో నాగేంద్ర నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే నెంబరు చెరువు పొరంబోకుగా ఉన్నందున రిజిస్ట్రేషన్‌కు అనుమంతించమని అధికారులు సూచిస్తే హైకోర్టును ఆశ్రయించారు. రెండుసార్లు తీర్పు ప్రతికూలంగా వచ్చింది. మూడోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం మాజీ సైనికులకు, అభ్యర్థి దొమ్మలపాటి రమేష్‌కు మధ్య వివాదం కోర్టులో నడుస్తోంది. భూముల విషయంలో మాజీ సైనికులపై దొమ్మలపాటి రమేష్ అనుచరులు మాజీ సైనికులను గాయపరిచిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం ఆక్రమిత స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. విలేకరులకు కేటాయించిన భూమిని కూడా.. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి ఆక్రమణలో ఉన్న జర్నలిస్టులకు కేటాయించిన స్థలం మదనపల్లె బైపాస్ రోడ్డులో జర్నలిస్టులకు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు స్థలాన్ని ఎంపిక చేశారు. స్కెచ్ సహా వేసి జర్నలిస్టులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించి స్థలాన్ని చూపించి చదును చేసుకోమన్నారు. విలేకరులు హౌసింగ్ కమిటీగా ఏర్పడి స్థలాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో భూమికి తప్పుడు పత్రాలను సృష్టించి 3.5 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. జర్నలిస్టులకు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వ భూమి కాదని, తనదేనంటూ బెదిరింపులకు దిగారు. చంద్రాకాలనీ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అనుచరుడితో కలిసి భారీ వెంచర్ వేశారు. అందుకు సంబం ధించి అన్ని అనుమతులున్నట్లు ప్లాట్లు కావాల్సిన వారు సంప్రదించాలని బోర్డులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా టీడీపీ నాయకుల అక్రమాలపై విచారణ చేపట్టాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు. ఇతర నియోజకవర్గానికి పాకిన ఆక్రమణలు తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు రెవెన్యూ పరిధి 111 సర్వేనెంబరులోని 22 ఎకరాల ప్రభుత్వభూమిని పేదలకు పంపిణీ చేయాలని రెవె న్యూ అధికారులు నిర్ణయించారు. సర్వేనెంబర్‌ను 13 భాగాలుగా డివిజన్ చేసి వాటిలో 111/2,4,5,8,9,11,13 సర్వే నెంబర్లలో భూమి వ్యవసాయానికి పనికిరాదనే ఉద్దేశంతో పంపిణీ చేయలేదు. మిగతాభూమిని అర్హతను ఆధారంగా చేసుకుని రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు పట్టాను ఇచ్చారు. అంగళ్లు గ్రామానికి చెందిన తిరుమలక్క, కమలమ్మ, యల్లయ్య, బొగ్గుల ఏసయ్య, రామలింగమ్మలకు పంపిణీ చేశారు. ఈ భూమి అనంతపురం హైవేకి పక్కగా ఉండటం, కోట్ల విలువ చేసేది కావడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ ఆయన కుటుంబసభ్యులు వీరిని బెదిరించి భూమిని ఆక్రమించుకున్నారు. 111/5 సర్వేనెంబర్లో 42 సెంట్లు పెద్ద బండ ఉంది. దీనిని ఎవరికి పంపిణీ చేయకుండా వదిలేయడంతో మొదట దీన్ని ఆక్రమించుకున్నారు. బండరాయిని 1.33 ఎకరాల భూమిగా చూపిస్తూ దొమ్మలపాటి రమేష్ బావ కృష్ణమూర్తినాయుడు పేరుతో పట్టా చేయించుకున్నారు. వీటికి కొత్త సర్వేనెంబర్లు 111/3ఈ, 569/9, 111/3డీ, 142/1, 192 సర్వేనెంబర్లతో 4 ఎకరాల భూమిని భార్య సరళ పేరుతో పట్టా చేసుకున్నారు. 111/3డీ సర్వే నెంబరుతోనే భార్య, బామ్మర్ది శ్రీనివాస రెడ్డి, అక్క పేరుతో దొంగ పట్టాలు సృష్టించుకున్నారు. రెవెన్యూ రికార్డులో ఈ సర్వేనెంబర్లు లేకపోవడం ప్రస్తావించదగ్గ విషయం. కేవలం ఈ నెంబర్లతోనే మొత్తం భూమిని ఆక్రమించుకుని పేదోళ్ల పొట్ట కొట్టారు. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేశారనే ఆరోపణలు పెద్దఎత్తున ఉన్నాయి. -
చిగురించిన ఆశలు
విజయవాడలోని రెవెన్యూ, కొండ పోరంబోకు స్థలాలకు పట్టాలు పొంది, వాటిలో నివసిస్తున్న పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకూ స్థలాలకు పట్టాలు ఉన్నా అధికారికంగా క్రయవిక్రయాలకు, తనఖాపై రుణాలు పొందేందుకు వీలు లేదు. ఇప్పుడు విక్రయాలకు, తనఖాలకు అవకాశం కల్పిస్తూ జీఓ తెచ్చేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేపట్టడంతో పేదలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, విజయవాడ: ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నగరంలో ఆకస్మికంగా పర్యటించారు. ఆ సమయంలో కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు తమ సమస్యలను ముఖ్యమంత్రికి ఏకరువుపెట్టారు. కొండప్రాంతాల్లో ఉన్న తమ ఇళ్లకు పట్టాలు ఇచ్చారని, వాటి వల్ల ఉపయోగం లేకుండాపోయిందని వివరించారు. కుటుంబ అవసరాల కోసం ఇళ్లు విక్రయించాలన్నా, కనీసం బ్యాంకులో తనఖాపెట్టి రుణం తీసుకోవాలన్నా వీలులేదని వివరించారు. సీఎం స్పందించి పేదల ఇళ్ల పట్టాల సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక జీఓ వస్తేనే సాధ్యం ప్రస్తుతం ఉన్న జీఓల ప్రకారం ప్రభుత్వ, పోరంబోకు భూములను ఆక్రమించుకుని నివసిస్తున్న ఇళ్లకు సంబంధించి పట్టాలు ఉన్నప్పటికీ విక్రయించుకునే అధికారం లేదు. గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినా కేవలం అనుభవ హక్కు మాత్రమే ఉండేది. ఈ తరహాలో సుమారు 50 వేల ఇళ్ల వరకు రెవెన్యూ భూముల్లో, కొండలపైనా ఉన్నాయి. పట్టాల మార్పుపై పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా, అందుకు ప్రస్తుతం ఉన్న జీఓలు సరిపోవని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర భూపరిపాలన శాఖ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇళ్ల పట్టాలను మార్చి వాటి స్థానంలో, ఇళ్ల స్థలాన్ని విక్రయించేందుకు (సేలబుల్ రైట్స్), బ్యాంకులో తాకట్టు(లోన్లు) పెట్టి రుణం తీసుకునేందుకు వీలుగా కొత్త పట్టాల జారీ చేసేందుకు ప్రత్యేక జీఓ జారీ చేయాలని కోరినట్లు తెలిసింది. చేతులు మారిన స్థలాల విషయంలో... కొండ ప్రాంతం, పోరంబోకు భూముల్లో పేదలు నివసిస్తున్న స్థలాలకు పట్టాలు ఉన్నా విక్రయించే హక్కు లేదు. అయితే కొంతమంది తమ ఇళ్లను విక్రయించుకున్నారు. కొనుగోలుదారుడికి ఇంటి పట్టా అందజేసి, ఇంటిని స్వాధీనం చేస్తూ హామీ పత్రం రాసిచ్చేవారు. అయితే పట్టా మాత్రం విక్రయదారుడి పేరుతోనే ఉండేది. ఇటువంటి వాటిని కూడా మార్చేందుకు వీలుగా జీఓలో మార్గదర్శకాలు పొందుపరచాలని రెవెన్యూ అధికారులు భూపరిపాలన శాఖను కోరారు. చనిపోయిన వారి పేరుతో పట్టాలు ఉంటే, ప్రస్తుతం అనుభవిస్తున్న వారి పేర్లతో కొత్తగా పట్టాలు ఇచ్చేందుకు వీలుగా నిబంధనలు రూపొం దించాలని కూడా కోరినట్లు తెలిసింది. విద్యుత్ బిల్లులు, కార్పొరేషన్‌కు చెల్లించే ఇంటి పన్ను రశీదులను ఆధారంగా చేసుకుని అనుభవదారులను గుర్తించాలని సూచిం చారు. కొత్త పట్టాలు పొందిన వారు కనీసం రెండేళ్ల వరకు విక్రయించకుండా, బ్యాంకుల్లో తాకట్టు పెట్టకుండా మార్గదర్శకాల్లో పొందుపరచాలని కోరారు. ప్రత్యేక జీవో విడుదలయ్యేనా? ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలుకు అవసరమైన ప్రత్యేక జీఓ జారీ సాధ్యమేనా అనే చర్చ రెవెన్యూ శాఖలో జరుగుతోంది. కొండపైన ఉన్న ఇళ్లను విక్రయించేందుకు హక్కు కల్పించాలంటే అటవీశాఖ చట్టాలు అంగీకరించవేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ జీఓ వస్తే కొండలపైన మరిన్ని ఆక్రమణలు పెరిగే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు అవకాశం ఇస్తే అక్కడ భూముల ధరలు కొండెక్కి కూర్చుంటాయని భావిస్తున్నారు. -
గిరిజనులకు ‘ఉరి’ హారం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గిరిజనులను బ్రతకనివ్వరా, వారిని బజారుపాలు చేస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది. అనుభవిస్తున్న భూములకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా హరితహారం పేరుతో లాక్కుంటే ఎలా? మానవులు తమకు ఊహ తెలిసినప్పటి నుంచి భూమిని దుక్కి చేసి పంటలు పండించే ప్రక్రియకు పూను కున్నారు. ప్రకృతి పచ్చదనా నికి నిదర్శనం. పర్యావరణ సమతుల్యం లోపిస్తే జీవరాశుల ఉనికికే ప్రమాదం. అందులో సగటు మనుషులు తగిన ఆహారం లేకుండా జీవించజాలరు. రుతువులు సరిగా పనిచేయకుంటే అధిక వర్షాలు, కరువులు సంభవిస్తుంటాయి. అందుకని కనీసం 40 శాతం భూమిలో అడవి, నదులు, గుట్టలు ఉండటం సమంజసం. భూముల వర్గీకరణను ఎవరు ఏ ప్రాతిపదికన చేశారనేది ప్రధాన ప్రశ్న. రాచరిక వ్యవస్థలో భూము లపై హక్కుకు సంబంధించి రికార్డులు రూపొందించి, సర్వే నంబర్లు, రెవెన్యూ భూములుగా నమోదు చేశారు. రెవెన్యూ భూములలో ప్రభుత్వశిఖం, కారజు కాతా, దేవాదాయ, వక్ఫ్, ఇనాం తదితర సబ్ క్లాజు లుగా ప్రభుత్వాలు గుర్తించాయి. ఆ తర్వాత అసైన్ మెంట్, భూసంస్కరణ, అటవీ భూముల హక్కుల చట్టాలను ప్రభుత్వాలు తెచ్చాయి. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడు స్తున్నా ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అటవీ, రెవెన్యూ హద్దుల సమస్య వివాదాస్పదంగానే మిగిలిపోయింది. రెవెన్యూవారు లబ్ధిదారులకు పట్టా సర్టిఫి కెట్లు ఇస్తారు. అటవీశాఖ వారు అడ్డుతగులుతారు. మధ్యలో నిరు పేద రైతు నలిగిపోతున్నాడు. ముఖ్యమంత్రుల దృష్టికి తెచ్చినా వారు ప్రత్యేక కృషి చేయలేదు. ఇప్పటికీ ఈ అంశం జటిలంగా, కొరకరాని కొయ్యగా మారింది. గత 30 సంవత్సరాల నుంచి అనేక గిరిజనులతో పాటు ఎస్సీ, బీసీలు కూడా ప్రభుత్వ భూములను చదునుచేసుకొని పోడు వ్యవసాయం ద్వారా జీవనో పాధి గావించుకుంటున్నారు. ఇలా సుమారు 10 లక్షల ఎకరాల పోడు భూములలో సాగు చేయబడుతున్నది. యూపీఏ-1కు వామపక్షాలు బయటి నుండి మద్దతిచ్చిన సందర్భంలో 2006లో అటవీ భూముల హక్కుల చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 10 సంవత్సరాల నుంచి కాస్తులో ఉండి, అనుభవిస్తున్న వారికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉత్తర్వులు వెలువ డ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో పట్టాలివ్వడానికి సర్వేలు జరిగినా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం, సంక్లిష్ట రాజకీయ నేపథ్యంలో అవి పెండింగ్‌లో ఉండిపో యాయి. 2014 జూన్ 2న కొత్త తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అటవీ భూముల చట్టప్రకారం గిరిజనులకు సర్టిఫికెట్లు ఇస్తా రని భావించారు. కానీ దానికి భిన్నంగా కేసీఆర్ ప్రభుత్వం ‘‘హరిత హారం’’ పేరుతో పేదల భూములు లాక్కో వడానికి అటవీశాఖ, పోలీసు శాఖలను ఉసికొల్పింది, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు పూనుకున్నది. ఖమ్మం, వరంగల్, మహబూ బ్‌నగర్, నల్లగొండ, అదిలాబాద్ తదితర జిల్లాలలోని గిరిజనుల భూము లను బలవంతంగా లాక్కొంటూ మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టింది. తాత, తండ్రుల నుండి సాగు చేసుకున్న భూములను ఎలా లాక్కుంటారని, అన్యా యమని ఎదురు తిరిగిన పేదలపై పీడీ యాక్టు తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టి రోజుల తరబడి జైళ్ల పాలు చేసింది. గతంలో ఇలా జరిగినపుడు వామపక్షాలు ఐక్యం గాను విడివిడిగాను ఉద్యమబాట పట్టాయి. అసెం బ్లీలో చర్చ జరిగింది. కాస్తు చేసుకొని బ్రతుకుతున్న పేదల జోలికి అధికారులు వెళ్ళరని ముఖ్యమంత్రిగారే స్వయంగా నిండు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయినప్పటికీ గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. అసెంబ్లీలో వాగ్దానం చేసి సంవత్సరం గడిచి నప్పటికీ గిరిజనులపై కేసులను ప్రభుత్వం ఉపసం హరించుకోలేదు. ఈసారి హరితహారం సందర్భంగా మళ్ళీ పోడు వ్యవసాయం చేసుకోకుండా అధికారులు అడ్డుపడుతూ దున్ననివ్వడం లేదు. ఖమ్మం జిల్లాలో కేవలం 86 వేల ఎకరాలలోని లబ్ధి దారులకు పట్టాలు ఇచ్చారు కానీ వాటిలో చాలా వాటిని దున్నుకోనివ్వడం లేదు. భూములకు వెళ్లిన రైతులను అరెస్టులు చేశారు. దీనిపైన ఉన్నతాధికారులతో సమగ్రమైన విచారణ జరి పించాలని ిసీపీఐ కోరుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గిరిజనులను బ్రతకనివ్వరా, వారిని బజారుపాలు చేస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది. దళితులకు, గిరిజను లకు భూమిలేని కుటుంబానికి మూడెకరాల భూమి కొని ఇస్తామని వాగ్దానం చేశారు. అమలులో మాత్రం నత్తతో పోటీ పడుతున్నారు. గిరిజనులు బానిసలుగానే ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నదా! అందుకే మూడెకరాల వాగ్దానాన్ని అమలు చేయడం లేదా? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సబ్బండవర్ణాలు భాగస్వాములైన విషయం పాలకు లకు గుర్తు లేదా! ఈ రాష్ట్రంలో పలుకుబడి కలిగిన అనేక మంది భూ దొంగలు, కబ్జాకోరులున్నారు. వారి జోలికి వెళ్లరు? వారినుంచి భూములను స్వాధీనం చేసుకోరు. ప్రభుత్వానికి పోలీసులకు పేదలంటే చులకన భావముండటం మానవత్వం అనిపించు కోదు. పైగా అనుభవిస్తున్న భూములకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా హరితహారం పేరుతో దానిని కూడా లాక్కుంటు న్నారు. అందుకేప్రభుత్వం ఇప్పటికైనా సమీక్షించు కోవాలి. ఆలోచనలో మార్పు చేసుకోవాలి. లేకపోతే ప్రభుత్వం అణచివేతకు నిరసన ఉద్యమాలు కొనసా గక తప్పదు. తక్షణమే 2006 అటవీ భూముల హక్కుల చట్టాన్ని అనుసరించి అర్హులైన పేదలందరికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలి. రెవెన్యూ, అటవీ భూముల సరి హద్దు నిర్ధారణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి - చాడ వెంకట్‌రెడ్డి మొబైల్ : 94909 52301 -
కంచే చేను మేస్తే..
►రెవెన్యూ సిబ్బంది చేతివాటం ►పేరు, సర్వే నంబర్లు లేకుండా పట్టాలు ►వీఆర్వోలు, వారి బంధువుల పేర్లతో భూముల మార్పు ►పట్టా భూములుగా మారుతున్న ప్రభుత్వ భూములు కలువాయి మండలం నూకనపల్లిలో సర్వే నంబర్ 239-1లో రెండు ఎకరాల భూమి మీరయ్య పేరుతో ఉంది. ఈ భూమిని స్థానిక వీఆర్వో తన తల్లిపేరుతో మార్పు చేశాడు.నెల్లూరు రూరల్ పరిధిలోని సౌత్మోపురు గ్రామంలో సర్వే నంబర్ 89-డీలో 2.74 ఎకరాల భూమి వెంకటసుబ్బారెడ్డి పేరుతో ఉంది. దీనిని వీఆర్వో తన పేరుతో మార్పు చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరిగాయి. కంచే చేను మేసిన చందాన రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. పేదల భూములు పరిరక్షించాల్సిన రెవెన్యూ సిబ్బంది రాబందుల్లా మారుతున్నారు. చేతివాటం ప్రదర్శించి నిరుపేదల భూములును ఆక్రమించి పేర్లు మార్పు చేస్తున్నారు. నెల్లూరు(పొగతోట) : అల్లూరుకు చెందిన సత్యనారాయణకు సర్వే నంబర్ 348-1లో ఎనిమిది ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి భూముల అనుభవం మరోకరి పేరుతో ఉందని రికార్డులో నమోదు చేశారు. పాసుపుస్తకాల కోసం సత్యనారాయణ అధికారుల చుట్టు తిరుగుతుంటే భూములు నీపేరుతో లేవని అధికారులు చెబుతున్నారు. చిల్లకూరు మండలంలో ఇదే పరిస్థితి. సమస్య ఏంటని మండల రెవెన్యూ అధికారిని ప్రశ్నిస్తే పక్క పోలం అతను ఫిర్యాదు చేశాడు. దీంతో పాసు పుస్తకాలు ఇవ్వడం కుదరదని చెప్పడం గమనర్హం. ఇలా రెవెన్యూలో జరుగుతున్న లీలలు అన్నీఇన్ని కావు. కొందరు అధికారులు రెవెన్యూ భూములను దర్జాగా పట్టా భూములుగా మార్చేస్తున్నారు. పేరు, సర్వే నంబర్లు లేకుండా నివాసస్థలాలు, భూముల కేటాయింపు పట్టాలు బయటకు వస్తున్నాయి. పట్టా వెనుక తహసీల్దార్ సంతకం, కార్యాలయం స్టాంప్ వేసి ఉంటున్నాయి. నాలుగేళ్ల క్రితం నెల్లూరు తహసీల్దార్‌గా పని చేసిన అధికారి నేటికి నివాసస్థల పట్టాలు ఇస్తున్నారు. ఒక్కొక్క పట్టా రూ.లక్ష - 2 లక్షల వరకు పలుకుతోంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారిపోయాయి. అధికారులు, సిబ్బంది కుమ్మకై భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. నష్టపోయిన బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరగడం వారి వంతైంది. ఆక్రమణల పర్వం.. జిల్లా పరిశ్రమల స్థాపనకు అనుకులమైన ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో భూముల విలువ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు అధికంగా జరుగుతున్నాయి. అధికారపార్టీని అడ్డుపెట్టుకొని కొందరు రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతూ భూములు ఆక్రమిస్తున్నారు. ఈ ప్రక్రియలో కోట్లాది రూపాయాలు చేతులు మారుతున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ సిబ్బందిపై అనేక ఫిర్యాదులు వస్తున్నా ఉన్నాతాధికారులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపులేకుండాపోతుంది. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడే రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. భూముల పేర్లు మార్పు విషయం పరిశీలిస్తాం. పేర్లు మార్పు చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు పరిరక్షించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. న్యాయం చేయండి : గ్రామంలోని సర్వే నంబర్ 239-1లో రెండు ఎకరాల భూమిని 1992లో నా భర్త మీరయ్యకు కేటాయించి పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి భూమి సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. రెవెన్యూ సిబ్బంది భూమిని అతని తల్లి పేరుతో మార్పు చేసుకున్నాడు. జిల్లా అధికారులు విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. - ఖాసింబీ, నూకనపల్లి -
రెవెన్యూ భూములపై విచారణ: డిప్యూటీ సీఎం కేఈ
హైదరాబాద్: రెవెన్యూ భూముల వ్యవహారాల్లో వీఆర్వోలపై విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కే.ఈ. కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. పాస్ పుస్తకాలు లేకున్నా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించిన జీవోపై ఈ నెల 19న కేబినట్ సబ్ కమిటీతో చర్చిస్తామన్నారు. ఇక మీదట ఏపీఐఐసీ ద్వారా మాత్రమే భూములు కేటాయించడంపై సమీక్షించి నిర్ణయిస్తామన్నారు. -
బీ ఖాతాలకు త్వరలో మోక్షం
16న బీఎంపీసీ ఎన్నికలు 15న నామినేషన్ల స్వీకరణ అదే రోజు అభ్యర్థుల ప్రకటన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగర పరిధిలో రెవెన్యూ భూముల్లో నివేశన స్థలాలను (బీ ఖాతా) కొనుగోలు చేసి, ఏ ఖాతాల (క్రమబద్ధీకరణ) కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న వారికి శుభ వార్త. హైకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ (బీఎంపీసీ)కి ఈ నెల 16న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ కమిటీ ఏర్పాటయ్యే వరకు బీ ఖాతాలను ఏ ఖాతాలుగా మార్చవద్దని హైకో ర్టు ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. నగరంలో ఇప్పటికే అనుమతి పొందిన లేఔట్లు, వాటిల్లో నిర్మించిన అపార్ట్మెంట్లకు ఏ ఖాతాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. అయితే సొంతంగా నివేశనాలు కొనుగోలు చేసిన వారికి ఈ ఆదేశాలు వర్తించడం లేదు. రాష్ట్రంలోని పట్టణాల పరిధుల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను నిర్ణీత ఫీజు వసూలు చేయడం ద్వారా అక్రమ-సక్రమ పథకం కింద క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని వ్యక్తిగత నివేశనాలను ఈ పథకం కిందే చేర్చారు. అయితే బీఎంపీసీని ఏర్పాటు చేసేంత వరకు అలాంటి నివేశనాలను క్రమబద్ధీకరించవద్దని హైకోర్టు ఆదేశించింది. దీని వల్ల ఆ కమిటీ ఏర్పాటు కోసం వ్యక్తిగత నివేశనాలను కలిగి ఉన్న వారు ఇన్నాళ్లూ ఎదురు చూస్తూ గడిపారు. కమిటీని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం గత నెల 25న బెంగళూరు ప్రాంతీయ కమిషనర్‌కు సూచించింది. 18 మంది సభ్యులు .. బీఎంపీసీలో మొత్తం 18 మంది సభ్యులుంటారు. బీబీఎంపీ కార్పొరేటర్లు, బెంగళూరు మెట్రోపాలిటన్ ఏరియా (బీఎంఏ)లోని జిల్లా, తాలూకా, గ్రామ పంచాయతీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఆ 18 మందినీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. పంచాయతీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఇద్దరు సభ్యులను ఎన్నుకుంటారు. ఓటర్లందరూ పోటీ చేయడానికి అర్హులే. ఈ నెల 15న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమాలుంటాయి. అదే రోజు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఏకగ్రీవమైతే అదే రోజు వెల్లడిస్తారు. కాగా బీఎంపీసీలో పది మంది నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు. ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో పాటు జాతీయ రాజధాని ప్రాంతీయ ప్రణాళిక మండలి ఈ సభ్యులను నామినేట్ చేస్తుంది. -
వాడుతున్న ‘పచ్చతోరణం’
నీరుగారుతున్న పథకం భూములను గుర్తించలేదు మొక్కలను నాటించలేదు నాటిన చోటా రక్షణ లేదు ప్రయోజనం పొందని ఎస్సీ, ఎస్టీలు సగం మండలాలలోనూ అమలు కాలేదు పథకం అమలు కాని మండలాలు.. భిక్కనూర్, బీర్కూర్, బోధన్, ధర్పల్లి, గాంధారి, జక్రాన్‌పల్లి, కామారెడ్డి, కమ్మర్పల్లి, లింగంపేట్, మాచారెడ్డి, మద్నూర్, మాక్లూర్, మోర్తాడ్, నాగిరెడ్డిపేట్, నందిపేట్, సదాశివ్‌నగర్, వేల్పూర్, ఎల్లారెడ్డి. పథకం అమలైన మండలాలు.. ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ, భీమ్‌గల్, బిచ్కుంద, డిచ్పల్లి, దోమకొండ, జుక్కల్, కోటగిరి, న వీపేట్, నిజాంసాగర్, నిజామాబాద్, రెంజల్, సిరికొండ, తాడ్వాయి, వర్ని, ఎడపల్లి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలలోని పేదలకు లబ్ధి చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పచ్చతోరణం పథకం ఒక అడుగు ముందుకు...రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ఆర్థిక సంవత్సరం ఆరంభంలో మొదలైన ఈ పథకం ఆర్థిక సంవత్సరం ముగియవస్తున్నా నత్తనడక నడుస్తోంది. -మోర్తాడ్, న్యూస్‌లైన్ మోర్తాడ్, న్యూస్‌లైన్: జిల్లాలో ఎక్కడ కూడా పచ్చతోరణం పథకం కింద ఎస్సీ, ఎస్టీలు పెద్దగా లబ్ధి పొందిన దాఖలాలు లేవు. జిల్లాలో 36 మండలాలు ఉంటే 17 మండలాలలోనే పథకం అమలవుతోంది. మరో 18 మండలాలలో పథకం జాడ లేకుండా పోయింది. పిట్లంలో రెగ్యులర్ ఏపీఓ లేకపోవడంతో ఈ మండలానికి సంబంధించి పచ్చతోరణం ప్ర తిపాదనలు అధికారులకు అందలేదు. ఇందిర క్రాంతి పథకం ద్వారా లబ్ధిదారుల కోసం సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సర్వే జరిపి వివరాలను ఉపాధి హా మీ పథం అధికారులకు అందచేశారు. జిల్లాలో 790 మంది లబ్ధిదారులతో 1,39,530 మొక్కలు నాటించి వాటిని సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఉపాధిహామీ ద్వారా రెవెన్యూ భూములు, నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువుల శిఖం భూములు, రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రోడ్లకు ఇరువైపుల ఉన్న భూములు, ప్రభుత్వ శాఖల పరిధిలోని భూములలో ఇందిరమ్మ పచ్చతోరణానికి సంబంధించిన మొక్కలను పెంచాల్సి ఉంది. ఉపాధిహామీ పథకంలో కూలీలుగా పని చేసిన ఎస్సీ, ఎస్టీలకు మొక్క లను అప్పగించి, వాటిని సంరక్షించడానికి కొంత డబ్బును అందించాలి. అంతేకాక మొక్కలు పెరిగిన తరువాత వాటికి కాసిన పండ్లు, కాయలను విక్రయించుకుని లబ్ధి దారులు ప్రయోజనం పొందవచ్చు. ఇప్పటివరకు జిల్లాలో కేవలం 53 మంది లబ్ధిదారులతో 8,746 మొక్కలను నాటించారు. నిర్ణీత లక్ష్యంలో కనీసం పది శాతం కూడా లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించలేదు. ఎందుకిలా శిఖం భూములు, రెవెన్యూ భూములు కబ్జాదారుల చేతులలో ఉండటం, ఆర్అండ్బీ రహదారులను గుర్తించక పోవడంతో ఎస్సీ, ఎస్టీ లకు ఇందిరమ్మ పచ్చతోరణం పథకం అందని ద్రాక్షలాగా మారింది. 17 మండలాలలో పథకం అమలైనట్లు ఉపాధి హమీ అధికారులు చెబుతున్నా లక్ష్యానికి చేరరువలో లేకుండాపోయింది. పథకం అమలు దశలోనే భూములను గుర్తించక పోవడంతో లబ్ధిదారుల ఎంపికతోనే సరిపెట్టాల్సి వచ్చింది.రానున్న ఆర్థిక సంవత్సరంలో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం - కుమారస్వామి, ఏపీడీ డ్వామా రానున్న ఆర్థిక సంవత్సరంలో పచ్చతోరణం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. ఈ సంవత్సరం భూములు గుర్తించక పోవడంతో సంపూర్ణంగా అమలు చేయలేదు. ఆర్అండ్బీ రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, పంచాయతీ రోడ్లను గుర్తించి మొక్కలు నాటిస్తాం. పూర్తి స్థాయిలో పథకాన్ని అమలు చేస్తాం.